మే 15 వరకు స్థానిక సమరం పూర్తి

by Anukaran |   ( Updated:2021-04-07 10:43:40.0  )
Local body elections
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో స్థానిక పోరును పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికనుగుణంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా వేగం పెంచింది. ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలు జరుగాల్సిన రెండు కార్పొరేషన్లలో వార్డుల విభజనను పూర్తి చేశారు. త్వరలోనే రిజర్వేషన్లను కూడా ఖరారు చేయనున్నారు. ఇంకా మిగిలిన ప్రాంతాల్లో ఓటరు జాబితా ఫైనల్​ చేస్తున్నారు. పోలింగ్​ కేంద్రాలను కూడా ఖరారు చేయాలని ఎస్​ఈసీ ఆదేశించిన విషయం తెలిసిందే.

ఇదే ఊపులో కొట్టేద్దాం

రాష్ట్రంలో దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వ్యతిరేకతను ఎదుర్కొన్న అధికార పార్టీ మండలి ఎన్నికల నుంచి పుంజుకున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న నాగార్జున సాగర్​ ఉప ఎన్నికల్లో తమదే గెలుపు అనే ధీమాతో ఉంది. దీంతో రాష్ట్రంలో ఎన్నికలు జరుగాల్సిన గ్రామీణ, పట్టణ ప్రాంతాల ఎన్నికలను పూర్తి చేయాలని భావిస్తోంది. దీనిపై ఇప్పటికే ఆయా జిల్లాల ప్రజాప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు. ఊపులో ఉన్నప్పుడే ఎన్నికలను పూర్తి చేయాలని, గులాబీ జెండా ఎగురవేయాలంటూ పిలుపునిచ్చారు. రెండు దఫాల్లో స్థానిక ఎన్నికలను పూర్తి చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలకు ఒక దఫాలో ఎన్నికలను నిర్వహించనుండగా, గ్రామీణ ప్రాంతాల్లోని సర్పంచ్​లు, వార్డు స్థానాలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల ఎన్నికలను మరో దఫాలో నిర్వహించాలని భావిస్తున్నట్లు అధికారవర్గాలు చెప్పుతున్నాయి.

రాష్ట్రంలోని ఆదిలాబాద్​ జెడ్పీటీసీ స్థానంతో పాటుగా 60 ఎంపీటీసీ స్థానాలు, 20 గ్రామ పంచాయతీ పాలకవర్గాలు, 105 సర్పంచ్​లు, 2288 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. కొన్నింటికి ఇప్పటి వరకు ఎన్నికలు జరుగకపోగా… మరికొన్నింటికి ఉప ఎన్నికలు వచ్చాయి. దీంతో వీటన్నింటికీ ఎన్నికలను పూర్తి చేయాలని ఎస్ఈసీ నిర్ణయం తీసుకుంది. ఫోటో ఓటర్ల జాబితాను ఖరారు చేస్తున్నారు. పోలింగ్​ కేంద్రాల తుది జాబితా కూడా సిద్ధమవుతోంది.

మే 15 వరకు కంప్లీట్​

రాష్ట్రంలో రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలతో పాటు దాదాపు 2వేలకుపైగా గ్రామాల్లో స్థానిక పోరుకు సిద్ధమవుతున్నాయి. దీంతో గ్రామాల్లొ మరోసారి ఎన్నికల వాతావరణం నెలకొంది. అయితే వీటిని వచ్చేనెల 15 వరకు పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గ్రామ పంచాయతీలకు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కాగా… కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో చేయాల్సి ఉంది. వీటికి త్వరలోనే ప్రభుత్వం నుంచి రిజర్వేషన్లు ఖరారు చేసి జాబితాను ఎస్ఈసీకి అందించనున్నట్లు తెలుస్తోంది. రిజర్వేషన్లు వచ్చిన తర్వాత ముందుగా పట్టణ పోరుకు నోటిఫికేషన్​ జారీ చేస్తారని సమాచారం. పట్టణ సంగ్రామానికి ఈ నెలలోనే నోటిఫికేషన్​ వస్తుందంటున్నారు. ఈ నెలలోనే ఎన్నికలను ముగించి, వెంటనే పల్లె పోరుకు నోటిఫికేషన్​ జారీ చేయనున్నట్లు ఎన్నికల సంఘం ఉన్నతాధికారి చెప్పుతున్నారు. ఎన్నికలను నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామంటున్నారు. దీని ప్రకారం ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలిచ్చినట్లు చెప్పుకుంటున్నారు. పట్టణ, పల్లెపోరును వచ్చేనెల 15 వరకు పూర్తి చేయాలని అటు ప్రభుత్వం భావిస్తుండగా ఇటు ఎన్నికల సంఘం కూడా ఏర్పాట్లు వేగవంతం చేస్తోంది.

Advertisement

Next Story