పసిడి ఛాయకు మ్యాంగో ప్యాక్

by Sujitha Rachapalli |
పసిడి ఛాయకు మ్యాంగో ప్యాక్
X

దిశ, వెబ్ డెస్క్ :
బంగారు వర్ణంలో కాంతులీనే మామిడి పండు రుచిలో మధురం.. సౌందర్య సాధనలో మృధుమధురం. మామిడిలో ఉండే విటమిన్లు, యాంటీఆక్సిడెంట్స్‌ వల్ల చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు కలుగుతాయి. వేసవిలో విరివిగా లభించే మామిడి లో పోషకాలతో పాటు.. చర్మానికి మెరుపునిచ్చే విటమిన్లు కూడా ఉంటాయి. హాట్ సమ్మర్ లో కూల్ గా మెరిసిపోవడానికి మధురఫలంతో ఈ ప్యాక్ లు ట్రై చేయండి.

మామిడిపండ్లలో ఉంటే విటమిన్‌-ఎ ముఖంపై జిడ్డును తగ్గించి మొటిమలు రాకుండా నియంత్రిస్తుంది. అలాగే చర్మం మీద గీతలు, ముడతలను నివారిస్తుంది. ఈ పండులోని యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్‌, స్కిన్‌ ఏజింగ్‌కు కారణమయ్యే ప్రమాదకర ఫ్రీ ర్యాడికల్స్‌ నుంచి చర్మానికి రక్షణ కల్పిస్తాయి. మామిడిలోని ఏ, సీ, ఈ విటమిన్లతో పాటు, మినరల్స్ చర్మ సమస్యలు లేకుండా చేస్తాయి. ఎండ వల్ల కమిలిన చర్మానికి మామిడి పూత బాగా ఉపయోగపడుతుంది.

అరగంట పూత పూస్తే :

మామిడిలో ఉండే విటమిన్‌-ఎ, బీటా కెరోటిన్‌లు చర్మాన్ని మెరిపిస్తాయి. మామిడి పండు గుజ్జును రాత్రిళ్లు ముఖానికి రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ముఖానికి గుజ్జు రాసుకుని అర గంట సేపు ఉంచుకుని, నిద్రపోయే ముందు కడిగేయాలి. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల మృతకణాలు తొలిగిపోవడంతో పాటు చర్మం కాంతులీనుతుంది.

మామిడి స్క్రబ్ :

నాలుగు టేబుల్ స్పూ న్ల మామిడి పండు గుజ్జుకు అరకప్పు ఓట్స్‌, కొన్ని పాలు చేర్చి చిక్కటి పేస్ట్‌ను తయారు చేయాలి. ఈ పేస్ట్ ను ముఖానికి రాసుకుని.. కాసేపు మసాజ్ చేయాలి. ఈ ప్యాక్ ను 15 నిముషాల పాటు ఉంచుకుంటే సరిపోతుంది. ఆరిన తర్వాత చన్నీళ్లతో శుభ్రం చేసుకోవాలి.

బ్లాక్ హెడ్స్ కు చెక్ :

ఒక స్పూన్‌ మామిడిపండు గుజ్జులో ఒక స్పూను పచ్చి పాలు, రెండు స్పూన్ల తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని సున్నితంగా మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల బ్లాక్‌, వైట్‌ హెడ్స్‌ తొలగిపోతాయి.

దద్దులు పోతాయి :

పచ్చి మామిడి గుజ్జు చర్మంపై రాయడం వల్ల చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయి. ముఖం మీదే కావకుండా చేతులు, మోచేతులు, మోకాళ్ల మీద దద్దుల వంటివి ఉంటే కూడా దీంతో తొలగిపోతాయి.

నిగనిగలాడే జుట్టు కోసం :

మామిడి పండు గుజ్జుకు పుల్లటి పెరుగు కలిపి వెంట్రుకలకు పట్టించాలి. 30 నిమిషాలు ఆగి తలస్నానం చేస్తే చుండ్రు వదిలి జుట్టు పట్టుకుచ్చులా తయారవుతుంది.
మామిడి టెంకెను కొన్ని రోజులు నూనెలో నానబెట్టాలి. ఈ నూనెను జుట్టుకు రాసుకుంటే తెల్ల జుట్టు సమస్య నుంచి బయటపడొచ్చు

Tags: mango, beauty tips, skin care , seasonal fruit

Advertisement

Next Story

Most Viewed