సోనియాను కలవనున్న దీదీ

by Shamantha N |   ( Updated:2021-07-15 07:50:28.0  )
sonia-mamata1
X

కోల్‌కతా: వచ్చే సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీజేపీని ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకమవ్వనున్నట్టు తెలుస్తోంది. దీనికి తాజా వార్త ఒకటి మరింత బలాన్ని చేకూరుస్తున్నది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలవనున్నారు. ఈ నెలాఖరున ఢిల్లీకి పయనమవనున్న దీదీ నాలుగు రోజులపాటు అక్కడే ఉండనున్నారు. ఈ పర్యటనలో ఆమె సోనియా గాంధీని కలవనున్నట్టు రాజకీయవర్గాల సమాచారం. సోనియాతోపాటు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేశ్ యాదవ్, ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌ సహా మరికొందరు ప్రతిపక్ష నేతలను కలవనున్నారు.

‘ఎన్నికల తర్వాత ఢిల్లీ వెళ్లలేదు. ప్రస్తుతం కరోనా పరిస్థితి కొంత మెరుగైంది. పార్లమెంట్ సమావేశాలు జరిగే సమయంలో కొందరు మిత్రులను కలిసేందుకు ఢిల్లీ వెళ్తాను’ అని మమతా బెనర్జీ వెల్లడించారు. సమయమిస్తే ప్రధాని మోడీ, రాష్ట్రపతినీ కలిసే అవకాశముందని తెలిపారు. కాగా, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(పీకే) గత నెలలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌తో భేటీ అనంతరం దేశ రాజకీయాల్లో పలు రకాల స్పెక్యులేషన్స్ మొదలయ్యాయి. బీజేపీని ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలన్నింటినీ కూడబెట్టనున్నట్టు, శరద్ పవార్‌ను రాష్ట్రపతి లేదా ప్రధాని చేసేందుకు పీకే వ్యూహ రచన చేయనున్నారనే వార్తలు జోరుగా వినిపించాయి. కాంగ్రెస్ అధినేత్రి సోనియా, రాహుల్, ప్రియాంకలతో పీకే తాజా భేటీ ఈ వార్తలకు మరింత బలాన్నిచ్చాయి. అయితే, తనను రాష్ట్రపతిని చేస్తారంటూ వచ్చిన వార్తలను శరద్ పవార్ కొట్టిపారేశారు.

Advertisement

Next Story