ఆసియా-పసిఫిక్ రీజియన్‌లో క్రిప్టో పేమెంట్ కార్డ్స్

by Harish |
ఆసియా-పసిఫిక్ రీజియన్‌లో క్రిప్టో పేమెంట్ కార్డ్స్
X

దిశ, ఫీచర్స్ : క్రిప్టోకరెన్సీకి ఆదరణ పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పేమెంట్ కార్డ్ నెట్‌వర్క్ మాస్టర్‌ కార్డ్.. ఆసియా-పసిఫిక్ రీజియన్‌లో క్రిప్టోకరెన్సీ-లింక్డ్ పేమెంట్ కార్డ్స్‌ను ప్రారంభించింది. వినియోగదారులు తమ డిజిటల్ ఆస్తులను ఫియట్ కరెన్సీ(ప్రభుత్వం జారీ చేసిన మనీ)గా మార్చడానికి ఈ కార్డ్ వీలు కల్పిస్తుందని కంపెనీ సోమవారం ప్రకటించింది. క్రిప్టోకరెన్సీ చెల్లింపును అంగీకరించని వ్యాపారులు, డిజిటల్ అసెట్స్ చెల్లించాలనుకునే కస్టమర్‌ల మధ్య వారధిగా ఈ కార్డ్స్ ఉపయోగపడనున్నాయి.

హాంకాంగ్‌కు చెందిన అంబర్ గ్రూప్, థాయ్‌లాండ్- బిట్‌కబ్, ఆస్ట్రేలియా- కాయిన్‌జార్‌తో అలయన్స్ కలిగి ఉన్న ఆసియా-పసిఫిక్ రీజియన్‌లోని వినియోగదారులు, వ్యాపారస్తులు క్రిప్టో-ప్రారంభించిన క్రెడిట్, డెబిట్ లేదా ప్రీ-పెయిడ్ కార్డ్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మాస్టర్ కార్డ్ ఆమోదించబడే ఏ చోటైనా వీటిని ఖర్చు చేయవచ్చు. QR కోడ్స్, బయోమెట్రిక్స్, కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్‌తో పాటుగా నాలుగో చెల్లింపు పద్ధతిగా క్రిప్టోకరెన్సీ మారిందని మాస్టర్‌కార్డ్ సర్వేలో వెల్లడైంది. 94 శాతం మంది వినియోగదారులు వీటిలో కనీసం ఏదో ఒకదాన్ని ఉపయోగించాలని ఆలోచిస్తున్నారు. క్రిప్టోకరెన్సీని ఉపయోగించేందుకు, దీని గురించి తెలుసుకునేందుకు సాధారణ జనాభాతో పోలిస్తే మిలీనియల్స్ ఎక్కువ ఇష్టపడతారని నివేదిక పేర్కొంది.

క్రిప్టోకరెన్సీ పట్ల అన్ని వర్గాల్లోనూ ఆసక్తి పెరగడంతో వారికి అనువైన ప్లాట్‌ఫామ్స్, ఫెసిలిటీస్ కల్పించడం కూడా అవసరం. సర్వే ప్రకారం వచ్చే ఏడాదిలో 45 శాతం మంది క్రిప్టోకరెన్సీ ఉపయోగించడాన్ని పరిగణించే అవకాశం ఉన్నట్లు వెల్లడైంది. క్రిప్టో వినియోగదారుల సంఖ్య వృద్ధి చెందుతుండటంతో ఆసియా-పసిఫిక్ కోసం ఈ కార్డ్స్ అందుబాటులోకి తీసుకొచ్చాం. కస్టమర్స్ వీటితో తప్పకుండా ఉత్తమ ఫలితాలు అందుకుంటారు. – రామ శ్రీధర్, మాస్టర్ కార్డ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్

Advertisement

Next Story