లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌…

by Shyam |
లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌…
X

• ఈసారి కాపిటల్ ఎక్స్‌పెండిచర్‌లో కోత!
• రెవెన్యూ‌ లోటులోకి ద్రవ్యలోటు

దిశ, న్యూస్‌ బ్యూరో :

లాక్‌డౌన్ ప్రభావం తెలంగాణ ఆర్థిక వ్యవస్థను దీర్ఘకాలమే వెంటాడే అవకాశాలున్నాయి. ప్రభుత్వం వేసుకున్న అంచనాలన్నీ తలకిందులవుతుండగా.. ఆదాయానికి తగినట్లుగా ఖర్చు పెట్టాలనుకున్న బడ్జెట్ ప్రతిపాదనలు ప్రశ్నార్థకమవుతున్నాయి. అప్పులు తెచ్చి మరీ రాష్ట్ర సంపదను సృష్టిద్దామనుకున్న ప్రభుత్వ లక్ష్యానికి లాక్‌డౌన్ తూట్లు పొడిచింది. స్వీయ ఆర్థిక వనరులు లేకపోవడం, కేంద్రం నుంచి వస్తుందనుకున్న సాయం అందకపోవడం, అప్పులు ఎక్కువగా తీసుకునేందుకు అనుమతి వస్తుందనుకున్నా అది కూడా ఎటూ తేలకపోవడం.. వంటివన్నీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని గందరగోళంలో పడేశాయి. మరో మార్గం లేకపోవడంతో కాపిటల్ ఎక్స్‌పెండిచర్ పేరుతో జరిగే అభివృద్ధి పనులను తాత్కాలికంగానైనా ఆపక తప్పేట్లు లేదు. కేసీఆర్ బతికున్నంత వరకు రైతుబంధు, రైతు బీమా, ఆసరా పింఛన్లు లాంటి సంక్షేమ పథకాలు ఆగవంటూ ముఖ్యమంత్రే స్వయంగా చెప్పడంతో ఇప్పుడు బడ్జెట్‌లో ప్రతిపాదించిన అభివృధ్ధి పనులు మాత్రం నిలిచిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

ధనిక రాష్ట్రం, మిగులు బడ్జెట్, దేశంలో మరే రాష్ట్రంకంటే కూడా ఎక్కువగా కాపిటల్ ఎక్స్‌పెండిచర్ చేస్తున్న రాష్ట్రం, అన్ని రాష్ట్రాలకంటే ఎక్కువ స్థాయిలో ఆర్థిక వృద్ధి చెందుతున్న రాష్ట్రం.. ఇలాంటివన్నీ ఇకపైన గత చరిత్రగానే మిగిలిపోనున్నాయి. బయట నుంచి నిధులు రాకపోవడమే కాక రాష్ట్రంలో వసూళ్ళు లేక ఇకపైన లోటు బడ్జెట్‌లోకి వెళ్ళే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో పొందుపరిచిన లెక్కలు తారుమారు కానున్నాయి. ఈ ఏడాది బడ్జెట్‌లో ద్రవ్య లోటును ప్రభుత్వం రూ.33,191 కోట్లుగా అంచనా వేసింది. అయితే ఇకపైన ఈ లెక్కలు మారిపోక తప్పదు. సుమారు రూ. 4,482 కోట్ల మేర రెవిన్యూ మిగులు ఉంటుందని అంచనా వేసింది. ఇది కూడా మైనస్‌లోకి వెళ్ళక తప్పదు. వరుసగా రెండు నెలల ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోయింది. ప్రతీ నెల సగటున రూ. 12 వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తే కేవలం రూ. 1600 కోట్లు మాత్రమే వచ్చింది. మిగులు బడ్జెట్ కాస్తా మైనస్‌లోకి వెళ్ళిపోయి ద్రవ్యలోటు మరింత పెరగనుంది.

కాళేశ్వరం మినహా అభివృద్ధి పనులకు బ్రేక్ తప్పదా?

ఎఫ్ఆర్‌బీఎం పరిమితి మేరకు తెచ్చుకుంటున్న అప్పులతో పాటు వివిధ కార్పొరేషన్ల పేరుతోనూ ప్రభుత్వం అప్పులు తెచ్చుకుంటోంది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్ పేరుతో తెచ్చుకుంటున్న అప్పులు కేవలం ఆ ప్రాజెక్టు కోసమే ఖర్చు చేయాల్సి ఉన్నందున ఆ పనులు యథావిధిగా జరుగుతాయి. కానీ రోడ్లు, రాష్ట్ర రహదారులు, మైనర్-మీడియం ఇరిగేషన్, థర్మల్ ప్రాజెక్టు, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు, మౌలిక సదుపాయాలు తదితర పనులకు నిధులు సమకూర్చుకునేంత వరకు కాళేశ్వరం పనులకు తాత్కాలికంగా బ్రేక్ పడే అవకాశాలున్నాయి. ఈ రెండు నెలల కాలానికి సుమారు రూ. 25 వేల కోట్ల ఆదాయాన్ని రాష్ట్రం కోల్పోయినందున ఆ మేరకు కాపిటల్ ఎక్స్‌పెండిచర్‌కు ప్రభుత్వం కోత పెట్టక తప్పేలా లేదు. సంక్షేమ పథకాలను ఆపే అవకాశం లేనందున పరిమిత ఆర్థిక వనరులను ఆచితూచి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితికి ప్రభుత్వం నెట్టబడింది. వరుసగా ఆరేళ్ళ పాటు కాపిటల్ ఎక్స్‌పెండిచర్ రూపంలో రాష్ట్రంలోని మౌలిక సదుపాయాలకు, సాగునీటి ప్రాజెక్టులకు వెచ్చించింది. ఇవి ఇక ఎప్పటికీ రాష్ట్రానికి ఉండిపోయేవే. ఇలాంటి అనేక ప్రణాళికలకు ఇప్పుడు లాక్‌డౌన్ దెబ్బకొట్టింది.

తగ్గిన స్వీయ ఆదాయం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నెలకు సుమారు రూ.12 వేల కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం మార్చిలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అంచనా వేసింది. దీని ప్రకారం ఈ ఏడాది అన్ని రకాల ఆదాయాలు కలిపి రూ. 1.43 లక్షల కోట్లు సమకూరనుంది. దీనికి తోడు జీడీపీలో 3 శాతం మేర అప్పు తీసుకుంటే సరిపోతుందని భావించింది. కానీ కరోనా పరిస్థితులు ప్రభుత్వ అంచనాలను తలకిందులు చేశాయి. లాక్‌డౌన్ కారణంగా బడ్జెట్‌లో వేసుకున్న అంచనా ప్రకారం రూ. 1.43 లక్షల కోట్ల రెవెన్యూ వచ్చే పరిస్థితుల్లేవు. ఈ కారణంగా బడ్జెట్‌లో అంచనా వేసుకున్న ద్రవ్యలోటుకు మరో రూ.20 నుంచి రూ.25 వేల కోట్ల లోటు అదనంగా తోడు కానుంది. అంచనా ప్రకారం రెవెన్యూ వచ్చే పరిస్థితి లేనందున ప్రతీ ఏటా వస్తున్న ద్రవ్యలోటు సంగతేమోగానీ ఇప్పటిదాకా ఉన్న రెవిన్యూ మిగులు కూడా లోటులోకి వెళ్లే అవకాశాలేర్పడ్డాయి. చివరకు ఇది కాపిటల్ ఎక్స్‌పెండిచర్ అవసరాల కోసం తీసుకొస్తున్న అప్పులను కూడా సంక్షేమ పథకాల లాంటి రెవెన్యూ వ్యయ అవసరాలకు మళ్ళించక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి.

అప్పుల చెల్లింపుల సంగతేంటి?

నిజానికి ప్రస్తుత బడ్జెట్‌లో ప్రభుత్వం పేర్కొన్న ద్రవ్యలోటు రూ.33,191 కోట్లు. ఇందులో రూ.22 వేల కోట్లు క్యాపిటల్ వ్యయానికి సంబంధించినవి. మిగతావి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులను కొంత మేర తిరిగి చెల్లించడానికి ఉద్దేశించినవి. లాక్‌డౌన్ నేపథ్యంలో అప్పులు తిరిగి చెల్లించడానికి ఆరు నెలల పాటు గడువు ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కానీ ఎలాంటి సానుకూల నిర్ణయం వెలువడలేదు. దీంతో వీటిని చెల్లించాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. రిజర్వు బ్యాంకు నుంచి కూడా ఎలాంటి హామీ లభించలేదు. కొత్తగా తీసుకునే సంక్షేమ అవసరాలకు, ఉద్యోగుల జీతభత్యాలకు, రోజువారీ అవసరాలకు వినియోగించాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఈ ఏడాదికి మాత్రం రాష్ట్ర సంపదను సృష్టించే కాపిటల్ ఎక్స్‌పెండిచర్ చాలా పరిమితం కానుంది.

కాపిటల్ ఎక్స్‌పెండిచర్ కింద ప్రగతి పద్దు, కేంద్ర ప్రాయోజిత పథకాలు, మౌలిక సదుపాయాలు అనే మూడు కేటగిరీల కింద ప్రభుత్వం కేటాయింపులు చేసింది. వీటిలో మౌలిక సదుపాయాలు (కొత్త ఆస్తుల నిర్మాణం) కోసం నీటిపారుదల శాఖకు రూ.4 వేల కోట్లు, రోడ్లు భవనాల శాఖకు రూ.1,100 కోట్లు, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.962 కోట్ల చొప్పున కేటాయింపులున్నాయి. రోడ్లు, భవనాలు, గ్రామీణాభివృద్ధి శాఖల్లో కొత్త పెట్టుబడులు అనుమానమే. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తొలిసారి రోడ్లు భవనాల శాఖకు ఈ ఏడాది బడ్జెట్‌లోనే ఎక్కువ కేటాయింపులున్నాయి. కాగా, లాక్‌డౌన్ దాన్ని నిరాశపర్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పదేళ్ల కాలంలో చేయని పెట్టుబడి వ్యయాన్ని తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వం కేవలం 5 సంవత్సరాల్లో చేసి చూపిందని టీఆర్ఎస్ నేతలు చాలా సందర్భాల్లో కాస్త గొప్పగానే చెప్పుకునేవారు. కానీ కరోనా విపత్తు దాన్ని నీరుగార్చింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి పెట్టుబడి వ్యయం చేయలేని పరిస్థితులు వచ్చాయి. ఇదే ఇప్పుడు ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది.

Tags: telangana, lockdown, budget, capital expenditure

Advertisement

Next Story

Most Viewed