ఆగిపోని ప్రశ్నలతరం బర్రెలక్క అభ్యర్థిత్వం

by Ravi |   ( Updated:2023-11-27 01:00:27.0  )
ఆగిపోని ప్రశ్నలతరం బర్రెలక్క అభ్యర్థిత్వం
X

ఎంతటి రెపరెపలాడిన పోరాట తెలంగాణ ఇలా వాలిపోయి వాడిపోయి ఉన్నది ఎందుకు? అని ఒక మిత్రులు సందేహం వ్యక్తం చేశారు. అట్లా ఎందుకు, పోరాటం ఆగిపోని రవ్వ.. ఎక్కన్నో మినుకు మినుకు మంటది లే అని నేను అతనితో అన్నకానీ, నాకు ఆయన ప్రశ్న మళ్లీ మెరుస్తూనే ఉంది. ఎందుకంటే తెలంగాణ నేల మీద రెండుసార్లు సాయుధ పోరాటాల అనంతరం ఉవ్వెత్తున ఉద్యమాలు లేచి నిలిచిన చరిత్ర. అన్యాయాలను అక్రమాలను అక్రమాలను అహంకారాలను ఏ స్థాయిలోనైనా ప్రశ్నించిన నేల కదా గడిచిన కొన్నేండ్లు ఇలా స్తబ్దంగా ఒక తరం తయారవుతున్నదా అన్పించింది. తెలంగాణ యువతరం నిరాశకు లోనైంది. ఉద్యోగాల కల్పనపై పాలకులకు పట్టింపు లేకపోవడం ఉన్నత విద్యా వ్యవస్థ పూర్తిగా నాశనం అయిన పరిస్థితి. ఏ విశ్వవిద్యాలయాల్లో చూసినా మూడువంతుల మంది ఆచార్యుల పోస్ట్‌లు ఖాళీలు ఉన్నాయి. ఎన్ని అన్యాయాలు జరిగినా సైలెన్స్ గానే కన్పించింది.

నిరాశ నుంచే నిప్పురవ్వలా ..

కానీ ఈ రోజు బర్రెలక్క ఎలియాస్ శీరిష ఒక యువతర ప్రతినిధిగా ధైర్యంగా నిలిచింది. తన పోరాటాన్ని నిరుద్యోగ యువతరం ప్రభుత్వాలకు వేస్తున్న ప్రశ్నగా నిలిపింది. ఆ అమ్మాయి పచ్చి పల్లెటూరి సున్నిత తత్వాన్ని కాపాడుకుంటూ ఈ రోజు కొల్లాపూర్ నియోజకవర్గంలో ప్రశ్నల కొడవలిగా నిలబడింది. తెలంగాణ సాధన అనంతరం నీళ్లు, నియామకాలు వస్తాయనుకుంటే నీళ్ళైతే వచ్చాయి కానీ నియామకాల దగ్గర పెద్ద నైరాశ్యం ఏర్పడ్డది. టీఎస్‌పీఎస్సీ తీరు అందరు నవ్వుకునేట్లు తయారైంది. ఏండ్లకు ఏండ్లు కష్టపడి చదువుకున్న యువతరం జీవితాల్లో నిర్వేదం ఏర్పడ్డది. ఇచ్చిన ఉద్యోగాల్లో పోలీసులు ఎక్కువ మంది ఉన్నా ఉపాధ్యాయులు గ్రూప్-1 నోటిఫికేషన్లు రాక, వచ్చినా లీకేజీ అయి నిరాశపరిచినయి. ఈ నిరాశ నుంచే నిప్పురవ్వలా తయారైన స్వరం బర్రెలక్క శీరిష.

కేసు వేయడంతో..

ఈ నాటి యువతరం సృజనాత్మక చైతన్యం, సాంకేతికతను కలుపుకొని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నది. అరబ్ దేశాల్లో జాస్మిన్ విప్లవం ఇలా సామాజిక మాధ్యమాల ద్వారానే వచ్చి ప్రజల్లో చైతన్యం వచ్చి అక్కడ అవినీతికి వ్యతిరేకంగా ఒక దేశ అధ్యక్షున్ని దించే స్థితి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ‘యూట్యూబ్’ చాలా బలమైన ఆయుధం. శిరీష చాలారోజుల క్రితం గ్రూప్స్ పోటీ పరీక్షలు రాసింది. కానీ పేపర్లు రద్దు అయిపోవడం వల్ల విసుగు చెంది బర్లు కాస్తున్న వీడియోను పోస్ట్ చేసింది. ఇది ప్రభుత్వానికి మింగుడు పడలేదు. అత్యుత్సాహంతో ఆ అమ్మాయి మీద పోలీస్ కేసు నమోదు చేశారు. ఆ పోలీస్ కేసు ఆమెను మరింత ధృఢపరిచింది. రాజ్యాంగం ఇచ్చిన భావ ప్రకటన హక్కును ఉపయోగించుకొని నా మానాన నేను బర్లు కాసుకుంటుంటే కేసేందుకు వేశారు అనుకుంది. ఆ కేసులు, కోర్టుల చుట్టూ తిరుగుతున్న దశలోనే కొల్లాపూర్ నియోజకవర్గంలో నామినేషన్ వేయడంతో మరింత సంఘటితం అయ్యింది. ఆమెకు మద్దతు రోజు రోజుకు పెరుగుతుంది.

ప్రశ్నను బతికించిన బర్రెలక్క

ఒక కాజ్ కోసం పోరాటం చేస్తున్న బర్రెలక్క విపరీతమైన ప్రజాబలం పొందుతున్నది. నిజానికి ఆమె చదువుకున్నది హైదరాబాద్‌లో, గ్రూప్స్‌కి ప్రిపేర్ అయ్యింది. అవి రద్దు అయినవి. లాభం లేదు ఇంటికి వచ్చి బర్లు కాస్తోంది. ఎడ్లు, బర్లు, మేకలు పెంచే వాళ్లకు కళా హృదయం ఉంటది వాల్లు పాటల ద్వారా మాటల ద్వారా భావ వ్యక్తీకరణ చేస్తారు. శిరీష చదువుకున్న, ఆధునిక సాంకేతికత తెల్సిన అమ్మాయి కాబట్టి ‘యూట్యూబ్’ ద్వారా వేలమందికి చేరువైంది. దాంతో ప్రభుత్వాలకు గానీ ఎవలకు గానీ ఏ నష్టం లేదు. కానీ పోలీసులు కేసు పెట్టడంపై ఆమె తిరుగుబాటు స్వరం, చైతన్యం సహజంగానే వచ్చింది.

తెలంగాణ సమాజంలో ప్రశ్నించడం, వ్యతిరేకించడం, అడగటం, మాట్లాడటం అనేది ఆది నుంచి ఉన్నవే. ఈ గుణాత్మకత వల్లనే తెలంగాణ ఉద్యమం వచ్చింది. తెలంగాణ సాధించుకున్నం, కానీ అప్పటి కొన్ని గొంతులు మూగపోవడం కొన్ని సంఘాలు సైలెంట్ కావడం వల్ల అది ఆగదు. మరోతరం ఆ ప్రశ్నను ఒక బర్రెలక్క రూపంలో తీసికున్నది. జయహో బర్రెలక్క శిరీష జయహో..

- అన్నవరం దేవేందర్

94407 63479

Advertisement

Next Story

Most Viewed