పెరుగుతున్న మీడియం, హెవీ కమర్షియల్ వాహనాల అమ్మకాలు

by Harish |
పెరుగుతున్న మీడియం, హెవీ కమర్షియల్ వాహనాల అమ్మకాలు
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా కారణంగా దెబ్బతిన్న మీడియం, హెవీ కమర్షియల్ వాహనాల అమ్మకాలు కోలుకుంటున్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. దేశవ్యాప్తంగా నిర్మాణ, మైనింగ్ కార్యకలాపాలు, ముడిపదార్థాల డిమాండ్, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో రాబోయే నెలల్లో మీడియం, హెవీ కమర్షియల్ వాహనాల అమ్మకాలు మరింత మెరుగుపడతాయనే నమ్మకం ఉందని వారు పేర్కొన్నారు.

గతేడాది జులై నుంచి మీడియా, భారీ కమర్షియల్ వాహనాల అమ్మకాలు మెరుగుపడుతున్నాయని, ప్రస్తుతం ఈ ధోరణి ఇలాగే కొనసాగుతుందని అశోక్ లేలండ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అనుజ్ కతురియా చెప్పారు. ఇప్పుడిప్పుడే ఈ విభాగంలో పరిస్థితులు సాధారణ స్థాయికి చేరుకుంటున్నాయని, ఈ ఏడాది మార్చితో ముగిసే త్రైమాసికం సానుకూలంగా ఉండనుందని అనుజ్ కతురియా అభిప్రాయపడ్డారు. ‘ ఇటీవల మీడియం, హెవీ కమర్షియల్ వాహనాల అమ్మకాలు క్రమంగా కోలుకుంటున్నాయి. ఉక్కు, సిమెంట్, ఆటో, ఈ-కామర్స్ రంగాల్లో కార్యకలాపాలు వేగవంతమవుతున్న క్రమంలో ఈ డిమాండ్ వృద్ధి కనిపిస్తోందని’ టాటా మోటార్స్ కమర్షియల్ వాహన విభాగం అధ్యక్షుడు గిరీష్ వాహ్ వెల్లడించారు.

Advertisement

Next Story