- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్రమం.. LRSతో సక్రమం..!
దిశ, న్యూస్‌బ్యూరో : ఏండ్ల కొద్ది కాసుల కక్కుర్తితో హెచ్ఎండీఏ నిషేధించిన లేఅవుట్లలోనూ ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు యథేచ్ఛగా జరిగాయి. వాటిని ఇప్పుడు ఎల్ఆర్ఎస్‌తో సక్రమం చేసే పనిలో ప్రభుత్వమున్నది. అనుమతులు లేకుండా లేఅవుట్లు చేసిన, అక్రమంగా రిజిస్ట్రేషన్లు జరిగిన వాటికి చట్టబద్ధత కల్పించడానికే అన్నట్టుగా సర్కారు ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చిందని సర్వత్రా అసహనం వ్యక్తమవుతోంది. నిషేధించిన లేఅవుట్లలో రిజిస్ట్రేషన్లు జరుగకుండా చూడాల్సిన డీపీఓ, పట్టణ స్థానిక సంస్థలు బాధ్యతారాహితంగా వ్యవహరించాయి. ఫలితంగా ఏళ్ల తరబడి ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాలోని నిషేధిత లేఅవుట్లలో ప్లాట్ల క్రయవిక్రయాలు సాగుతూనే ఉన్నాయి.
2007లో రిజిస్ట్రేషన్ యాక్టు నంబర్ 19లోని సెక్షన్ 22-A(1)(ఇ) ప్రకారం హెచ్ఎండీఏ పరిధిలో సుమారు 700 లేఅవుట్లలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్లు చేయరాదని అథారిటీ స్పష్టంగా తెలియజేసింది. అయినా అక్రమంగా జరుగుతున్న రిజిస్ట్రేషన్లను ఎవ్వరూ ప్రశ్నించలేదు. అనుమతిలేని, అక్రమలేఅవుట్ల జాబితాను తయారుచేసి అథారిటీ వెల్లడించింది. వాటిని నియంత్రించేందుకు ప్రత్యేకంగా తమ అధికారిక వెబ్ పోర్టల్‌లో పొందుపరిచింది. అయినా ఆ లేఅవుట్లలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతూనే వచ్చింది. అందుకు ఆ లేఅవుట్ల ప్లాట్ల రిజిస్ట్రేషన్ దస్తావేజులే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. రిజిస్ట్రేషన్లు నిషేధించిన లేఅవుట్లలో ప్లాట్లను విక్రయించడం, వాటికి రిజిస్ట్రేషన్లు చేయడం, కొనుగోలుచేయడం ఈ ముగ్గురు నియమనిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నప్పటికీ, కేవలం ప్లాట్లను కొనుగోలు చేసిన వారిపైనే ఎల్ఆర్ఎస్ భారాన్ని మోపడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
కొన్ని దస్తావేజులను పరిశీలిస్తే…
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధిలోని నార్కుడ గ్రామ రెవెన్యూలోని సర్వే నంబర్ 61, 62, 63లలో లేఅవుట్లు పూర్తిగా జీఓ 111లోకి వస్తాయి. వీటికి రిజిస్ట్రేషన్లు చేయరాదని అథారిటీ తేల్చిచెప్పింది. కానీ ఆ సర్వే నెంబర్‌లో వెలసిన లేఅవుట్‌లోని 400 చదరపు గజాల ప్లాటును 2018 జూన్‌లో రిజిస్ట్రేషన్ చేశారు. ఆదిబట్లలోని సర్వే నంబర్ 163లో 2636 చదరపు గజాలు 2016 ఫిబ్రవరిలో ఒకసారి, నవంబర్‌లో మరోసారి రిజిస్ట్రేషన్ చేశారు. అథారిటీ అక్రమమని తెలిపిన లేఅవుట్లలోని ప్లాట్లు చేతులు మారుతూ వస్తున్నాయి. హెచ్ఎండీఏ పలుమార్లు ప్రజలకు తెలిసేలా పబ్లిక్ హెచ్చరిక నోటీసులు జారీచేసింది. తన అధికారిక వెబ్‌సైట్‌లో లేఅవుట్ల ప్రాంతాలు, గ్రామాలు, వాటి సర్వే నెంబర్లు, యజమానులు, లేఅవుట్ల వెంచర్ల పేర్లతో కూడిన వివరాలను పొందుపరిచింది. ఆ జాబితాలోని లేఅవుట్లకు రిజిస్ట్రేషన్లు చట్టపరంగా నిషేధించబడ్డాయని స్పష్టంచేసింది. గత నాలుగేళ్లుగా అందులోని ప్లాట్లకు క్రయవిక్రయాలు జరిపిన అధికారులు మాత్రం దర్జాగా ఉన్నారు.
ఎవరిదీ పాపం…
నిషేధించిన లే అవుట్లలో ప్లాట్లకు విపరీతమైన పబ్లిసిటీ, వాటికి రిజిస్ట్రేషన్లు, ఇది తెలిసినా అన్ని వర్గాల ప్రజలు ఆ ప్లాట్లను కొనుగోలు చేయడం చకచకా జరిగిపోయాయి. విక్రయదారుడు, కొనుగోలుదారుడు, రిజిస్ర్టార్ ఈ ముగ్గురు జరిపిన కార్యకలాపాలు చట్టానికి వ్యతిరేకంగా సాగినవే. కానీ, రియల్టర్, సబ్-రిజిస్ట్రార్లు బాగానే ఉన్నారు. ప్లాటు కొనుగోలు చేసిన వారే ఎల్ఆర్ఎస్ చేసుకోవాలని చెప్పడంతో మిగతా ఇద్దరూ చట్టం నుంచి తప్పించుకుంటున్నారు. ఇదెక్కడి న్యాయమని ప్లాట్ల వారు ప్రశ్నిస్తున్నారు. ఆనాడే ఆయా లేఅవుట్లలో సర్వేనంబర్లలో రిజిస్ట్రేషన్లు నిషేధించబడ్డాయని తెలిపితే రిజిస్ట్రేషన్ చేసుకునే వారిమికాదని, ఇప్పుడు తిప్పలు పడాల్సిన అవరసముండేది కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఎల్ఆర్ఎస్ నిరంతర ప్రక్రియ చేయాలని, రుసుంలు తగ్గించాలని, రిజిస్ట్రేషన్లు యథావిధిగా జరిగేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.