పని చేస్తున్న కంపెనీకే కన్నం..చివరకు కటకటాల పాలు

by Sumithra |   ( Updated:2020-12-18 11:42:59.0  )
పని చేస్తున్న కంపెనీకే కన్నం..చివరకు కటకటాల పాలు
X

దిశ, క్రైమ్ బ్యూరో : డబ్బును సులభంగా సంపాదించాలన్న ఆలోచనతో పనిచేస్తున్న కంపెనీకే టోకరా పెట్టాడు ఓ ప్రబుద్దుడు. మెటీరియల్ భద్రతకు కంపెనీ యాజమాన్యం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదని గమనించిన సదరు వ్యక్తి తన స్నేహితులతో కలిసి సుమారు రూ.1 కోటి రూపాయల విలువ చేసే పెస్టిసైడ్ పెట్టెలను దొంగిలించాడు. పోలీసులకు చిక్కడంతో చివరకు కటకటాల పాలయ్యాడు. ఘటన వివరాలను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ ఎల్‌బీనగర్ సీపీ క్యాంపు కార్యాలయంలో వివరాలను శుక్రవారం వెల్లడించారు. సీపీ మహేశ్ భగవత్ తెలిపిన వివరాల ప్రకారం…ఆదిభట్ల ప్రాంతంలోని మన్నెగూడ వద్ద కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ పెస్టిసైడ్స్ కంపెనీలో కడప జిల్లాకు చెందిన రాపూరు రమేశ్ బాబు జోనల్ మేనేజర్‌గా పనిచేసి రిటైర్ అయ్యాడు.

నిరుద్యోగిగా ఉంటున్న తన కుమారుడు దినేశ్ రాయ్‌కు ఉద్యోగ అవకాశం కల్పించాలని యాజమాన్యాన్ని రమేశ్ కోరాడు. దీంతో గోడౌన్‌లో డిస్పాచర్‌గా దినేశ్‌ను యాజమాన్యం ఉద్యోగంలోకి తీసుకుంది. మన్నెగూడ వద్ద పనిచేస్తున్న గోడౌన్‌లో తగిన సెక్యూరిటీ, సీసీ కెమెరాలు లేకపోవడాన్ని గమనించిన దినేష్.. గోడౌన్‌లోని ఎరువుల మందుల పెట్టెలను దొంగిలించి అత్యధిక డబ్బు సంపాదించాలని భావించాడు. తన స్నేహితులు నాథా ముఖేష్, చికండి శివప్రసాద్‌లతో ఓ ముఠాగా ఏర్పడి గోడౌన్ తెరిచేందుకు డూప్లికేటు కీ తయారు చేయించాడు. గత 2 నెలలుగా 5 సార్లు 98 పెస్టిసైడ్స్ కాటన్ బాక్సులను కార్లు, బైక్‌ల ద్వారా తరలించారు.

తరలించిన పెస్టిసైడ్స్ కాటన్ బాక్సులను స్నేహితులు నాథా ముఖేష్, శివ ప్రసాద్ ఇళ్లల్లో భద్రపర్చారు. వీటిని విక్రయించేందుకు వారు ప్రయత్నిస్తు పోలీసుల కంట పడ్డారు. బొంగుళూరు గేటు వద్ద వీరి కదలికలపై పోలీసులు అనుమానం రావడంతో ఆదిభట్ల పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ఎల్‌బీ నగర్ సీసీఎస్ పోలీసులకు అప్పగించారు. దొంగతనం చేసినట్టుగా దర్యాప్తులో బయట పడటంతో కటకటాల పాలయ్యారు. వారి నుంచి దాదాపు రూ.1.07 కోట్ల విలువైన 98 పెస్టిసైడ్స్ కాటన్ బాక్సులతో పాటు రెండు కార్డు, రెండు బైక్ లు, డూప్లికేటు కీ, షెట్టర్ లిఫ్ట్ చేసే పరికరం, మూడు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed