ఉస్మానియా పాతభవనం కూల్చివేత దిశగా చర్యలు ?

by Shyam |
ఉస్మానియా పాతభవనం కూల్చివేత దిశగా చర్యలు ?
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: చారిత్రాత్మక ఉస్మానియా ఆస్పత్రి పాత భవనం కూల్చివేత దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సుమారు ఆరేళ్లుగా పాత భవనాన్ని కూల్చాలని కొంతమంది, కూల్చొద్దని మరికొందరు, దానిని అలాగే ఉంచి నూతన భవనాల నిర్మాణాలు చేపట్టాలని పలువురు డిమాండ్ చేస్తూ వచ్చారు. ఏకంగా న్యాయస్థానం మెట్లు ఎక్కారు. ఇదే క్రమంలో తెలంగాణ సర్కార్ పాత భవనంలో కొంతమంది రోగులను ఇతర భవనాల్లోకి తరలించి చికిత్సలు అందిస్తూ కొత్త బిల్డింగ్ విషయాన్ని ఎటూ తేల్చకుండా నాన్చుతూ వచ్చింది. అయితే మొన్న కురిసిన భారీ వర్షాలు ఉస్మానియా ఆస్పత్రి పాతభవనం భవిష్యత్‌ను తేల్చేశాయి. మొకాలి లోతులో నీరు వచ్చి చేరడంతో ప్రతిపక్షాలు గగ్గోలుపెట్టాయి. దీంతో ప్రభుత్వం కఠినమైన నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి.

తక్షణమే ఖాళీ చేయాలి: డీఎంఈ ఆదేశాలు

ఉస్మానియా ఆస్పత్రి పాత భవనాన్ని వెంటనే ఖాళీ చేయాలని డీఎంఈ రమేశ్‌రెడ్డి బుధవారం ఆదేశాలు జారీ చేశారు. పాత భవనాన్ని ఖాళీ చేసి సీల్ వేసి సంబంధిత సమాచారాన్ని వెంటనే అందచేయాలని డీఎంఈ కార్యాలయం నుండి ఆదేశాలు వెలువడ్డాయి. ఈ మేరకు ఆస్పత్రి సూపరింటెండెంట్ చర్యలు తీసుకోవాలని, పాత భవనంలోని రోగులను ఇతర భవనాల్లోని వార్డులలోకి తరలించాలని స్పష్టం చేశారు. దీంతో ఉస్మానియా ఆస్పత్రి పాతభవనం కూల్చేందుకు రంగం సిద్ధమైందనే అభిప్రాయాలు విన్పిస్తున్నాయి.

600 పడకలు తరలింపు

ఉస్మానియా ఆస్పత్రికి 1,168 పడకల సామర్థ్యం ఉండగా పాతభవనంలోని గ్రౌండ్, మొదటి, రెండవ అంతస్థులలో సగానికి పైగా 600 పడకలతో రోగులకు సేవలందిస్తున్నారు. ఇక్కడ జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్, సర్జికల్ గ్యాస్ట్రో, అనస్థీషియా, జనరల్ మెడిసిన్ హెచ్ఓడీ‌లు ఉన్నాయి. పాత భవనాన్ని ఖాళీ చేయాలనే డిమాండ్ గత పదేళ్లుగా వినపడుతున్నప్పటికీ 2015నుండి ఇది ఎక్కువైంది. 2015 జూలై 23న సీఎం కేసీఆర్ ఆస్పత్రిని సందర్శించి వారంలో ఖాళీ చేసి నూతన భవనం నిర్మాణం కోసం చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఇందుకు తగ్గట్లుగా రోగులను కింగ్ కోఠి జిల్లా ఆస్పత్రి, పేట్ల బుర్జుకు షిప్ట్ చేశారు. దీంతో గత రెండేళ్లుగా ఉస్మానియా మొదటి, రెండవ అంతస్థులు ఖాళీగానే ఉన్నాయి. ఇదిలా ఉండగా పాత భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లో ఇటీవల వరద ముంచెత్తే సమయానికి 65మంది రోగులు చికిత్సలు పొందుతున్నారు. మరుసటి రోజు వీరిని కులీ కుతుబ్ షా భవనంలోని షెల్టర్ రూమ్‌లోకి తరలించారు. ఇందులో 200 పడకల సామర్ధ్యం ఉండగా 150 పడకల వరకు ఖాళీగా ఉండడంతో అక్కడికి తరలించారు.

శస్త్ర చికిత్సలకు ఇబ్బందులయ్యే అవకాశం

ఉస్మానియా ఆస్పత్రి ఓపీ భవనంలో ప్రస్తుతం రెండు ఆపరేషన్ థియేటర్లలో ఆరు టేబుళ్లపై శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నారు. పాత భవనంలో మూడు థియేటర్లు ఉన్నప్పటికీ వాటిల్లో శస్త్ర చికిత్సలు చేయలేని పరిస్థితి ఏర్పడనుంది. వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ఆపరేషన్ థియేటర్‌లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేనిపక్షంలో శస్త్ర చికిత్సలు వాయిదా పడే ప్రమాదమూ లేక పోలేదు.

Advertisement

Next Story

Most Viewed