రిజిస్టర్డ్ డాక్టర్ల వివరాలు పంపండి: ఎంసీఐ

by  |
రిజిస్టర్డ్ డాక్టర్ల వివరాలు పంపండి: ఎంసీఐ
X

దిశ, న్యూస్ బ్యూరో: రోజురోజుకూ దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుండడంతో భారత వైద్య మండలి రంగంలోకి దిగింది. పేషెంట్లకు వైద్య చికిత్స అందించడానికి వీలుగా ఇటీవల రాష్ట్రాల యూనిట్లలో కొత్తగా రిజిస్టర్ చేసుకున్న డాక్టర్ల సేవలను వినియోగించుకోవాలనుకుంటోంది. అందులో భాగంగా ఆయా రాష్ట్రాల యూనిట్ల పరిధిలో తాజాగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న క్వాలిఫైడ్ డాక్టర్ల సంఖ్య, వారి వివరాలను వెంటనే కేంద్ర యూనిట్‌కు పంపాల్సిందిగా సర్క్యులర్ జారీ చేసింది. ఆ డాక్టర్లు ఏ రంగంలో నిష్ణాతులో(స్పెషలిస్టులు) కూడా తెలియజేయాలని పేర్కొంది. అలాంటి డాక్టర్ల పేరు, రిజిస్ట్రేషన్ నంబరు, మొబైల్ నెంబరు, ఈ-మెయిల్ చిరునామా, పోస్టల్ చిరునామా, ఆ డాక్టర్ ఏ విభాగంలో ప్రత్యేకత కలిగినవారు తదితర వివరాలన్నింటినీ వీలైనంత తొందరగా ఈ-మెయిల్ ద్వారానే భారత వైద్య మండలి కేంద్ర కార్యాలయానికి పంపాలని అన్ని రాష్ట్రాల యూనిట్ల రిజిస్ట్రార్‌లకు ఆ సర్క్యులర్‌లో శనివారం విజ్ఞప్తి చేసింది.

ఎంబీబీఎస్ లేదా ఆ పై స్థాయి స్పెషలైజేషన్ కోర్సులు చేసిన డాక్టర్లు భారత వైద్య మండలికి చెందిన రాష్ట్రాల యూనిట్లలో పేర్లను రిజిస్ట్రేషన్ చేయించుకోవడం ఆనవాయితీ. అలాంటి వివరాలు ఎప్పటికప్పుడు కేంద్ర యూనిట్‌కు అనుసంధానం కావాలి. కానీ, ఇప్పటికింకా అలాంటి వ్యవస్థ లేకపోవడంతో రాష్ట్రాల యూనిట్లే సమయానుగుణంగా కేంద్ర యూనిట్‌కు పంపుతున్నాయి. కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న డాక్టర్ల వివరాలను రాష్ట్రాల యూనిట్లు పంపే వరకూ కేంద్ర యూనిట్‌కు తెలియడం లేదు. డాక్టర్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ వికేంద్రీకరణ కారణంగా ఈ సమస్య ఉత్పన్నమవుతోంది. ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర యూనిట్ దగ్గర అన్ని రాష్ట్రాల తాజా వివరాలు లేకపోవడంతో వాటిని తెప్పించుకోవడంపై దృష్టి పెట్టింది. ఆ జాబితాకు అనుగుణంగా అత్యవసర పరిస్థితి ఏర్పడితే వారి సేవలను వినియోగించుకోడానికి, పటిష్టమైన కార్యాచరణను రూపొందించుకోడానికి ఈ చర్యలకు శ్రీకారం చుట్టింది.

ఇప్పటికే అనేక రాష్ట్రాలు, విభాగాలు డాక్టర్ల, నర్సుల, పారా మెడకల్ సిబ్బంది, లాబ్ టెక్నీషియన్లు.. ఇలా అన్ని విభాగాల క్వాలిఫైడ్ స్టాఫ్ వివరాలను సేకరిస్తున్నాయి. ఆయా రంగాలకు చెందినవారి జాబితా కూడా సిద్ధమవుతోంది. దీనికి అదనంగా తాత్కాలిక ప్రాతిపదికన రిక్రూట్‌మెంట్‌కు కూడా శ్రీకారం చుట్టాయి. తెలంగాణ ప్రభుత్వం సుమారు రెండు వేల నర్సు పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. దక్షిణ మధ్య రైల్వే సైతం ఇలాంటి నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఇప్పుడు భారత వైద్య మండలి కూడా కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న డాక్టర్ల సేవలను సైతం కరోనా కట్టడి కోసం అవసరాన్ని బట్టి వినియోగించుకోవాలన్న ముందుచూపుతో జాబితాను సిద్ధం చేసుకుంటూ ఉంది.

Advertisement

Next Story

Most Viewed