ఆదివాసీ ప్రాంతాల్లో వంట గ్యాస్ వెతలకు పరిష్కారమేంటి..?

by Sridhar Babu |
ఆదివాసీ ప్రాంతాల్లో వంట గ్యాస్ వెతలకు పరిష్కారమేంటి..?
X

దిశ బ్యూరో,ఖమ్మం : సుదూర ప్రాంతాల్లోని కొండ కోనల్లో నివసిస్తున్న ఆదివాసీ, గిరిజనులకు వంట గ్యాస్ సౌకర్యం కల్పించడం, తిరిగి సిలిండర్లలో ఎల్ పీజీ గ్యాస్ నింపించుకునేందుకు పడుతున్న కష్టాలకు పరిష్కార చర్యలు ఏం తీసుకుంటున్నారని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి లోక్ సభలో గురువారం ప్రశ్నించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా ఈ మేరకు ప్రశ్నను సంధిస్తూ ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) పథకం ద్వారా గిరిజనులకు ఏ మేరకు లబ్ధి చేకూరిందని అడిగారు. దీనికి కేంద్ర పెట్రోలియం, సహజవాయువులు, పర్యాటక శాఖల సహాయ మంత్రి సురేష్ గోపి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.

2016 లో ఈ పథకం ప్రారంభించబడిందని.. వృద్ధ మహిళలు, ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలోని ఆదివాసీ ప్రాంతాల వారికి వంట గ్యాస్ సౌకర్యం కల్పించడo ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ ఏడాది నవంబర్ 1 నాటికి ఉజ్వల యోజన ద్వారా దేశంలో 3.13 కోట్ల కనెక్షన్లు ఇవ్వగా..ఇందులో తెలంగాణలో మొత్తం 11.85 లక్షల మంది ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చినట్లు వివరించారు. తెలంగాణలో జిల్లాల వారీగా గణాంకాలను వెల్లడించారు. ఇందులో ఖమ్మంలో 83,176 కనెక్షన్లు, భద్రాద్రి కొత్తగూడెం లో 71,556 మందికి లబ్ధి చేకూరినట్లు తెలిపారు. వీరి సౌకర్యార్థం గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ షిప్ ల ద్వారా ఎల్ పీజీ రీఫిలింగ్ వేగిరం చేశామని, సబ్సిడీని కొనసాగిస్తున్నామని తెలిపారు. అర్హులందరికి లబ్ధి చేకూరేలా సామూహిక అవగాహన శిబిరాలతో చైతన్య పరుస్తున్నామని వివరించారు.

వంట నూనె ధరల పెంపుతో సామాన్యులపై భారం...

ఇటీవల దేశంలో వంట నూనెల ధరలు పెరగడానికి కారణమైన అంశాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించిందా..? అని ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి లోక్ సభలో ప్రశ్నించారు. వంట నూనెల ధరల పెంపుతో సామాన్యులు, చిరు వ్యాపారులపై భారం పడుతోందని పేర్కొన్నారు. దీనికి గాను కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణీ శాఖల సహాయ మంత్రి నిముబెన్ జయంతి భాయ్ బంభానియా లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

వంట నూనెల దేశీయ ఉత్పత్తి 57 శాతం తగ్గిందని, దిగుమతుల కారణంగా ధరలు పెరిగాయని తెలిపారు. అంతర్జాతీయ, దేశీయ ధరలను కేంద్ర ప్రభుత్వం నిషితంగా పర్యవేక్షిస్తోందని చెప్పారు. నూనె గింజల ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు వివిధ ఎడిబుల్ ఆయిల్ ల పై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ (బీసీడీ)ని రైతులకు అనుకూలంగా మార్చినట్లు తెలిపారు. వినియోగదారులు, రైతులు, వంటనూనె పరిశ్రమల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ధరలు అందుబాటులోకి తెచ్చేందుకు విధానపరమైన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

Advertisement

Next Story