ప్రకృతికి రంగులద్దుతున్న టీచర్.. బటర్‌ ఫ్లైస్‌కు స్పెషల్ గార్డెన్స్

by Shyam |
ప్రకృతికి రంగులద్దుతున్న టీచర్.. బటర్‌ ఫ్లైస్‌కు స్పెషల్ గార్డెన్స్
X

దిశ, ఫీచర్స్ : హైదరాబాద్, సన్‌సిటీలోని ఓ గార్డెన్‌లో ఒక ఉపాధ్యాయురాలు నడుస్తోంది. ఆమె వైపు చూసిన విద్యార్థులంతా తానే ‘బటర్ ఫ్లై మేడమ్’ అంటూ గుసగుసలాడుకుంటున్నారు. ప్రకృతికి రంగులద్దుతున్నందుకే ఆమెకు ఆ పేరొచ్చింది. ఇంద్రధనస్సు వర్ణాలను ఒంటిపై పులుముకున్న సీతాకోకలకు తిరిగి జీవం పోస్తున్న ఆ టీచర్.. ఎడారి వంటి నగరంలో వాటి కోసం చిన్న ఒయాసిస్‌‌ను తలపించే గార్డెన్స్ సృష్టిస్తూ అవి మన చుట్టూ విహరించే పరిస్థితులను కల్పిస్తోంది. తన ఇంటి ఆవరణ, పనిచేసే పాఠశాలలోనే కాక పబ్లిక్ ప్లేసెస్, ఇతర పాఠశాలల్లోనూ ‘బటర్ ఫ్లై’ గార్డెన్స్ కోసం కృషి చేస్తోంది. ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయం నుంచి గ్లోబల్ టీచర్ సర్టిఫికేషన్ పొందిన ప్రకృతి ప్రేమికురాలే ‘రాధిక చితలపాటికి’.

ప్రపంచవ్యాప్తంగా 18 వేల సీతాకోకచిలుక జాతులు ఉండగా.. ఇండియాలో 1501 రకాలున్నాయని సమాచారం. పర్యావరణ సమతుల్యతకు దోహదపడే ఈ జీవులు అంతరిస్తే జీవ వైవిధ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదముంది. పుష్పాల ఫలదీకరణలోనూ ఇబ్బందులు తలెత్తుతాయి. కాగా ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న నేచర్ లవర్ రాధిక.. ఇంటి ఆవరణలో ఇక్సోరా(పొదలపై పెరిగే చిన్న చిన్న పువ్వులు, దాదాపుగా లిల్లీపుటీయన్స్‌కు రెడీమేడ్ బొకే లాంటివి), మిల్క్‌వీడ్, కరివేపాకు చెట్లను నాటింది. దీంతో అక్కడ సీతాకోకచిలుకలు తిరగడం మొదలుపెట్టాయి. క్రమంగా అక్కడే నివాసం ఏర్పరుచుకుని గుడ్లు కూడా పెట్టడంతో వాటి సంతతి వృద్ధి చెందింది. కాగా ఇతర ప్రదేశాల్లోనూ ఇలాంటి ప్రయత్నమే చేయాలనుకుంది. ఈ మేరకు మొదట తమ పాఠశాలలోనే యాజమాన్యం అనుమతితో 10×10 అడుగుల విస్తీర్ణంలో పలు మొక్కలను నాటి గ్రీన్ గార్డెన్ సృష్టించింది. పరాగసంపర్కం, గొంగళి పురుగులు, మాంసాహారులు, పర్యావరణ వ్యవస్థ తదితర అంశాలకు వాటిని కనెక్ట్ చేసి విద్యార్థులకు వివరించవచ్చని ఆమె తెలిపింది.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ‘బటర్ ఫ్లై’ గార్డెన్స్ నిర్మాణ ప్రణాళికలపై చర్చించేందుకు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీని కూడా కలిసింది. అంతేకాకుండా జీవవైవిధ్యం, మానవ ఆరోగ్యంపై నిర్వహించిన జాతీయ సదస్సులో ఆమె చేస్తున్న కృషిపై ప్రజెంటేషన్‌ కూడా ఇచ్చింది. ఆ తర్వాత ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ పాఠశాలల్లో సీతాకోకచిలుక తోటలను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. ఈ మేరకు ఆమె స్నేహితులు, పరిచయస్తులతో పాటు కస్తూర్బా గాంధీ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఫర్ ఉమెన్ ప్రిన్సిపాల్ కూడా ఆమె ప్రయత్నానికి ఆహ్వానం పలికారు.

‘మేము మొక్కలు సరఫరా చేసి, నాటేందుకు సాయపడతాం. అయితే పెరిగే క్రమంలో ఎరువులు లేదా పురుగుమందులను ఉపయోగించకూడదు. సీతాకోకచిలుకలను ఆకర్షించేందుకు అవసరమైన సూచనలు అందజేస్తాం. గొంగళి పురుగులను చూసి కనికరం లేకుండా కాలితో నలిపేయడం మానేయండని చాలా మంది విద్యార్థులకు సూచించాను. ఇప్పుడు ఎంతోమంది వాటిని కాపాడుతున్నారు, ఇది నా గొప్ప విజయాల్లో ఒకటిగా భావిస్తున్నా. సీతాకోకచిలుకలు కోల్డ్-బ్లడెడ్ జీవులు, అవి సూర్యునిలో విహరించటానికి ఇష్టపడతాయి. ఇక అవి తిరిగే ప్రదేశంలో ఒక రాయితో పాటు చిన్న కప్పులో నీరు ఏర్పాటుచేస్తే మంచిది’.
– రాధిక

Advertisement

Next Story

Most Viewed