తుపాకీతో హల్‌చల్ చేసిన వ్యక్తి అరెస్ట్.. విచారణలో నమ్మలేని నిజాలు..

by Sumithra |
తుపాకీతో హల్‌చల్ చేసిన వ్యక్తి అరెస్ట్.. విచారణలో నమ్మలేని నిజాలు..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : వేడుకల్లో ఓ వ్యక్తి కారుపై కూర్చోని తుపాకీతో మూడుసార్లు ఫైర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ మేరకు శుక్రవారం సీపీ కార్తికేయ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 12న నిజామాబాద్ జిల్లా సారంగాపూర్ గ్రామ శివారులో ఉన్న ఆశియానా అతిథి గృహంలో ఇటీవల అనారోగ్యం నుండి కోలుకున్న సోనార్ అమ్మద్ తన కుమారుడి ఆరోగ్యం కోసం ఒక పార్టీని ఏర్పాటు చేశాడు. ఈ పార్టీలో ఆరీఫ్ అనే వ్యక్తి కారుపై కూర్చోని గాల్లోకి మూడుసార్లు పేల్చడంతో అది సోషల్ మీడియాలో వైర్ అయినట్లు సీపీ తెలిపారు. ఆరీఫ్ తన ముఖానికి మాస్కు లేకుండా సామాజిక దూరాన్ని పాటించకుండా పార్టీ వాతావరణంలో ఆ వ్యక్తి చుట్టూ చాలామంది ఉన్నారని తెలిపారు.

ఈ సంఘటన నిజామాబాద్ సారంగాపూర్ గ్రామంలో గల ఓ అతిథి గృహంలో జరిగినట్లు గుర్తించిన పోలీసులు, ఆయుధాన్ని ఉపయోగించిన వ్యక్తిని ఆరీఫ్ గా గుర్తించామని వెల్లడించారు. ఆరీఫ్ అనే వ్యక్తిపై గతంలో ఐదవ పోలీస్ స్టేషన్ లో రౌడీషీటర్ ఉందని, నిందితుడిపై పీడీ యాక్ట్ కూడా నమోదు కాగా ఆరు నెలల పాటు జైల్లో ఉన్నాడని తెలిపారు. రంజాన్ మాసంలో జైలు నుండి విడుదలైన ఆరీఫ్ ఇలాంటి కార్యకలాపాలు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ కార్తికేయ తెలిపారు. శుక్రవారం పోలీసులు వ్యక్తిగతంగా ఆరీఫ్ ను పోలీస్ స్టేషన్ కు తీసుకురావడానికి ప్రయత్నించగా సోనార్ అహ్మద్ అనే వ్యక్తితో కలిసి ప్రతిఘటించాడని, అంతేకాకుండా తుపాకీని చూపించి చంపేస్తానని బెదిరించాడని సీపీ పేర్కొన్నారు.

పోలీసులు వారిద్దరిని పోలీస్ స్టేషన్ కు తీసుకు వచ్చిన అనంతరం విచారించగా కావాలనే ఒక బొమ్మ తుపాకీని అమెజాన్ ఆన్ లైన్ లో పార్శిల్ తెప్పించుకొని ఆ తుపాకీని అసలు దాని మాదిరిగా ఎక్స్ పోజ్ చేస్తూ, తన బావమరిది ఫంక్షన్ లో గాలిలో కాల్పులు జరిపి, ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా తన రౌడీ ఇమేజ్ ప్రజలలో వెళ్ళినట్లుగా పోస్ట్ చేస్తూ వీడియో వైరల్ చేసినట్లు ఒప్పుకోవడం జరిగిందని సీపీ వివరించారు. నిందితుడి వద్ద నుంచి బొమ్మ తుపాకీ, కారును స్వాధీనపరచుకొని ఆరీఫ్, సోనార్ అహ్మద్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు సీపీ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed