చుక్క నీరివ్వని ‘మంజీరా’

by Shyam |
చుక్క నీరివ్వని ‘మంజీరా’
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ :

నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వర ప్రదాయని నిజాంసాగర్ ప్రాజెక్టుకు ఈ సీజన్ లో ఎగువ నుంచి చుక్క నీరు రాలేదు. వర్షాకాలంలో మూడు నెలల కాలం ముగిసినా ఎగువన ఉన్న సింగూర్ నుంచి కిందికి నీటిని వదల్లేదు. దీంతో 17 టీఎంసీల పూర్తిస్థాయి నీటిమట్టానికి గాను ప్రస్తుతం 2.5 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు మంజీర నదిపై నిజాం సాగర్ మండలం అచ్చంపేట వద్ద 1923 లో నిజాంసాగర్ ప్రాజెక్టును నిర్మించారు. దీని పరిధిలో 2.8 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ చంద్రబాబు హయాంలో నిజాంసాగర్ ప్రాజెక్టు ఎగువ భాగంలో మంజీరా నదిపై మెదక్ జిల్లా సింగూర్ వద్ద 30 టీఎంసీల సామర్థ్యంతో సింగూర్ ప్రాజెక్టును నిర్మించారు. అక్కడ నుంచి హైదరాబాద్​ నగరానికి తాగునీటిని తరలించినప్పటి నుంచి నిజాంసాగర్ ప్రాజెక్టులోకి నీరు రావడం గగణమైంది. అప్పటి నుంచి సింగూరు ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండితేనే నీటిని దిగువకు వదులుతున్నారు.

కనెక్టివిటీ కాలువ లేకపోవడం వల్లే..

ఉత్తర తెలంగాణకు వర ప్రదాయనిగా పేరుగాంచిన శ్రీరాంసాగర్ నిజామాబాద్ జిల్లాలో ఉన్నప్పటికీ దాని ద్వారా ఒక్క లక్ష్మి కాలువ, ఆలీసాగర్- గుత్ప ఎత్తిపోతల ద్వారా మాత్ర మే నిజామాబాద్ కు సాగునీరందుతోంది. ఇటీవల వర్షాల కు మహారాష్ర్ట, కర్నాటకలో భారీ వర్షాలు కురిసినా, ఆ వరద నీరు నల్లవాగు ద్వారా దిగువన ఉన్న నిజాం సాగర్ లోకి వెళ్లకుండా కాలువల ద్వారా గోదావరిలో కలిసిపోయాయి. నల్లవాగు నీరు నిజాం సాగర్ ప్రాజెక్టుకు కనెక్టివిటీ కాలువ లేకపోవడం వల్ల వరద దిగువకు వెళ్లిపోయింది. దాంతో ఈ సీజన్​లో మంజీరా నది ద్వారా ఒక్క చుక్క నీరు కూడా నిజాంసాగర్​లోకి రాకుండా పోయాయి.

ఈ సీజన్​కు ఇంతేనా..

ఉమ్మడి జిల్లాలో సింహభాగం సాగు నిజాంసాగర్ నీటిపైనే ఆధారపడుతుంది. 2016లో వరదలు వచ్చినప్పుడు మాత్రమే నిజాం సాగర్ పూర్తిగా నిండింది. అప్పుడొక్కసారే వరద గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదిలారు. శ్రీరాం సాగర్ ప్రాజె క్టుకు ఎగువ భాగంలో మహారాష్ర్టలో చాలా ప్రాజెక్టులు కట్టడంతో 2017లో ఆ ప్రాజెక్టులోకి చుక్కనీరు రాలేదు. దాంతో ప్రభుత్వం నిజాం సాగర్ ఫ్లడ్​ గేట్లను ఎత్తి 7 టీఎంసీల నీటిని విడుదల చేసి ఎస్సారెస్పీని ఆదుకున్నది. ఈ ఏడాది మార్చిలో ఉన్న నీటిని రెండు తడుల కోసం కిందికి వదిలి యాసంగి సీజన్ లో పంటలను ఆదుకున్నది. నిజాం సాగర్ ప్రాజెక్టు వట్టిపోతుండడంతో కాళేశ్వరం జలాలతో నిజాంసాగర్ ప్రాజెక్టు నింపడానికి చేపట్టిన మల్లన్నసాగర్ నీరు హల్దివాగు వరకు జరుగుతున్న పనులు నత్తతో పోటీపడుతున్నాయి. దాంతో నిజాం సాగర్ కు ఈ సీజన్ లో నీరు రావడమనేది కలాగానే మిగిలిపోయింది.

నిజాంసాగర్ ప్రాజెక్టులో 2.5 టీఎంసీల నీరు నిల్వ ఉందంటే అది పోచారం ప్రాజెక్టు నీటి విడుదలే కారణం. ఈ సీజన్లో జూన్ 1న నిజాం సాగర్ లో ఉన్న నీరు 0.8 టీఎంసీలు మాత్రమే. నాగిరెడ్డి పేట్ మండలం పోచారం ప్రాజెక్టుకు ఎగువ భాగంలో కురిసిన భారీ వర్షాలతో 1.820 టీఎంసీల సామర్థ్యం కలిగిన పోచారం ప్రాజెక్టు నిండగానే కాలువ గేట్లను ఎత్తి 1.70 టీఎంసీల నీటిని వదిలారు. దాంతో ఆ నీరు నిజాం సాగర్ ప్రాజెక్టులోకి వచ్చి చేరింది. పోచారం ప్రాజెక్టు నీటి విడుదల వల్ల నిజాం సాగర్ లో కి రెండు టీఎంసీల నీరు వచ్చి చేరింది. అది కూడా ఆ సమయంలో ఓ మోస్తరు వర్షాలతో పాటు నాలుగు రోజుల పా టు కురిసిన భారీ వర్షాలే కారణమని చెప్పవచ్చు. ఈ సీజన్ లో మాత్రం నిజాం సాగర్ ప్రాజెక్టు నుంచి నుంచి దిగువ వ్యవసాయానికి ఒక్క చుక్కనీరు విడుదల చేసే అవకాశాలు లేవని అధికారులు చెబుతున్నారు. వర్షాకాలంలో అప్పుడే మూడు నెలలు ముగిసినా మంజీరా నదికి వరద రాలేదు. ఎగువన ఉన్న సింగూరు ప్రాజెక్టూ నిండలేదు. దిగువకు నీరు విడుదల కానీ పరిస్థితులలో ఆయకట్టు రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed