‘ఆపరేషన్ ప్రహార్’ను తిప్పికొడుతాం.. మావోయిస్టు పార్టీ వార్నింగ్

by Anukaran |
‘ఆపరేషన్ ప్రహార్’ను తిప్పికొడుతాం.. మావోయిస్టు పార్టీ వార్నింగ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : దేశ సంపదను, సహజ వనరులను కార్పొరేట్లకు అప్పగించడం కోసమే పాలకవర్గాలు పనిచేస్తున్నాయని, ఈ ఆటలు సాగనివ్వనందుకే మావోయిస్టు పార్టీపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ’ఆపరేషన్ ప్రహార్’ పేరుతో సంయుక్త దాడులకు దిగుతున్నాయని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్రకమిటీ ప్రతినిధి జగన్ ఆరోపించారు. ’హరితహారం ’, ’అభయారణ్యం ’ లాంటివన్నీ బూటకమని, సహజ వనరులను కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టడానికి ఉద్దేశించినవేనన్నారు. తెలంగాణను మావోయిస్టు రహిత రాష్ట్రంగా చేస్తామంటూ గంభీర ప్రకటనలు చేస్తూ కొత్తగూడెంలో కొత్తగా పోలీసు ట్రైనింగ్ సెంటర్‌ను రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పిందని గుర్తుచేశారు. ఎన్ని కుట్రలకు, దాడులకు పాల్పడినా ప్రజల మద్దతుతో ’ఆపరేషన్ ప్రహార్’ను ఓడిస్తామని, సైనిక దాడులకు తగిన గుణపాఠం నేర్పుతామని ఒక ప్రకటనలో మావోయిస్టు పార్టీ ప్రతినిధి జగన్ హెచ్చరించారు.

జాతీయ భద్రతా సలహాదారు విజయకుమార్ గతేడాది అక్టోబర్ 5న తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల డీజీపీలతో వెంకటాపురంలో చర్చించినప్పుడే ’ఆపరేషన్ ప్రహార్’లో భాగంగా సైనిక దాడికి నిర్ణయం జరిగిందని, దీన్ని ప్రజల సహకారంతో తిప్పికొడతామని జగన్ ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నరహంతక దాడులకు పాల్పడుతూ దేశవ్యాప్తంగా ఏడాది కాలంలో 300 మందికి పైగా ప్రజలను, పీఎల్‌జీఏ సభ్యులను హతమార్చాయని, ఇందులో దండకారణ్యంలోనే సుమారు 150 మంది ఉన్నారని పేర్కొన్నారు. బూటకపు ఎన్‌కౌంటర్లతో టెర్రర్ సృష్టిస్తున్నాయని, చివరకు విష ప్రయోగం కూడా చేస్తున్నాయని, తమ పార్టీకి చెందిన విజేందర్ కేవలం విషాహారం కారణంగానే చనిపోయాడని, పదుల సంఖ్యలో అనారోగ్యం పాలయ్యారని గుర్తుచేశారు.

తప్పనిసరి పరిస్థితుల్లోనే తమ పార్టీ ప్రతిదాడి చేయాల్సి వస్తోందని, ప్రజల సంపదను పరిరక్షించడం, సహజ వనరులను కాపాడుకోవడం ప్రతీ ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు. ’పోడు ’, ’హరితహారం ’, ’అడవుల అభివృద్ధి’ పేరుతో ఆదివాసులను అడవి నుంచి ఏరివేసే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ నెల 26న భారత్ బంద్‌లో వివిధ సెక్షన్ల ప్రజలు పాల్గొనాలని, మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed