మగ నుంచి ఆడగా.. పిండాన్నే మార్చేస్తున్నారు

by Harish |   ( Updated:2021-02-06 02:19:10.0  )
మగ నుంచి ఆడగా.. పిండాన్నే మార్చేస్తున్నారు
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో ఆడపిల్లల సంఖ్య రోజురోజుకు తగ్గుతోంది. బాలికల రేషియో పెంచడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భ్రూణ హత్యలు నివారించడంతోపాటు పుట్టబోయే బిడ్డకోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నాయి. ఆడపిల్లలను రక్షించడమే ధ్యేయంగా పని చేస్తున్నాయి. అయితే కోళ్ల పరిశ్రమలో మాత్రం ఇందుకు విరుద్దంగా జరుగుతోంది. మగ కోడి పిల్లలను ఫౌల్ట్రీ పరిశ్రమలు చంపేస్తున్నాయి. ఆడ కోడి పిల్లలు పెరిగితే గుడ్లు పెట్టి ఆధాయం సమకూర్చుతుండడంతో మగ కోడి పిల్లలను పెంచడం వృథా ఖర్చుగా ఆ పరిశ్రమలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మగ కోడి పిల్లలను చంపేస్తున్నారు.

అయితే ఇజ్రాయెల్‌కి చెందిన సూస్ టెక్నాలజీ స్టార్టప్ సంస్థ మగ కోడిపిల్లలను చంపకుండా, ఆడ కోడి పిల్లలుగా మార్చే ప్రయత్నం చేస్తోంది. మగ కోడిపిల్లల సంఖ్యను తగ్గించి ఆడ కోడి పిల్లల నిష్పత్తిని పెంచేందుకు విశేష కృషి చేస్తోంది. సూస్ టెక్నాలజీస్ సీఈవో యాయెల్ అల్టర్.. ఆ సంస్థ చేపట్టిన ప్రయోగం గురించి వివరించారు.

‘గుడ్లు పొదిగే మొదటి 13 రోజుల్లో కోళ్లకు ధ్వని తరంగాలను ప్రసారం చేయడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. ఫ్రీక్వెన్సీ, వాల్యూమ్, ఉష్ణోగ్రత, తేమతోపాటు మరికొన్ని కారకాలకు కోళ్లను గురిచేసి మగకోళ్లను, ఆడకోళ్లుగా మార్చుతున్నాం. మగ కోడిపిల్లల సంఖ్య తగ్గించడానికి మేము కోడి లింగాన్ని మారుస్తున్నాం. ప్రస్తుతం ఇజ్రాయెల్‌లోని వాణిజ్య ఎగ్స్ ఫామ్‌లో ఈ సాంకేతిక పరిజ్ఞానంపై ట్రయల్స్ నిర్వహిస్తున్నాం. ఈ ట్రయల్ విజయవంతమైతే, ప్రపంచవ్యాప్తంగా కోళ్ల పరిశ్రమకు ఖర్చు తగ్గడమే కాకుండా, ప్రజల అవసరాన్ని తీర్చగలిగే అవకాశం లభిస్తుందని’ ఆశాభావం వ్యక్తం చేశారు.

సూస్ టెక్నాలజీ స్టార్టప్ సంస్థను 2017లో స్థాపించారు. ఈ సంస్థ మగ కోడి పిండాలు అభివృద్ధి చెందే దశలో లింగాన్ని సమర్థంగా మార్చడం ద్వారా వాటిని ఆడ కోడిగా మార్చి వ్యాపార అవసరాల కోసం ఉపయోగించకోవచ్చు. మగ కోళ్లు పెరిగే హేచరీల్లో ధ్వని ప్రకంపనలు చేయడం వల్ల వాటిలోని జన్యు వ్యక్తీకరణను మారుస్తుంది. తద్వారా మగ కోళ్లలో సహజంగా ఏర్పడే వృషణాలకు బదులు, అండాశయం ఏర్పడుతుంది. అవి ఆడకోడి పిల్లలుగా మారి గుడ్లను పెట్టే అవకాశం ఉంటుంది. తద్వారా, వ్యాపారులకు ఖర్చు తగ్గడమే కాకుండా, కోట్ల కొద్దీ మగకోళ్లను కాపాడుకోవచ్చు. ఆడకోళ్ల సంఖ్యను పెంచవచ్చు.

ఈ ప్రయోగం పూర్తి స్థాయిలో ఫలితాన్ని ఇవ్వకపోయినప్పటికీ, మగ కోడి పిల్లలను 60 శాతం ఆడపిల్లలుగా మార్చే అవకాశం ఉందని సంస్థ తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా ఏటా 700 కోట్ల మగ కోడిపిల్లల్ని చంపేస్తున్నారని అంచనా వేసిన సంస్థ వాటిని నివారించడానికే ఇటాలియన్, యుఎస్ గుడ్డు ఉత్పత్తిదారులతో కలిసి ఈ పైలెట్ ప్రాజెక్టును చేపట్టామని తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed