గొంతమ్ముకో.. డబ్బు దండుకో

by Shyam |   ( Updated:2020-08-05 03:18:11.0  )
గొంతమ్ముకో.. డబ్బు దండుకో
X

ఎక్కడ చూసినా ఉద్యోగాలు లేవు. ఇప్పటికే నిరుద్యోగం కోరల్లో కొట్టుమిట్టాడుతున్న యువతకు మరిన్ని కష్టాలు మీద పడ్డాయి. ప్రభుత్వోద్యోగాల మాట గురించి ఇక ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పట్లో నోటిఫికేషన్లు రావు, వచ్చినా ఇప్పట్లో నియామకాలు జరుగుతున్నాయన్న ఆశ లేదు. అయినప్పటికీ యువత కంగారు పడాల్సిన అవసరం లేదు. చేతిలో ఉన్న ఇంటర్నెట్‌ను సరిగ్గా ఉపయోగిస్తే ఎన్నో అవకాశాలను మన కళ్ల ముందు ఉంచుతుంది. ఆ కోవలోకి చెందినవే ఈ గొంతు అమ్ముకునే పనులు. దీనికి మీకు ప్రత్యేకంగా శిక్షణ అవసరం లేదు. పుట్టుకతో మీకు వచ్చిన మాటకారితనానికి పదును పెడితే చాలు. ఆన్‌లైన్ రేడియోలు, పాడ్‌కాస్ట్‌లు, యూట్యూబ్ వాయిస్ ఓవర్‌లు ఇలా ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అందుకే గొంతమ్ముకో.. డబ్బు దండుకో అనేది.

పెరుగుతున్న ఆన్‌లైన్ రేడియోలు..

ఎలాగూ కరోనా కాలం.. ప్రపంచమంతా దాదాపు ఇళ్లకే పరిమితమైంది. ఇక 65 ఏళ్ల వయస్సు దాటినవారైతే స్మార్ట్‌ఫోన్లతో అన్నిరకాలుగా టైమ్‌పాస్ చేయలేరు. పిల్లలు, ఆడవాళ్లు కూడా ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి టీవీలో నచ్చింది చూసుకునే స్వాతంత్ర్యం ఉండదు. అందుకే వారి ఫోన్‌లో రేడియో వినడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడు వారిని టార్గెట్ చేస్తూ ఆన్‌లైన్ రేడియో యాప్‌లు పుట్టుకొస్తున్నాయి. రేడియో జోష్, టోరీ, రేడియో బజ్జీ అంటూ ఇప్పటికే ఉన్న ఆన్‌లైన్ రేడియోలతో పాటు భక్తికి, ప్రేమ పాటలకు, పాత పాటలకు ప్రత్యేకంగా కొత్త రేడియోలు పుట్టుకొస్తున్నాయి. అలాగే పిల్లల కోసం కథలు, పాఠాలు చెప్పే రేడియోలు కూడా వస్తున్నాయి. దీంతో వాక్‌చాతుర్యం ఉన్న యువతకు డిమాండ్ పెరిగింది. ఇంట్లోనే స్మార్ట్‌ఫోన్ ఉపయోగించి ఈ ఆన్‌లైన్ రేడియోల్లో కార్యక్రమాలు చేసుకోవచ్చు.

పాడ్‌కాస్ట్‌లకు కొత్త డిమాండ్..

గానా, జియో సావన్, స్పాటిఫై వంటి పెద్ద పెద్ద మ్యూజిక్ యాప్స్‌లో సెలెబ్రిటీలు, పాపులర్ రేడియో జాకీలు పాడ్‌కాస్ట్‌లు చేస్తుంటారు. కొందరు వర్తమాన అంశాల గురించి మాట్లాడితే, ఇంకొందరు సినిమా వార్తల గురించి తమదైన శైలిలో వివరిస్తుంటారు. అయితే కేవలం పాడ్‌కాస్ట్‌లు చేస్తూ డబ్బులు సంపాదించేవారు కూడా చాలా మంది ఉన్నారు. ఇందుకు కావాల్సిన స్కిల్ ఒక్కటే. ఒక అంశం గురించి ఎలాంటి అభిప్రాయాలు చూపించకుండా, తటస్థంగా లోతుగా వివరిస్తూ అందరికీ అర్థమయ్యేలా మాట్లాడటమే. మోటివేషన్ పాడ్‌కాస్ట్‌లకు అయితే చాలా డిమాండ్ ఉంటుంది. పాడ్‌కాస్ట్‌ల కోసమే ప్రత్యేకంగా వెబ్‌సైట్‌లు ఉన్నాయి. వాటిలో రిజిస్టర్ చేసుకుని, మీకు బాగా తెలిసిన అంశం మీద పాడ్‌కాస్ట్ ప్రారంభిస్తే సరిపోతుంది.

యూట్యూబ్ వాయిస్ ఓవర్లు..

ఎక్కువ బడ్జెట్ పెట్టి క్వాలిటీ కంటెంట్‌తో యూట్యూబ్ వీడియోలు తీసినా మిలియన్ల వీక్షణలు మాత్రమే వస్తాయి. కానీ ఎప్పుడైనా చిన్నపిల్లల కథలు వీడియోలు చూశారా? ఒక్కో వీడియోకు కనీసం 1 బిలియన్ వీక్షణలు ఉంటాయి. చందమామ కథలు, విక్రమార్కుడు బేతాళ కథలు, పంచతంత్ర కథలు… ఇలా తెలుగులో అందుబాటులో ఉన్న కథలన్నీ ఇప్పుడు యూట్యూబ్‌లో ఉన్నాయి. దీంతో కొందరు నిర్మాతలు ఈ వీడియోల మీద పెట్టుబడి పెట్టడానికి ముందుకొస్తున్నారు. ముందే కంటెంట్ రెడీ చేసుకుని, యానిమేషన్ సిద్ధం చేసుకున్నప్పటికీ మంచి వాయిస్ ఓవర్ లేకపోతే ఈ వీడియోలు పేలవంగా ఉంటాయి. అందుకే మంచి వాయిస్ ఉన్నవారి కోసం వారు వెతుకుతుంటారు. కాబట్టి మీ వాయిస్‌తో మీరేదైనా కథను వివరిస్తూ యూట్యూబ్‌లో పెట్టి చూడండి. అవకాశాలు వస్తే సరే.. లేకపోతే మరో కథను సిద్ధం చేసుకోండి. ఇలా మీరే సొంతంగా కథల యూట్యూబ్ చానల్ పెట్టేసుకోవచ్చు.

మనసుంటే మార్గముంటుంది అన్నట్లుగా.. మీరు వెతకాలేగానీ వాయిస్ ఓవర్ ఉద్యోగాలు ఎన్నో దొరుకుతాయి. మీరు చేయాల్సిందల్లా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాంలను రెగ్యులర్ వైరల్ న్యూస్ కోసం కాకుండా, ఇలాంటి వాయిస్ ఉద్యోగాలు వెతకడానికి ఉపయోగిస్తే బాగుంటుంది. మీ దగ్గర ఉన్న కంటెంట్‌తో మంచి మంచి వీడియోలను, పాడ్‌కాస్ట్‌లతో అలరిస్తే అటు డబ్బుతో పాటు ఇటు పాపులారిటీ కూడా వస్తుంది.

Advertisement

Next Story

Most Viewed