ఎక్స్-రే ఆవిష్కరణ వైద్య చరిత్రలో ఓ గొప్ప మలుపు - శ్రీనివాసులు శిరందాస్

by M.Rajitha |   ( Updated:2024-11-08 00:30:35.0  )
ఎక్స్-రే ఆవిష్కరణ వైద్య చరిత్రలో ఓ గొప్ప మలుపు - శ్రీనివాసులు శిరందాస్
X

దిశ, వెబ్ డెస్క్ : ఆధునిక యుగంలో ఎక్స్ - రే అంటే తెలియని వారు ఉండరు. రోగ నిర్ధారణ పరీక్షలలో ప్రాథమిక పరీక్ష ఎక్స్-రే. ఆసుపత్రి గడప దొక్కిన ప్రతి వ్యక్తి, రోగి ఎక్స్-రే పరీక్ష చేసుకొని అంటారు. అసలు ఈ ఎక్స్-రే ఆవిష్కరణ ఒక విచిత్రం. 1895 నవంబర్ 5 వైద్య చరిత్రను మలుపు తిప్పినది. ఆధునిక వైద్యరంగ పురోభివృద్ధిలో ఓ మైలురాయి. జర్మనీ కి చెందిన భౌతిక శాస్త్రవేత్త సర్ విలియం కాన్రాడ్ రాంటిజెన్ తన ప్రయోగ శాలలో ఉత్సర్గ నాళ పరీక్షలు జరుపుతున్న సందర్భంలో కేథోడ్ కిరణాల ధర్మాల పరిశీలిస్తున్న క్రమంలో ఆకస్మికంగా తన చేతి ఎముకల నీడలను ప్రక్కన ఉన్న ప్లాటినోసైనైడ్ ప్లేటు పై గమనించడం జరిగినది. ఆశ్చర్యానికి గురి అయిన రాంటీజెన్ మళ్ళీ మళ్ళీ పరీక్షలు నిర్వహించి ఏవో కంటికి కన్పించని కిరణాలు తన శరీరం గుండా ప్రసరిస్తూ ఎముకల గుండా ప్రసరించలేక వాటి నీడలను ఏర్పరుస్తుందని గమనించారు.

మనం గణితంలో తెలియని విషయాన్ని ఎక్స్ అనుకోవడం పరిపాటి. అలాగే ఈ గుర్తు తెలియని, కన్పించని కిరణాలను ఎక్స్ కిరణాలు అని అప్పటికి భావించారు. అయితే ఆ ఎక్స్ కిరణాల నామధేయం అలాగే చిర స్థాయిగా నిలిచిపోయింది. క్రమేణా ఎక్స్ కిరణాలు ఉపయోగించి వివిధ రకాల రోగ నిర్ధారణ యంత్రాలు అభివృద్ధి చెందాయి. అప్పటి వరకు రోగి శరీర ధర్మాలు తెలుసుకోవడానికి, శరీరంలోని రుగ్మతలు, కంతులు తెలుసుకోవడానికి, విరిగిన ఎముకలు వాటి ఆనవాళ్లు తెలుసుకోవడానికి రోగి శరీరాన్ని కోసి తెలుసుకునేవారు. ఎప్పుడైతే ఎక్స్ - రే యంత్రం ఆవిష్కరణ జరిగిందో నాటి నుండి శరీరానికి ఎలాంటి గాటు పెట్టకుండా శరీర అవయవ నిర్మాణం, లోపాలు, విరిగిన ఎముకల ఆనవాళ్లు తెలుసుకోవడం జరిగింది.

శాస్త్ర సాంకేతికత కొత్త పుంతలు తొక్కడంతో ఎక్స్ కిరణాల ఆధారంగా రక రకాల రోగ నిర్ధారణ యంత్రాలు అభివృద్ధి చెందాయి. ఎక్స్-రే మొదలుకొని కంప్యూటెడ్ టోమోగ్రఫీ, మామోగ్రఫీ, బోన్ డెన్సిటోమెట్రీ, డెంటల్ ఎక్స్ రే, కంప్యూటర్ రేడియోగ్రఫీ, డిజిటల్ రేడియోగ్రఫీ, ఆల్ట్రాసౌండ్, మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ మొదలగు రోగ నిర్దారణ యంత్రాలు అభివృద్ధి చెంది వైద్య రంగంలో రేడియాలజీ రోగ నిర్దారణ పరీక్షల పాత్ర కీలకం అయ్యింది.

ర్యాంటిజెన్ ఎక్స్-రే కనుకున్న రోజును పురస్కరించుకుని ప్రతి సంవత్సరం నవంబర్ 5 న యూరోపియన్ సొసైటీ ఆఫ్ రేడియాలజీ, రేడియోలజీకల్ సొసైటీ ఆఫ్ నార్త్ అమెరికా, అమెరికన్ కాలేజ్ ఆఫ్ రేడియాలజీ, 2012 నుండి అంతర్జాతీయ రేడియోలజీ దినోత్సవంగా జరుపుతున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రజలు, రోగులు రేడియాలజీ గురించి అవగాహన చేసుకోవడం, వివిధ యంత్ర పరికరాల గురించి తెలుసుకోవడం, రేడియాలజిస్టులకు, సాంకేతిక నిపుణులకు కృతజ్ఞతలు తెలుపడం, మెడికల్ ఇమేజింగ్ రీసెర్చ్ కు మద్దతు పలకడం, విజయ గాథలు మననం చేసుకోవడం జరుగుతుంది. సొసైటీ ఆఫ్ రేడియోగ్రాఫర్స్ ఇదే వేడుకను ప్రపంచ రేడియోగ్రఫీ దినోత్సవం గా జరుపుతున్నారు.

ఈ సందర్భంగా రోగులకు, సాధారణ ప్రజలకు రేడియాలజీ సేవలు, యంత్ర పరికరాలు, సదుపాయాలు, రేడియేషన్ నుండి సంరక్షణ మొదలగు అంశాల పట్ల అవగాహన కోసం వివిధ ఆసుపత్రులలో అవగాహన సదస్సులు, గోడ పత్రికల ఏర్పాటు చేస్తున్నారు.ఈ సంవత్సరం రేడియోగ్రాఫర్స్ - సీయింగ్ ద అన్సీన్ అంటే రోగ నిర్ధారణలో ఎవరూ చూడనిది ముందుగా రేడియోగ్రాఫర్స్ చూస్తారు అన్న ధీమ్ తో ఉత్సవాలు ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా దేశంలోని అన్ని ఆసుపత్రులలో ప్రపంచ రేడియోగ్రఫీ వేడుకలు నిర్వహిస్తున్నారు. సొసైటీ ఆఫ్ ఇండియన్ రేడియోగ్రాఫర్స్ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు..

గుర్బర్ట్ అనే సంస్థ దేశంలోని 12 పట్టణాల్లో ఏక కాలంలో భౌతికంగా అతి పెద్ద రేడియాలజీ సెమినార్ ను నిర్వహిస్త్తుంది. ఈ కార్యక్రమాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారు నమోదు చేయనున్నారు. ఈ కార్యక్రమం హైదరాబాద్ లో బంజారాహిల్స్ లోని తాజ్ దక్కన్ శుక్రవారం 5 గంటలకు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని రేడియాలజిస్టులు, రేడియాలజీ నిపుణులు పాల్గొంటున్నారు.

ఓ శతాబ్దం వెనక్కి వెళితే రోగి రుగ్మతలను తెలుసుకోవాలన్నా, ఇరిగిన ఎముకలను, పగుల్లను గుర్తించాలన్నా, రోగి వివిధ శరీర అవయవాలలో కేన్సర్ కంతులను గమనించాలన్నా, మెదడు లోని రక్త నాళాల లో రక్తం గడ్డ కడితే తెలుసుకోవాలన్నా, చిన్న, పెద్ద పేగులకు రంధ్రం పడ్డా చివరికి గుండెకి చిల్లి పడ్డా, గుండె పని తీరును అధ్యయనం చేయాలన్నా, రొమ్ము క్యాన్సర్ ను గుర్తించాలన్నా, ఊపిరితిత్తులలో నీరు చేరినా ఆయా శరీర భాగాలలో కోతలు పెట్టీ, శస్త్ర చికిత్సలు చేస్తే గాని తెలుసుకోలేక పోయేవారు.. కాని నేడు శరీరానికి చిన్న గాటు అయినా పెట్టకుండా, ఎలాంటి శస్త్ర చికిత్స లేకుండా వివిధ శరీర అవయవాల నిర్మాణం, పనితీరు, అవలక్షణాలు, రుగ్మతలు గుర్తించడంతో పాటు ముందుగానే కేన్సర్ లాంటి రోగాలను పసిగట్టే వీలు ఈ రోజు సాధ్యమైంది.

ఇదంతా ఎలా..కేవలం ఎక్స్ కిరణాల ఆవిష్కరణ తో సాధ్యమైంది. ఎక్స్ కిరణాల ఆవిష్కరణ వైద్య చరిత్ర లో ఓ గొప్ప మైలు రాయి. ఎక్స్ కిరణాల నుపయోగించి ఎన్నో అధునాతన రోగ నిర్ధారణ, చికిత్సా యంత్రాలను కనుగొనడం జరిగింది. ఎక్స్ కిరణాలతో వైద్య రంగంలో పలు విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఎక్స్ కిరణాల ఉపయోగాలు ఎన్ని ఉన్నాయో సుశిక్షితులైన సాంకేతిక సిబ్బంది పర్యవేక్షణలో జరగక పోతే అనర్థాలు సంభవించే అవకాశం ఉంది. ఎక్స్ రే కిరణాలు ఉపయోగిస్తూ రేడియాలజీ విభాగం లో రోగ నిర్ధారణకు మాత్రమే కాకుండా కాన్సర్ లాంటి రోగ నివారణకు ఉపయోగపడే ఎన్నో అద్భుత మైన ఉపకరణాలు, యంత్రాలు కనుగొనడం జరిగింది.

ఎక్స్ రే ఆవిష్కరణ వైద్య రంగం లో ఎన్నో కీలక మార్పులు వచ్చాయి. మొదట్లో ఎముకల పగుల్లని చూడడానికి మాత్రమే వినియోగించారు. తరువాత క్రమంలో వివిధ యంత్ర పరికరాల వివిధ అవయవాల నిర్మాణం, పనితీరు, రుగ్మతలు తెలుసుకోవడమే కాకుండా చికిత్సలు చేయడానికి ఈ ఆవిష్కరణలు తోడ్పడుతున్నాయి. మెదడు, నాడీ వ్యవస్థ, రక్త నాళాలు, ఎక్స్ కిరణాల ను ఉపయోగిస్తూ పనిచేసే ఎన్నో ఆధునిక పరికరాలు ఫ్లోరో స్కోపి, కంప్యూటెడ్ టోమోగ్రఫీ, పెట్ స్కాన్, స్పెక్ట్ స్కాన్, గామా కమెరా, సి.ఆర్మ్ మొదలైన ఎన్నో రోగ నిర్ధారణకు ఉపయోగించే యంత్రాలు ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి.

ఎక్స్ రే కిరణాలు కనుగున్నాక వైద్య రంగం లో ఒక రోగ నిర్ధారణ విభాగం రేడియో డయాగ్నోసిస్ విభాగం నెలకొల్పారు. అది శాఖోపశాఖలుగా విస్తరించి ఈనాడు రేడియాలజీ మరియు ఇమేజియాలజీ, రేడియేషన్ ఆంకాలజి, రేడియో థెరపీ, నుక్లియర్ మెడిసిన్ మొదలైన విభాగాలు ప్రాచుర్యం లోకి వచ్చాయి. ఎక్స్ కిరణాలు అన్ని పదార్థాల గుండా ప్రయాణం చేయలేవు. అవి ప్రయాణం చేయలేని పదార్థాలను లేదా కణజాలాలను ఎక్స్ రే నిరోధకాలు (Radio Opaque) గా ఉదాహరణకు ఎముకలు, బేరియం, అయోడిన్ ఆధార సంయోగాకాలు, అధిక సాంద్రత, అధిక పరమాణు సంఖ్య గల పదార్థాలు. అదే ఎక్స్ కిరణాలు ప్రసారం కాగలిగే పదార్థాలను, కణజాలాలను రేడియో పారదర్శకాలు (Radio Luscent) గా పేర్కొంటారు. సరిగ్గా ఇదే ధర్మాన్ని ఆధారంగా చేసుకొని బేరియం, అయోడిన్ మొదలైన రసాయన పదార్థాలు ఇతర హానికరం గాని పదార్ధాలతో మేళవించి శరీర భాగాల లోకి పంపించి ఆ అవయవాల నిర్మాణం, పని తీరు, అవలక్షణాలు అధ్యయనం చేస్తున్నారు.

విసర్జక వ్యవస్థ, నాడీ వ్యవస్థ, హృదయ, రక్త ప్రసరణ వ్యవస్థ, కు సంబంధించి అయోడిన్ ఆధార పదార్థాలను ఆయా శరీర భాగాలలో కి పంపించి వాటి పనితీరు, నిర్మాణం, లోపాలను అధ్యయనం చేస్తారు. అలాగే జీర్ణ వ్యవస్థ లోకి బేరియం ఆధారిత పదార్థాలు పంపించి వివిధ పరీక్షలు నిర్వహిస్తారు. పిత్తాశయ, క్లోమ గ్రంధుల, మూత్రపిండాల లోని రాళ్ళు ఎలాంటి శస్త్ర చికిత్స లేకుండా కనుగొనడం మాత్రమే కాదు ఎక్స్ రే లు ఉపయోగించి పనిచేసే సి ఆర్మ్ పరికరం, ఫ్లోరో స్కాపీ సహాయంతో వాటిని తొలగించడం జరుగుతుంది.

జీర్ణ కోశ వ్యాధుల నిర్ధారణ, చికిత్స లో ఫ్లొరో స్కాపి ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఎక్స్ కిరణాలను కేవలం వైద్య రంగం లోనే కాదు పరిశ్రమలలో వివిధ యంత్ర పరికరాల పగుళ్లు, లీకేజి లను కనుగొనడానికి, విమానయాన రంగంలో వివిధ వస్తువుల, వ్యక్తుల స్కానింగ్‌కి ఉపయోగిస్తున్నారు. ఈ విభాగపు ఉప శాఖ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అభివృద్ధి చెంది రేడియాలజీ కేవలం రోగ నిర్ధారణ కే కాదు పలు రక్త నాళాల అవరోధాలు, రుగ్మతలు, వివిధ అవయవాలలో కేన్సర్ కంతుల నివారణకు, రక్త స్రావాల నిరోధనకు పలు రకాల పరీక్షలు అందుబాటు లోకి వచ్చి రేడియాలజీకి అదనపు ఆకర్షణగా రోగులకు ఓ గొప్ప వరంగా అభివృద్ధి చెందింది.

అనర్థాలు: అయితే ఈ కిరణాల ఉపయోగం ఎంత ఉందో ఎలాంటి అశ్రద్ద, అజాగ్రత వహించినా సుశిక్షితులైన వైద్యులు, సాంకేతిక సిబ్బంది లేకున్నా మేలు కన్న కీడు ఎక్కువ జరిగే ప్రమాదం ఉంది. మొదట్లో రేడియో ధార్మికత ఎక్స్ కిరణాల విధ్వంసక ధర్మాలు తెలియక ఎక్స్ కిరణాలను వివిధ ప్రయోగ దశల్లో వినియోగించిన ఎందరో శాస్త్రవేత్తలు మేడం క్యూరీ, రాంటిజెన్‌తో సహా ఆయన భార్య, కేన్సర్‌తో మరణించారు.

ఎక్స్ రే లు శరీర అవయవాల కణజాలాల గుండా ప్రసరించి నపుడే కలిగే మార్పులు, అనర్థాలు ఒకసారి పరిశీలిద్దాం..

ఈ ఎక్స్ కిరణాలు విభిన్న శక్తి స్థాయి లు కలిగి ఉంటాయి. తక్కువ శక్తి స్థాయి కిరణాలు శరీర భాగాల నుండి చొచ్చుకొని పోలేక వాటి శక్తిని శరీర కణజాలంలో నిక్షిప్తం చేస్తాయి. దీనినే అయానీకరణం అంటారు. తద్వారా శరీర కణజాలం లోని అణువులు క్రోమోజోముల లో మార్పులు సంభవించే ప్రమాదం ఉంది. పలు ఉత్పరివర్తనలు జరిగి కేన్సర్ కి దారితీసే ప్రమాదం ఉంది. అందుకే అయానీకరణ రేడియో ధార్మికత (Ionising Radiation) ప్రమాద కారి అంటారు. ఈ కిరణాలు ఎంత ప్రమాదకరం అంటే కేవలం ఎక్స్ కిరణాలు ఎదుర్కొన్న వ్యక్తులలోనే కాకుండా వారి భవిష్యత్ తరాల లో కూడా వాటి దుష్పరిణామాలు సంభవించవచ్చు.

ఎక్స్ కిరణాలు కేవలం ఎముకల నీడలను ఏర్పాటు చేస్తాయి, కండర కణజాలం గుండా ప్రయాణం చేయగలవు అని మాత్రమే భావించారు. వాటి దుష్పరిణామాలు తెలుసుకునే లోపే 1904 లో థామస్ ఆల్వా ఎడిసన్ సహాయకులు క్లారెన్స్ డాలీ, 1930, 40, 50 దశకాలలో ఎంతో మంది అమెరికా షూ కంపెనీ లో పని చేసే ఎంతో మంది రేడియో ధార్మిక తకు గురై మరణించారు. చివరికి ఎక్స్ రే కనుగొన్న రాంటిజెన్ కూడా చిన్న ప్రేగు కేన్సర్ తో మరణించారు. మేరీ క్యూరీ, అలెగ్జాండర్ లిత్వినెంకో, ఎబెన్ మెక్ బర్నీ మొదలైన వారు రేడియేషన్ కు గురియై మరణించిన వారే.

అందుకే ఈ రేడియాలజీ పరీక్షలకు రోగిని పురామాయించేముందు వైద్యులు ఈ పరీక్ష అవసరమా.. లాభమా, నష్టమా బేరీజు వేసుకుంటారు. నష్టం కన్న లాభం ఉన్నపుడే సిఫారసు చేస్తారు. అదేవిధంగా తక్కువ రేడియేషన్ డోసును ఉపయోగించే విధంగా సాంకేతిక సిబ్బంది పరీక్షలు నిర్వహిస్తారు. కొన్ని రేడియాలజీ పరీక్షలు తరచూ చేయించుకోకూడదు. ఒక సారి సీటీ స్కాన్ పరీక్ష చేయించుకుంటే తిరిగి అదే పరీక్ష అదే సంవత్సరం అత్యవసరం అయితే తప్ప చేయకూడదు.. అందుకే నిపుణుల సమక్షంలో ఈ పరీక్షలు చేయించుకోవాలి.

గమ్మత్తు అయిన విషయమేమిటంటే ఈ రేడియో ధార్మిక ఎక్స్ కిరణాలు కేన్సర్ కారకాలు అన్నది ఎంత నిజమో...అదే కేన్సర్ కణాల నిర్మూలనకు అవే రేడియో ధార్మిక కిరణాలు రేడియో థెరపీ చికిత్స లో ఉపయోగిస్తారు. ఈ విభాగంలో పనిచేస్తున్న డాక్టర్లను రేడియాలజిస్ట్ లుగా, సాంకేతిక సిబ్బందిని రేడియోగ్రాఫర్స్ గా ప్రస్తుతం సాంకేతికత బాగా అభివృద్ధి చెంది కంప్యూటర్ పరిజ్ఞానం తో పనిచేయడం వల్ల రేడియోగ్రఫీ & ఇమేజింగ్ టెక్నాలజిస్ట్ లు గా పిలుస్తున్నారు.

రేడియో ధార్మికత నుండి ఎలా రక్షించడానికి ఏం చేస్తారు?

రేడియేషన్ దుష్పరిణామాలు సంభవించ కుండా పకడ్బందీ చర్యలు తీసుకోవడానికి, క్షేమ కర వినియోగానికి అంతర్జాతీయ రేడియాలజీ కాంగ్రెస్ 1928 లో ఏర్పాటు అయ్యింది. అంతర్జాతీయ అణు ఇంధన ఏజెన్సీ, అంతర్జాతీయ రేడియేషన్ ప్రొటెక్షన్ కమీషన్ రేడియో ధార్మికత ను అంచనా వేయడానికి, కట్టడి చేయడానికి, సురక్షితంగా ఉపయోగమునకు కృషి చేస్తున్నాయి. మన దేశంలో అణు ఇంధన రెగ్యులేటరీ బోర్డ్ కృషి చేస్తుంది. శిక్షణ పొందిన సాంకేతిక నిపుణులు విధిగా అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్ (AERB) లో రిజిస్టర్ చేసుకొని లైసెన్స్ పొంది ఉండాలి. అదేవిధంగా రేడియేషన్ ను విడుదల చేసే ప్రతి వైద్య యంత్ర పరికరము కొనాలన్నా, ఏర్పాటు చేసుకోవాలన్నా AERB వారి అనుమతి అవసరం. కేవలం శిక్షణ పొందిన వారు మాత్రమే ఆయా యంత్రాలను, పరీక్షలను చేసే వీలు ఉంటుంది.

రేడియేషన్ దుష్పరిణామాలు చోటు చేసుకోకుండా AERB సాధారణ ప్రజానీకానికి, రోగులకు, సిబ్బంది మరియు శిక్షకులకు వివిధ స్థాయిలలో రేడియేషన్ మోతాదులను నిర్ణయించింది. ఆ మోతాదులు మించకుండా జాగ్రత వహించాలి. శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెంది, కంప్యూటర్ వినియోగం పెరగడం తో ఎన్నో కొత్త ప్రక్రియలు, రోగ నిర్ధారణ, చికిత్స పద్ధతులు అందుబాటులో కి వచ్చాయి. అదేవిధంగా రక్షణ చర్యలు, అతి తక్కువ రేడియేషన్ మోతాదులో వివిధ పరీక్షలు నిర్వహించే విధంగా సాంకేతికత అభివృద్ధి చెందింది. రేడియాలజీ ప్రాముఖ్యత రోజు రోజుకు పెరుగుతోంది. ఈ రంగం లో స్థిర పడాలనుకునే వారికి వివిధ కోర్సులు డిగ్రీ, డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

ఉపాధి అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి.

(నవంబర్ 8, అంతర్జాతీయ రేడియాలజీ దినోత్సవం సందర్భంగా)

శ్రీనివాసులు శిరందాస్

రేడియేషన్ సంరక్షణ అధికారి.

నిజాం వైద్య విజ్ఞాన సంస్థ

ప్రధాన కార్యదర్శి

సొసైటీ ఆఫ్ ఇండియన్ రేడియోగ్రాఫర్స్

నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్.

94416 73339

Advertisement

Next Story

Most Viewed