ఆవు పేడతో.. రాఖీలు, గణేష్ ప్రతిమలు

by Sujitha Rachapalli |
ఆవు పేడతో.. రాఖీలు, గణేష్ ప్రతిమలు
X

దిశ, వెబ్‌డెస్క్ : మనం జరుపుకునే ప్రతి పండుగలోనూ ఓ పరమార్థంతో పాటు సైన్స్ కూడా దాగుంటుంది. ఇక వచ్చే ఆగస్టు నెలలో రెండు ముఖ్యమైన పండుగలు రాబోతున్నాయి. అందులో ఒకటి అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకైన రాఖీ పౌర్ణమి. మరొకటి ఐకమత్యానికి గుర్తుగా నిలిచే గణపతి పండుగ. ఇక కరోనా ప్రభావమూ పండుగలపై పడనుంది. ఈ నేపథ్యంలో ఆవుపేడతో రాఖీలు, గణపతి ప్రతిమలను పర్యావరణహితంగా తయారుచేస్తూ.. ఆదర్శంగా నిలుస్తోంది ఇండోర్ నగరానికి చెందిన శ్వేతా పలివాళ్. అంతేకాదు.. చైనా వస్తువులను బహిష్కరించడంతో పాటు భారతీయ ఉత్పత్తులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ‘ఆత్మ నిర్భర్ భారత్’ విజన్‌ను దృష్టిలో పెట్టుకుని తాను ఈ స్వదేశీ ఉత్పత్తులను తయారు చేస్తున్నానని తెలిపింది.

శ్వేతా పలివాళ్.. రాఖీలు, గణపతి ప్రతిమలే కాకుండా కరోనా నేపథ్యంలో కాటన్ క్లాత్‌ను ఉపయోగించి మాస్క్‌లు కూడా తయారుచేసింది. వాటిపై అందమైన డిజైన్‌లు వేసి ఇండోర్ ప్రజల దృష్టిని ఆకర్షించింది. హోమ్ డెకరేషన్ ప్రొడక్ట్స్, ఆవు పేడ, మట్టితో యాంటీ రేడియేషన్ మొబైల్ స్టాండులు, తయారు చేసిన శ్వేత, వాటిని త్వరలోనే ప్రధాని నరేంద్రమోదీకి పంపించనున్నట్లు చెప్పారు.

‘పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో.. స్క్రాప్ నుంచి ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నాను. గతేడాది నుంచే ఆవు పేడతో పర్యావరణహిత రాఖీలు, ప్రతిమలు తయారు చేస్తూ, వీటి తయారీలో ఇతరులకు శిక్షణ కూడా అందిస్తున్నాను. ఈ ఉత్పత్తులు బయో డీగ్రేడబుల్. అంతేకాదు ఇవి తొందరగా నీటిలో కరిగిపోవడమే కాక మొక్కలకు ఎరువుగానూ ఉపయోగించవచ్చు. ఈ ఉత్పత్తులతో లోకల్ ఫర్ వోకల్ అనే క్యాంపెయిన్ కూడా చేస్తున్నాను. ప్రతిమల కోసం ఆవు పేడతో పాటు పిండి, తులసి విత్తనాలను ఇందులో ఉపయోగిస్తున్నాను. ఇవి చాలా లైట్ వెయిట్‌తో ఉండటమే కాకుండా పర్యావరణానికి ఎంతో మేలు చేస్తాయని’ శ్వేత తెలిపారు.

Advertisement

Next Story