లోకేశ్ పర్యటన రద్దు.. చంద్రబాబు ఇంటివద్ద భారీగా పోలీసుల మోహరింపు

by srinivas |
లోకేశ్ పర్యటన రద్దు.. చంద్రబాబు ఇంటివద్ద భారీగా పోలీసుల మోహరింపు
X

దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌నుద్దేశించి చేసిన వ్యాఖ్యలు దాడులు వరకు వెళ్లింది. దీంతో రాష్ట్రంలో యుద్ధవాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ వైసీపీ నేతలు రాష్ట్రంలోని టీడీపీ కార్యాలయాలపై దాడులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్ర పోలీస్ శాఖ అప్రమత్తమైంది. టీడీపీ కార్యాలయాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేసింది. చంద్రబాబు స్వగ్రామమైన నారావారి పల్లెలోని ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. చంద్రబాబు ఇంటిపై వైసీపీ శ్రేణులు దాడి చేసే అవకాశం ఉందని సమాచారం రావడంతో తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు రంగంలోకి దిగారు. చంద్రబాబు ఇంటి వద్ద భద్రతను పెంచారు.

లోకేశ్ పర్యటన రద్దు..

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ బుధవారం అనకాపల్లిలో పర్యటించాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ మేరకు మాజీ ఎమ్మెల్సీ బుద్ధా నాగజగదీశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఇదిలా ఉంటే టీడీపీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడులకు నిరసనగా టీడీపీ బుధవారం రాష్ట్రంలో బంద్ పాటిస్తోంది. చెదురుముదురు ఘటనలు మినహా బంద్ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుంది.

Advertisement

Next Story

Most Viewed