- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
'మధ్యప్రదేశ్' బ(వ)లపరీక్ష!
దిశ, వెబ్‌డెస్క్ : మధ్యప్రదేశ్ పొలిటికల్ హైడ్రామా సోమవారం పరాకాష్టకు చేరనుంది. బలపరీక్ష కోసం అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ పట్టుబడుతుండటం ఉత్కంఠను రేపుతున్నది. బెంగుళూరులోని 22 ఎమ్మెల్యేలపై స్పీకర్ ప్రజాపతి తీసుకునే నిర్ణయం ఈ బలపరీక్షకు కీలకంగా మారనుంది. ఈ బలపరీక్ష నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలను జైపూర్ నుంచి భోపాల్‌కు తీసుకువచ్చింది. భవిష్యత్ కార్యాచరణపై నేడు క్యాబినెట్ సమావేశానికి సీఎం కమల్‌నాథ్ సిద్ధమయ్యారు.
సోమవారం మధ్యప్రదేశ్ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కానీ, ప్రభుత్వమే మైనార్టీలో పడితే.. నిర్ణయాలు తీసుకునే అధికారం దానికెక్కడ ఉంటుందని బీజేపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. అసలు గవర్నర్ ప్రసంగానికీ అర్థం లేదన్నట్టుగానే అభిప్రాయపడుతున్నాయి. అందుకే, ముందు బలపరీక్ష నిర్వహించాకే తర్వాతి ప్రక్రియలోకి వెళ్లాలని పట్టుబడుతున్నాయి. అంతకుముందే బలపరీక్ష నిర్వహించాలని కమల్‌నాథ్ ప్రభుత్వమూ స్పీకర్‌ను కోరడం గమనార్హం. అసెంబ్లీలో సోమవారం బలపరీక్ష నిర్వహించాలని గవర్నర్ లాల్‌జీ టాండన్.. స్పీకర్ ప్రజాపతికి సూచించారు.
జ్యోతిరాదిత్య సింధియా ఎపిసోడ్‌లో 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బెంగుళూరుకు తరలించడం.. వారి రాజీనామాలు స్పీకర్‌కు అందజేయడంతో కమల్‌నాథ్ సర్కారు సంక్షోభంలో పడిన విషయం తెలిసిందే. ఈ దెబ్బతో తమ ఎమ్మెల్యేలపై ప్రత్యర్థి పార్టీ వలవేసే ప్రమాదమున్నదని ఇరుపార్టీలు భావించాయి. అందుకే, కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలను అదే పార్టీ అధికారంలోని రాజస్తాన్‌కు తరలించింది. కాగా, బీజేపీ తమ ఎమ్మెల్యేలను ఆ పార్టీ అధికారంలోని హర్యానాకు పంపించింది. కాగా, సోమవారం బలపరీక్ష జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలను జైపూర్ నుంచి భోపాల్‌కు తీసుకువచ్చింది. బీజేపీ ఎమ్మెల్యేల సమాచారం అందలేదు. బెంగళూరు నుంచి సింధియా మద్దతువర్గం భోపాల్‌కు శుక్రవారం రావలసి ఉండగా దాన్ని వాయిదా వేసుకున్న విషయం విదితమే.
ఎమ్మెల్యేలను నిర్బంధించి బలపరీక్ష నిర్వహించడంలో అర్థం లేదని కాంగ్రెస్ తాజాగా వాదిస్తున్నది. కేంద్ర సర్కారు వారిని విడుదల చేయడంలో చొరవతీసుకోవాలని కోరింది. బీజేపీ నేరపూరిత రాజకీయాలు చేస్తున్నదని ఆరోపిస్తూ.. ఈ విషయంపై కాంగ్రెస్.. సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందని ఆ పార్టీ నేతలు చెప్పుకొచ్చారు.
బెంగళూరులోని ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ ప్రజాపతి ఆమోదిస్తే.. కమల్‌నాథ్ సర్కారు మెజార్టీ మార్కుకు దూరమై.. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు మార్గం సుగమమవుతుంది. కానీ, ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా హాజరై రాజీనామాలను సమర్పించాలని స్పీకర్ ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే, వారికి సెంట్రల్ పారామిలిటరీ భద్రత కల్పించాలని సీఎంను గవర్నర్ లాల్‌జీ టాండన్ కోరగా.. అందుకు కర్ణాటక పోలీసులు ఆ ఎమ్మెల్యేలను విడుదల చేస్తే.. తాను పటిష్ట భద్రత కల్పిస్తానని సీఎం హామీనిచ్చారు. ఇప్పుడు బెంగుళూరు నుంచి వచ్చే ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకుంటేనే కమల్‌నాథ్ సర్కారు గట్టెక్కినట్టవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అదే విధంగా బీజేపీ కూడా వారిపై అప్రమత్తంగానే ఉన్నది. అందుకే సొంత ఎమ్మెల్యేలను కాపాడుకుంటూ.. ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యేలపై వలవేస్తూ.. రిసార్ట్ ఎమ్మెల్యేలను కాపాడుకోవడంపై ఇరుపార్టీలు దృష్టిపెట్టాయని తెలుస్తున్నది. అందుకే దీన్ని బలపరీక్షగానే కాదు.. వల పరీక్షగానూ రాజకీయశ్రేణులు గుసగుసలాడుతున్నాయి.
ఇప్పటికే ఆరుగురు క్యాబినెట్ మంత్రుల రాజీనామాలను స్పీకర్ ఆమోదించడంతో.. మెజార్టీ మార్కు 113కు పడిపోయింది. కమల్‌నాథ్ సర్కారు బలం దీనికంటే రెండు అంకెలు(ఇద్దరు ఎమ్మెల్యేలు) తక్కువగానే ఉన్నది. ఒకవేళ అందరి రాజీనామాలు స్వీకరిస్తే.. మెజార్టీ మార్కు 104కు చేరుతుంది. 107 మంది చట్టసభ్యుల మద్దతు ఉన్న బీజేపీ సర్కారును ఏర్పాటు చేసేందుకు వీలుకలుగుతుంది.
Tags: madhya pradesh, kamalnath govt, congress rebels, jyotiraditya scindia, floor test, assembly