- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఓ భావుకుని జ్ఞాపకాల సంతకాలు..
‘ఇదీ నా స్వభావం, పక్షులదీ ఇదే, ఏమంటే వసంతంలో వెర్రిగా రాగాలు పోయే కోయిలలు, శిశిరంలో పాటలు పాడిన దాఖలాల్లేవు’ వాడ్రేవు చినవీరభద్రుడు గారి కథల సంపుటిని చదివిన వారికి ఈ కవి కోకిల కవితా పంక్తులు గుర్తుకురాకపోతే వారు ఆ కథలు ‘మనసు’తో చదవలేదు అనుకోవాలి. రచయిత, పాఠకుల మధ్య సంగీత సాహిత్యాల అనుబంధం ఉంటుంది. కథలోని ‘లయ’ నడకలు పాఠకున్ని రచయిత ప్రపంచంలోనికి తీసుకువెళ్తాయి. ‘అక్షరాలకు తడి ఉంటుంద’ని ఓ కవి మిత్రుడు చెప్పాడు. ఈ కథలంతట తడి, ఆర్ద్రతలతో పాటు ఆవేదన, ఆలోచనలు కూడా కనిపిస్తాయి కదిలిస్తాయి. వీరలక్ష్మి గారు తన ‘కథా సమయం ఆసన్నమైంది’ చినవీరభద్రుడి చేతివేళ్లగా పరుశువేది అంటుకొని ఉందని చాలామంది అంటారు అంటూనే వాడు (ఈమె రచయితకి అక్కగారు) ఏ అక్షర సమూహం తాకి అది సమ్మోహనకరమైన సాహిత్య రూపంగా మారిపోతుందంటారు.
ఈ కథల వెనుక ‘రచయిత’ భావుకతను దర్శించిన ఎవరికైనా ఆమె మాటల్లో ‘వాస్తవం’ అవగతం అవుతుంది. చినవీరభద్రుడు గారి కథా సంకలనంలో 35 కథలు ఉన్నాయి. మూడున్నర పదుల జీవితాలున్నాయి. ఆ జీవిత సత్యాల వెనుక ఆవేదన, ఆర్తి, ఆకలి, నమ్మకాలు, విశ్వాసాలు, ‘బ్యూరోక్రసీ’, ‘హిప్పోక్రసి’, సమాజ గమన (వి)చిత్రాలు ఇలా ఎన్నో పార్శ్వాలు కనిపిస్తాయి. పఠితకు విభ్రమం కలిగిస్తాయి. ఈ కథలన్నీ 1990 నుంచి 2023 వరకు రాసినవి. మొదటి భాగంలో సహజమైన ‘యువ’ సమయ ‘యవ్వన’ స్మృతుల అక్షర రూపం. రెండవ, మూడవ భాగాలలో వ్యక్తి క్రమానుగత వ్యక్తిత్వ వికాస చిత్రాలు 'దృశ్య’మానమవుతాయి. కథలన్నీ ‘ ప్రత్యక్ష సాక్షి’ అనుభవాలే...
ఈ కథలలో రచయితలోని రెండు ప్రపంచాలు కనిపిస్తాయి. వాటి మధ్య ఘర్షణ కనిపిస్తుంది. ‘మనిషి తనను తాను అన్ని కోల్పోయిన తరువాత కలిగిన పరితాపం, పశ్చాత్తాపాలు ఓ ముగింపు ఇవ్వలేని కవితా పంక్తులని తిలక్ చెబుతారు కారణాలు అనేకం. రచయిత కేవలం భావుకుడే కాదు, భావుకతను ఆలోచనాత్మకంగా కథలలోనూ, 'చిత్రాలలోనూ అనువదించగల సమర్థ అక్షరశిల్పి. 'కథ’ ప్రారంభం, ముగింపులు ఓ ఆశ్చర్యానుభూతి కలిగిస్తాయి. కేవలం ఎనిమిది మాత్రమే ప్రథమపురుషలో ఉంటాయి.
చినవీరభద్రుడి కథలలో (తొలి కథలు) స్త్రీ పురుష సంబంధాలలోని సున్నితమైన అంశాల మధ్య రాపిడి వెనుక మానవ వ్యక్తిత్వ చిత్రణ ఉంది. స్త్రీలు స్వాతంత్ర్యం గురించి వేసిన ప్రశ్నలు ఉన్నాయి. 'సశేష ప్రశ్న’ 'ఆకాశం' 'శరణార్థి ఇందుకు ఉదాహరణ. క్రమానుగతిలో సమాజ రీతులు రచయితలో విశ్లేషణాత్మకతకు వాస్తవిక దృక్కోణం 'విషయాన్ని’ అందిస్తుంది. ప్రథమభాగంలోని పై కథలకు రెండవభాగంలో చాలావరకు 'విశ్లేషణ’ కనిపిస్తుంది. వాటి వెనుక పాత్రల వేదన, సాధన 'ఏ స్థాయిదో కూడా అక్షరరూపమవటం ఆయన కథన శిల్ప చాతుర్యానికి మచ్చుతునక. మూడవ భాగంలో ఆయన ఓ అధికారిగా విధి నిర్వహణలో తెలుసుకున్న అంశాలు ఉన్నాయి. వాటి 'కథనాలు’ వెనుక 'వ్యక్తి' ‘వ్యవస్థ’లకు మధ్య అధికార, ప్రజల అకాంక్షల నడుమ ఓ యుద్ధ నేపథ్యాన్ని కథల్లో చూపిస్తారు. కథకు 'శీర్షిక’నుంచడం ఒక సాహితీ పరమైన ఫేట్. ఉదాహరణకు ‘శరణార్థి’, 'వెయ్యేనుగుల ఊరేగింపు’ 'సశేష ప్రశ్న’ ' సొంత ప్రపంచం’, ‘పరాయి ప్రపంచం’ 'ట్రాఫికల్ ఫేవర్ ' అమృతం' 'మాప్ మేకింగ్' 'నమ్మదగ్గ మాటలు' ‘రాముడు కట్టిన వంతెన' కాపాడుకోవలసిన వాళ్ళు' ఇలా రాస్తూ పోతే మూడున్నర పదుల కథల పేర్లు రాయాలి. స్థలాభావం అంగీకరించదు.
కథల్లోని ఎన్నెన్నో వ్యాఖ్యానాలు వ్యక్తుల అంతరాలను, అంతరంగాలను వర్ణనాత్మకంగా 'వినిపిస్తాయి’. సంప్రదాయాల మాటున వివాహం కూడా మనుషుల మధ్య దూరాన్ని సహజంగా కలిగి ఉంటాయని రావి చెట్టునీ, వేప చెట్టుని కలిపి పెంచుతారు... సంప్రదాయంలో మా వివాహం నాకు అతన్ని, అతన్ని నాకు తోడు ఉంచింది. అంతే' చనిపోయిన భర్త నుండి స్వాతంత్ర్యం పొందినదా అనే ప్రశ్నకు ఆమె సమాధానం ' స్వతంత్రం నా జీవితంలో ఎప్పుడూ ఉంది. అప్పటి స్వేచ్ఛ నా భర్త ఇచ్చినది. ఇప్పుడు నాకు నేను ఇచ్చుకున్నది’ సిద్ధాంతాల నుంచి, జీవన పద్ధతుల మీద నుంచి జీవితాన్ని నడపకూడదనే వ్యాఖ్యానం వెనుక 'నీతి సూత్రం వర్తమానంలో ఎక్కడో జారిపోతుందనిపిస్తున్నది. ఆర్థికపరమైన స్వేచ్ఛ, చక్కని ఉద్యోగం, సంపదలు, పిల్లలు.. ఇవేవీ ఎందుకు ఆనందం ఇవ్వటం లేదు. 'మేము ఆనందంగా లేము’ అనేది ఎక్కువ విషాదం, 'శరణార్థి’ కథానాయిక ఇదే చెబుతుంది. కథనాయిక మొత్తం సారాంశాన్ని ప్రారంభ వాక్యంతోనే ‘చెప్పేయటం’ ఈ కథలో చూడవచ్చు. ‘మంచు తెరలు’ కథలో ఆరంభ వాక్యం తనకి సర్వ్ చేయబడిన ఐస్ క్రీంని పట్టించుకోకుండా ఆ యువకుడు మా అందరిని ఉద్దేశించి అశాంతిగా అడిగాడు. ‘అయితే మానవ సంబంధాల్లోని క్లాష్ ని తొలగించలేమనే అంటారా”.. కథలు జీవితాన్ని సంపూర్ణంగా ఆవిష్కరించలేవు. జీవన శకలాలను మాత్రమే ప్రదర్శించగలవు. కానీ.. శకలాల వెనుక శిథిల చైత్యాల రూపురేఖలు విస్తృతంగా విస్తరించగల అవకాశాలున్నాయి.. ఇవి సంపూర్ణమా అసంపూర్ణమా అనే సంశయం సహజం. తరచి చూసుకోవలసినది ‘కథ’కు మూలమైన వారే! అక్షరాలకు తడి, సుడి ఎంత లోతుగా ఉంటాయో, హృదయాలను ఎలా చుట్టుముట్టి అలజడి చేస్తాయో’ ఈ కథలలో కనిపిస్తుంది. ‘రాముడిలో గొప్పతనం ఏమిటంటే తనని అనుసరించిన ప్రతివాణ్ణి రామునిగా మార్చేస్తాడు.’
“నేను మనుషుల్ని వదులుకునే విద్య నేర్చుకున్నాను గానీ, కలుపుకోగలిగే విద్య నేర్చుకోలేకపోయాను’ అనే వాక్యాల అంచుల్లో వ్యక్తిత్వాల్లో తగ్గిపోతున్న, తరిగిపోతున్న ‘దగ్గరితనం’, అది నేర్పని వాతావరణం విశ్వరూప సమానంగా నాకనిపించింది. ‘తనని తాను వదులుకోవడానికి సిద్ధపడే వాళ్ళకే రాముడు ఎక్కువ సన్నిహితుడు అనిపించింది.’ అనే ముగింపు… జీవితాలలో ‘మనుషుల’ పట్ల నమ్మకాన్ని అవసరాలకు ‘అంతం’ లేదనే చెబుతుంది. ఈ పుస్తకం నిండా ఇటువంటి వ్యాఖ్యానాలు కోకల్లలు.. ఎల్లలు లేని సంద్రం ముందు ‘సెల్’ లో తనను తాను దాక్కుని మురిసిపోయే నత్త గుల్లలుకు మనుషులు చిహ్నాలు.. కాదనగలమా?
‘కథ అంటే ఏమిటి ఆద్యంతాలు లేని అనుభవాలకి ఒక ఆద్యంత స్ఫురణని కలిగించడం. కథ అంటేనే ఏదో ఒకటి జరగాలి..’ అని చినవీరభద్రుడు గారే (అపరాహ్ణ రాగం) చెబుతారు.. కరోనా ‘మనిషి’లోని మానవత్వపు కోణాలను ఆవిష్కరించింది. ఈ నేపథ్యంలో వచ్చిన కథ ఎన్.హెచ్.44. కథ ముగింపులో ‘గంజిలక్ష్మి’ని సన్మానించమని కలెక్టర్‌కు చెప్పిన గంగారెడ్డి ఔదార్యం, మానవీయ కోణాలను కఠినాత్ముడైనా ‘కన్నీరు’ పెట్టవలసిందే అన్నట్టుగా ‘కథనాన్ని’ ముగింపు తీసుకువచ్చిన వైనం… అద్భుతం… అందరూ చదవవలసింది…“చినవీరభద్రుడు భావుకుడు. తానే ఆండాళ్ కాగలిగిన వాడు ఎంత భావికుడు’ డి.చంద్రారెడ్డి గారి అభిప్రాయం. ఈ కథలంతటా ఆయన భావుకత, అక్షర రమ్యతలు బంగారానికి తావి అబ్బిన చందంగా ఉండటం గొప్పతనం. దాచు‘కొని’ చదవవలసిన కథలు.
సమీక్షకుడు
-డా. దార్లపూడి శివరామకృష్ణ
89198 25643