ఓటీటీకే అందరి ఓటు.. మంచు ఫ్యామిలీ సూపర్ ప్లాన్

by Shyam |
ఓటీటీకే అందరి ఓటు.. మంచు ఫ్యామిలీ సూపర్ ప్లాన్
X

కరోనా మహమ్మారి విజృంభణతో జనం నాలుగు నెలలుగా ఇంటికే పరిమితమయ్యారు. ఇప్పుడిప్పుడే ఇళ్ల నుంచి బయటకు వస్తున్నా.. నలుగురు ఉన్న చోట తిరిగేందుకు భయపడుతూనే ఉన్నారు. ఒకవేళ అలా ఉండాల్సి వస్తే మాస్క్, శానిటైజర్, ఫిజికల్ డిస్టెన్స్ అంటూ చాలా జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఇలాంటి సమయంలో థియేటర్లు తెరిచినా సరే, జనం సినిమాలు చూసేందుకు వెళ్లి ముప్పును కొని తెచ్చుకోలేరు. అందుకే థియేటర్ యజమానులు సైతం సినిమా హాల్స్ ఓపెనింగ్ జోలికి పోకుండా కామ్‌గా ఉంటున్నారు.

ఎలాగూ ఓటీటీ కంటెంట్ ప్రేక్షకులను అలరిస్తుండటంతో సినిమాలకు బదులుగా వెబ్ సిరీస్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు దర్శక, నిర్మాతలు. ఇప్పటికే చాలా మంది సక్సెస్‌ఫుల్ డైరెక్టర్లు ఓటీటీ కంటెంట్‌ను డైరెక్ట్ చేసేందుకు సిద్ధమవుతుండగా.. పేరున్న నిర్మాతలు సైతం పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొత్తగా మెగాస్టార్ చిరు పెద్ద కూతురు కూడా ఓ వెబ్ సిరీస్ నిర్మిస్తోంది. ఈ నేపథ్యంలోనే ట్రెండ్‌కు అనుగుణంగా మారిపోవాలని.. తనకు కూడా వెబ్ సిరీస్ చేసేందుకు ఆసక్తి ఉందని చెప్పాడు చిరు. ఒక్క వెబ్ సిరీస్ చేసి క్లిక్ అయితే నేషనల్ వైడ్‌గా ఫుల్ పాపులారిటీ వస్తుండటంతో హీరోయిన్లు సైతం వెబ్ కంటెంట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. ఈ క్రమంలో సౌత్ నుంచి సమంత, కాజల్ అగర్వాల్, సాయి పల్లవి లాంటి హీరోయిన్లు ఆల్రెడీ పలు ప్రాజెక్ట్‌లు ఓకే చేసేశారు కూడా.

ఇక ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ విషయానికొస్తే.. కరోనా కాలాన్ని చక్కగా క్యాష్ చేసుకుంటున్నారు. సినిమాలను డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోనే రిలీజ్ చేస్తూ భారీ లాభాలు గడిస్తున్నారు. కానీ ఈ ప్లాట్‌‌ఫామ్‌ల సంఖ్య మాత్రం చాలా తక్కువగానే ఉంది. నిజానికి అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లాంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ఎన్నున్నాయో వేళ్ల మీదే లెక్కపెట్టవచ్చు. ఇక తెలుగులో అయితే ఓకే ఒక్క ఓటీటీ ప్లాట్ ఫామ్ ఉంది. అది నిర్మాత అల్లు అరవింద్ ‘ఆహా’. దీన్ని జనంలోకి తీసుకెళ్లేందుకు ఇప్పటికే ఇంట్రెస్ట్ కంటెంట్ సిద్ధం చేసుకుంటున్నారు అల్లు వారు. ఈ టైమ్‌ను చక్కగా వినియోగించుకుని ఆహాకు భారీ క్రేజ్ తీసుకురావాలనే ఆలోచనతో డిఫరెంట్‌గా ట్రై చేస్తున్నారు. ఈ క్రమంలోనే మిల్కీ బ్యూటీ తమన్నా భాటియాతో ఓ స్పెషల్ షో కూడా ప్లాన్ చేసినట్టు సమాచారం. అల్లు అర్జున్ రిక్వెస్ట్‌ చేయడంతో ఈ షో చేసేందుకు ఓకే చెప్పిందట మిల్కీ భామ.

ఇదిలా ఉంటే, ఓటీటీ పట్ల జనానికి ఉన్న ఆసక్తిని క్యాచ్ చేసే ప్రయత్నం చేస్తోంది మంచు ఫ్యామిలీ. ఇప్పటికే బిజినెస్‌మన్‌గా రాణిస్తున్న కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పెద్దబ్బాయి హీరో మంచు విష్ణు.. మరో తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను తీసుకొచ్చే పనుల్లో బిజీగా ఉన్నారని టాక్. ఇప్పటికే చదరంగం సిరీస్‌ను నిర్మించిన మంచువారి అబ్బాయి.. ఇప్పుడు డైరెక్ట్‌గా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను తీసుకురావడం సూపర్ డెసిషన్ అంటున్నారు విశ్లేషకులు. ఇందుకోసం సిరీస్‌లు ప్లాన్ చేసే పనిలో ఉన్న విష్ణు.. ఇంటర్నేషనల్ లెవల్‌లో ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ‘ఆహా’కు మించిన కంటెంట్‌తో వస్తే క్లిక్ అవడం ఖాయమే కాగా.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Advertisement

Next Story