సామాజిక సేవలో.. మేము సైతం

by Shyam |
సామాజిక సేవలో.. మేము సైతం
X

దిశ, మహబూబ్‌నగర్:

నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్-19) కట్టడికి విధించిన లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్నవారిని ఆదుకునేందుకు పలువురు దాతలు మేము సైతం..అంటూ ముందుకొస్తున్నారు. తినడానికి తిండి దొరకడమే గగనమైన వేళ పలువురికి అన్నదానం చేసి సామాజిక స్పృహ, స్ఫూర్తిని చాటుతున్నారు. జిల్లాలో చాలా మంది యాచించగా వచ్చిన డబ్బుతో పొట్ట నింపుకునే వారు ఇప్పుడు రోడ్లపై నివాసం సాగిస్తున్నారు. కొంత మంది వలస కార్మికులు ఉపాధి కోల్పోయి సొంతింటికి పయనమవుతున్నారు. వారికి మార్గమధ్యలో తిండి లేక కనీసం తాగడానికి నీరు లేక ఆపసోపాలు పడుతున్నారు. వీరందరినీ పలువురు దాతలు ఆదుకుంటున్నారు. భోజనం, తాగు నీరు, పండ్లు పంపిణీ చేసి తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.

మాస్కులు, శానిటైజర్ల పంపిణీ..

లాక్ డౌన్ సందర్భంగా రోడ్ల‌పై విధులు నిర్వహిస్తున్న పోలీసులు, వైద్య సిబ్బంది, ఇతర శాఖల అధికారులకూ దాతలు భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. వారి అకలిని తీర్చే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో రాష్ర్ట వ్యాప్తంగా కొవిడ్ 19 కారణంగా ప్రస్తుతం మాస్కులు, శానిటైజర్లు, హాండ్ వాష్ల కొరత ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డబ్బులు ఇచ్చి కొందామన్నా అవి లభించే పరిస్థితి లేదు. ఒకవైపు రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోవడంతో పాటు హైదరాబాద్‌లో వీటి వినియోగం పెరిగింది. దీంతో ఈ సామగ్రి జిల్లాలకు చేరుకోవడం లేదని వ్యాపారులు అంటున్నారు. దీంతో కొంత మంది దాతలు ముందుకు వచ్చి వాటిని పంపిణీ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఫార్మసిస్టు అసోసియేషన్ ఆధ్వర్యంలో వీటిని పంపిణీ చేసి ఆదర్శంగా నిలుస్తున్నారు.

Tags: donors, Philanthropy, food, masks distribution, covid 19, health dept, migrant workers

Advertisement

Next Story

Most Viewed