ఆషాఢ మాసంలో ఇంటికొచ్చిన నవవధువు ప్రియుడితో కలిసి..

by srinivas |   ( Updated:2021-08-10 04:33:20.0  )
ఆషాఢ మాసంలో ఇంటికొచ్చిన నవవధువు ప్రియుడితో కలిసి..
X

దిశ, ఏపీ బ్యూరో: ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. అయితే ప్రేమ పెళ్లికి యువతి తల్లిదండ్రులు అంగీకరించలేదు. అంతేకాదు తమ కుమార్తెకు వేరే యువకుడితో పెళ్లి కూడా చేసేశారు. పెళ్లైనప్పటికీ ప్రియుడిని మరచిపోలేకపోయింది. ప్రియుడిని కలిసి తన ఆవేదనను చెప్పుకొంది. కలిసి ఎలాగూ బతకలేం కనీసం చావులోనైనా కలిసేపోదామని ఆ ఇద్దరూ నిర్ణయించుకుని పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన గుంటూరు జిల్లా బాపట్ల మండలంలో చోటు చేసుకుంది.

బాపట్ల రూరల్‌ ఎస్‌ఐ వెంకట ప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం కొండుబొట్లవారిపాలెంకు చెందిన ఓ యువతి, అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకు యువతి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. అంతేకాదు నెలరోజుల క్రితం మరో యువకుడితో పెళ్లి చేసేశారు. అయితే ఆషాఢమాసం కావడంతో నవ వధువు తల్లిదండ్రుల ఇంటికి వచ్చింది. తాను ప్రేమించిన యువకుడిని మరచిపోలేకపోయింది. అతడి ఎడబాటు తట్టుకోలేకపోయింది.

శ్రావణమాసం రావడంతో అత్తారింటికి పంపేస్తారని భయాందోళన చెందింది. వెంటనే ప్రియుడిని కలిసింది. ఇద్దరూ తమ బాధలు చెప్పుకున్నారు. తమ పెద్దలు ఎలాగూ కలిసి బతకనివ్వరని కనీసం చావులోనైనా కలిసే ఉందామనుకున్నారు. ఇద్దరు కలిసి సూర్యలంక గ్రామంలో పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న యువకుడి కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారిని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక వైద్యం అందించిన వైద్యులు మెరుగైన చికిత్స నిమిత్తం పొన్నూరుకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

Advertisement

Next Story