కామారెడ్డిలో మిడతల సంచారం..

by Shyam |
కామారెడ్డిలో మిడతల సంచారం..
X

దిశ, నిజామాబాద్:
అసలే కరోనాతో ప్రజలు ఇప్పటికే సతమతమౌతుంటే మరోవైపు మిడతలు రైతన్నలను ఆగం చేస్తున్నాయి. ఆఫ్రికా నుంచి దేశాలు దాటుకుంటూ భారత్‌లోని రాజస్థాన్ మీదుగా ప్రయాణించిన ఈ మిడతలు చివరకు కామారెడ్డి జిల్లాకు చేరుకున్నాయి. జిల్లాలోని సదాశివనగర్ మండలం వజ్జేపల్లి గ్రామంలో వీటి దండును రైతులు గుర్తించారు. వ్యవసాయ భూముల వద్ద ఉన్న చెట్లకు కొమ్మలు పూర్తిగా లేకపోవడాన్ని రైతులు గమనించారు. చెట్లను క్షుణ్ణంగా పరిశీలించగా మిడతలు కనిపించాయి. గ్రామ శివారులో గల చెట్ల ఆకులను అవి పూర్తిగా తినేస్తున్నాయి. అసలే పంటలు వేసే కాలం కావడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఒక్కసారి మిడతల దండు పంటలపై దాడిచేస్తే దిగుబడి పూర్తిగా తగ్గి పోవడమే కాకుండా రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. సాయంత్రం దాటితే ఈ మిడతలు గుంపుగా విజృంభిస్తాయని రైతులు అంటున్నారు.ఈ విషయాన్ని వ్యవసాయ శాఖ అధికారుల దృష్టికి రైతులు తీసుకెళ్లగా, సదాశివనగర్ మండల వ్యవసాయ అధికారి ప్రజాపతి మండలంలోని వజ్జెపల్లి గ్రామానికి చేరుకొని మిడతలను పరిశీలించారు. వాటిని ఎడారి మిడతలుగా గుర్తించారు. వాటిని ఎలా నిర్మూలించాలనే విషయంపై రైతులకు తగిన సలహాలు సూచనలు చేశారు. పంట వేయకముందే మిడతలను పూర్తిగా నిర్మూలించేందుకు వివిధ రకాల రసాయనాలను వాడాలని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed