రెండు తరాల పిల్లల అల్లరి ముచ్చట్లు

by Disha edit |
రెండు తరాల పిల్లల అల్లరి ముచ్చట్లు
X

పిల్లల కోసం తల్లి ఏమైనా చేస్తుంది. నవమాసాలు మోసి కని పెంచిన తర్వాత వారు బుడి బుడి అడుగులు వేస్తూ, ముద్దు ముద్దు పలుకులు మాట్లాడితే ప్రపంచాన్ని జయించినంత సంబరపడుతుంది. శ్రీకృష్ణుడు చేసిన అల్లరిని భరిస్తూ ఆనందాన్ని పొందిన యశోదమ్మలాగే ప్రతి తల్లి తమ పిల్లల అల్లరిని భరిస్తూ వారిని వెనుకేసుకొస్తుంది. ఉమ్మడి కుటుంబంలోనైతే పిల్లలకు ప్రేమాభిమానాలు ఎక్కువ లభిస్తాయి. పిల్లల పెంపకంలో పెద్దల సూచనలు లభిస్తాయి. కానీ నేడు అన్ని చిన్న కుటుంబాలు అయిపోతున్నాయి. దాంతో పిల్లల పెంపకం తల్లిదండ్రులకు ఒక సవాలుగా మారుతోంది.

అందంగా అక్షరబద్ధం

బాల్యంలో పిల్లలు ఎంతో మారాం చేస్తారు. అమాయకంగా ఎన్నో ప్రశ్నలు సంధిస్తారు. బాల్యంలో పిల్లలు చేసిన చిలిపి చేష్టలను వారు పెద్దయ్యాక గుర్తుచేసుకుంటే నవ్వొస్తది. మరి అలాంటి ఇద్దరు గడుగ్గాయ్‌లు చిన్నతనంలో తెలిసీ తెలియకుండా చేసిన ముద్దు పనుల్ని, వారు చేసిన అల్లరి తనాన్నీ వర్ణిస్తూ మన ముందుకు 'ఏనుగును పెంచుకుందాం' అనే పుస్తక రూపంలో తెచ్చారు. ప్రముఖ బాల సాహితీవేత్త డా. కందేపి రాణి ప్రసాద్. ఇంతకు ముందే పిల్లల కోసం అనేక పుస్తకాలు రాసిన అనుభవం ఉండటం వలన ఈ పుస్తకంలో తమ పిల్లలు చిన్నతనంలో చేసిన అల్లరి ముచ్చట్లను అందంగా అక్షర బద్దం చేశారు రచయిత్రి.

ఏం పేరు పెట్టాలి?

పాప బాబు కడుపులో పడిందని తెలియగానే ఆ పుట్టబోయే పాపబాబుకు ఏం పేరు పెట్టాలనే విషయంపై దంపతులు ఎంతో ఆలోచిస్తుంటారు. అనేక పేర్లతో పెద్ద లిస్టులే తయారు చేస్తారు. అలా రాణీ ప్రసాద్ దంపతులు తమ తొలి, మలి సంతానానికి పేరు పెట్టడం కోసం పడిన తపనే 'స్వీటీ ఫ్రూటీ', 'మిల్కీ సిల్కీ' వ్యాసాలలో కనబడుతుంది. ఇది సాధారణంగా ప్రతి తల్లిదండ్రులు ఎదుర్కొనే సమస్యే. మరి రచయిత్రి దంపతులు వారు అనుకున్న పేరు పెట్టారా, లేదా అని తెలుసుకోవాలన్నా, ఆ చిచ్చర పిడుగులు బడిలో చేరక ముందు చేసిన అల్లరి గురించి తెలుసుకోవాలన్నా ఈ కథనాలు చదవాల్సిందే.

ముందు పుట్టిందెవరు?

బాల్యంలో పిల్లలు కల్లాకపటం లేని స్వచ్ఛమైన మనసు కలిగి ఉంటారు. తెలిసీ తెలియని వయసులో పిల్లలు అమాయకంగా వేసే ప్రశ్నలకు ఒక్కొక్కసారి పెద్దలు కూడా సమాధానం చెప్పలేకపోతారు. పెద్దలు అడిగే ప్రశ్నలకు పిల్లలు అమాయకంగా చెప్పే జవాబులు కూడా మనల్ని ఆలోచింపజేసేలా ఉంటాయి. అందుకు నిదర్శనమే ఈ పుస్తకంలోని 'ముందు పుట్టిందెవరు', 'సూర్యుడు పెద్ద స్టవ్', 'స్కిన్ లేకపోతే స్నానమెలా చేయాలి' మొదలైన కథనాలు.

ఏనుగును పెంచుకుందాం అంటూ మిల్కీ చేసిన అల్లరిని బుజ్జగించడానికి తల్లిగా రచయిత్రి ఏమి చేసింది, అందుకు ఆ చిన్నోడు ఒప్పుకున్నాడా, లేదా అనేది తెలుసుకోవడానికి 'ఏనుగును పెంచుకుందాం' కథనం చదవాలి. గాడి పొయ్యిని తీసికెళదాం, తల్లి లేకపోతే ఎంతో కష్టం, పిల్లలూ దేవుడు చల్లనివారే, జెట్ పేర్లతో రాసిన కథనాలు కూడా ఆసక్తిదాయకంగా కొనసాగాయి. పిల్లలు చిన్నతనంలో చేసే అల్లరికి పరాకాష్టగా ఈ కథనాలు ఉన్నాయి.

అమ్మ చెప్పిన కథలు

కందేపి రాణీ ప్రసాద్ వారి పిల్లల గురించి రాస్తుంటే, వారి అమ్మగారైన అంగలకుదిటి గోవిందమ్మ నేను నా పిల్లల గురించి రాయవద్దా అంటూ వారి చిన్నప్పటి ముచ్చట్లను చెప్పసాగింది. గోవిందమ్మ తన ఇద్దరు పిల్లలు బాల్యపు గుర్తుల్ని నెమరవేసుకుంటూ చెప్పగా ఎంతో ఉత్సాహంతో రాణీ ప్రసాద్ వాటిని రాసి ఈ పుస్తకంలో పొందుపరిచారు. తెలుగు కోసం ట్యూషను, ఏమండి గారొచ్చారు, జవాబులు రాయమని చెప్పలేదుగా, బండల మీద రాతలు లాంటివి అప్పటి తరం పిల్లల మనోభావాలను తెలిపేలా ఉన్నాయి.

'ఏనుగు పెంచుకుందాం' అనే ఈ పుస్తకంలో రెండు తరాల పిల్లలకు చెందిన అల్లరి ముచ్చట్లు ఉన్నాయి. ఇద్దరమ్మల అనుభవాలు ఉన్నాయి. ఈ పుస్తకం చదివిన అమ్మలకు తమ మాతృత్వపు తొలి రోజులు గుర్తుకు వచ్చేలా ఉన్నాయి. రచయిత్రి రాణీ ప్రసాద్ కలం నుండి పిల్లలకు ఉపయోగపడే మరెన్నో పుస్తకాలు వస్తాయని ఆశిస్తూ అభినందనలు.

ప్రతులకు..

'ఏనుగును పెంచుకుందాం'

రచయిత. డా. కందేపి రాణీ ప్రసాద్,

పుటలు. 57, పుస్తకం వెల. 100 రూ.

సృజన్ చిల్డ్రన్ హాస్పిటల్,

సిరిసిల్ల, 505 301.

98661 60378

సమీక్షకులు.

కందుకూరి భాస్కర్,

94415 57188.

Next Story

Most Viewed