గాంధీ భవన్‌లో నాయకుల సమావేశం.. ఈ రోజే కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు ?

by Anukaran |   ( Updated:2021-08-19 01:34:04.0  )
గాంధీ భవన్‌లో నాయకుల సమావేశం.. ఈ రోజే కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు ?
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కాంగ్రెస్​ పార్టీకి అనుకూల పవనాలు వీస్తున్నట్లు ఆ పార్టీ అధిష్టానం భావిస్తోంది. దీంతో ఏఐసీసీ రంగంలోకి దిగింది. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్​ మాణిక్కం ఠాగూర్‌ను అత్యవసరంగా రాష్ట్రానికి పంపించిది. అధిష్టానం ఆదేశాలతో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలపై ఠాగూర్ దృష్టిసారించారు. రెండు రోజుల పాటు నగరంలోనే ఠాగూర్ ఉండి నేతలతో సమీక్షించనున్నారు. కొంతమంది క్షేత్రస్థాయి నాయకులతో సమావేశం కానున్నారు. దీంతో గాంధీభవన్‌కు నేతల తాకిడి ఎక్కువగా ఉంది. ఉదయం నుంచే గాంధీభవన్‌లో నాయకుల సందడి నెలకొంది.

ఈ నేపథ్యంలో పార్టీ నేతలతో వరుస సమావేశాలను నిర్వహిస్తున్నారు. గురువారం ఉదయం 11 గంటల నుంచే గాంధీభవన్‌లో సమావేశాలు మొదలయ్యాయి. పార్టీకి చెందిన ప్రముఖులు, ముందుగా ఇందిరా భవన్‌లో అసెంబ్లీ సమన్వయకర్తలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్​ పార్టీ చేపట్టిన గిరిజన, దళిత దండోరాపై అసెంబ్లీ‌ కోఆర్డినేటర్లతో చర్చించనున్నారు. ఇప్పటికే రెండు సభలు సక్సెస్​ కావడంతో పార్టీలో ఊపు వచ్చింది. ఇక నుంచి అన్ని పార్లమెంట్​ సెగ్మెంట్ల పరిధిలో దండోరా నిరసనలు చేపట్టనుండగా.. వీటిని విజయవంతం చేసేందుకు నేతలు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇక మధ్యాహ్నం 3 గంటలకు టీపీసీసీ ప్రెసిడెంట్, సీఎల్పీ, వర్కింగ్ ప్రెసిడెంట్లు, సీనియర్ వైస్ ప్రెసిడెంట్లతో భేటీ కానున్నారు. సాయంత్రం 7గంటలకు కాంగ్రెస్ సీనియర్ నేతలతో సమావేశం అవుతారు. దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలు, భవిష్యత్ కార్యాచరణపై నేతలతో ఠాగూర్ చర్చించడమే ప్రధాన ఎజెండాగా సమావేశం నిర్వహిస్తున్నారు.

హుజురాబాద్​ అభ్యర్థిపై తేల్చనున్న ఠాగూర్​

హుజురాబాద్ ఉప ఎన్నిక అభ్యర్థిత్వం దాదాపుగా నేడు ఖరారు కానుంది. ఇప్పటికే కొండా సురేఖను పోటికి దింపాలని నేతలు నిర్ణయించారు. కానీ ఎన్నికల కమిటీ చైర్మన్​గా ఉన్న దామోదర రాజనర్సింహ మాత్రం స్థానిక నేతలను ఎంపిక చేయాలంటూ అధిష్టానానికి సూచించారు. అయితే ప్రస్తుతం ఉప ఎన్నికలో సురేఖను పోటీకి దింపిన తర్వాత అక్కడి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుందామని, ఇక నుంచి స్థానిక నేతలకు చాన్స్​ ఇవ్వాలనే నిర్ణయాన్ని పార్టీ అధిష్టానం కలిసి చర్చించాలని రాజనర్సింహకు సూచించినట్లు సమాచారం. కొండా సురేఖకు టికెట్​ ఇవ్వడంపై నేతలంతా ఏకాభిప్రాయానికి వచ్చినా, దామోదర రాజనర్సింహ పెట్టిన ఈ ప్రతిపాదనతో కొంత చర్చ సాగనుంది. దీనిపై ఇవాళ రాత్రి వరకు నిర్ణయం తీసుకోనున్నారు.

Advertisement

Next Story

Most Viewed