సమీక్ష: ఆర్తి సముద్ర కెరటం

by Ravi |   ( Updated:2023-01-02 02:29:44.0  )
సమీక్ష: ఆర్తి సముద్ర కెరటం
X

'కెరటం నాకు ఆదర్శం, పడినందుకు కాదు, పడి లేచినందుకు' అన్నారు అలిశెట్టి ప్రభాకర్. దీనికి నిత్య నూతనత్వం అందించడమే కాదు, ప్రపంచంలోని అన్ని కాలుష్యాల కన్నా భావ కాలుష్యం ప్రమాదాన్ని గురించి హెచ్చరించి, దానిని ప్రక్షాళన చేయాలనే లక్ష్యంతో రాసిందే 'కెరటం నా కిరీటం' కవితా సంపుటి. డా: సి. భవానీదేవి చేయి తిరిగిన కవయిత్రి. అనుభవం, అక్షర ప్రతిభ, నిండుగా, మెండుగా కలగలిసిన ఈమె కవిత్వం కూడా అంతే హుందాగా, ఉన్నతంగా ఉండి వర్తమాన కవులకు మార్గదర్శనం చేస్తుంది. భవానీ దేవి కవిత్వం దేనికదే ఓ ప్రత్యేకతను కలబోసుకుంటుంది. సముద్ర తీర ప్రదేశంలో పుట్టినందున కాబోలు, భవానీ భావాలు కూడా అక్షర కవితా సముద్రమై సాక్షాత్కరిస్తాయి.

'ఎంతో పాతగా కనిపించే ప్రతి మనిషిలో, చూసే తీరు, స్నేహించే వైనం బట్టి నిత్య నూతనత్వం ఆగుపిస్తుంది'అంటారు కవయిత్రి. 'కొత్త లిపి'కవితలో.

నాకోసం కాలాన్ని తిరగరాసింది/ నా చేతుల్లోని నవతగా నమ్మబలికింది/ మర్నాడు సూర్యోదయానికి/ పుస్తకంలో మరో ఖాళీ పేజీ/ కొత్త దస్తూరి కోసం ఎదురు చూస్తూ.

'తల్లులందరికన్నా వీరుని కన్న తల్లి కడుపు తీపి మిన్న'అన్న సత్యాన్ని చాటే చక్కని కవిత 'ఆక్రందన' కాలాలతోపాటు మారుతున్న పోరాట తీరు కాలాలను బట్టి చేసే పూర్నుబట్టి ఒక్కోసారి దేశభక్తులు మరోసారి సంఘవిద్రోశక్తులు. కానీ, వీరు అందరినీ కన్నతల్లి ప్రేమ మాత్రం ఒకటే ఇది కవయిత్రి వదిలిన సందేశ బాణం.

'ఆ రక్తం నీది రా /అది ఊరుకో నీదురా/ నువ్వెక్కడున్నా నా తండ్రి/ చల్లంగుండాలి/ నలుగురికి న్యాయం చేయాలి/ తల్లి కడుపున చిచ్చు పెట్టకురా/

అంటూ ఆక్రందిస్తుంది.'ఆధునిక మానవుని ఆత్మ చిత్రాన్ని అందంగా చిత్రించి ఓ చక్కని సూచనను గురి చూసి వదిలిన కవితాశరం 'మారిన దిశ'కవయిత్రి తనదైన కవన ప్రతిభ నవరత్న తిలకాన్ని నిండుగా నింపి వ్రాసిన ఉత్తమోత్తమ కవిత ఇది, అని తీరాలి. "అసలు జీవితం అంటే/ ఆనంద ప్రవాహమని ఎవరన్నారు?/ అది ఏ ఏ.టీ.ఎం లోంచి బయటకు వస్తుంది?.

ఈ కవయిత్రి కవితలు స్వార్థంపై ఆగ్రహమే కాదు. మానవత్వంపై సముద్రమంత ప్రేమ నిండి ఉన్నాయి. మైకేల్ జాక్సన్ మరణానికి నివాళిగా స్మృతి కవనం అల్లిన ఈ కవయిత్రి చక్కని కవిత్వం అందించారు. ఈ కవితా సంపుటి అందరికీ ఒక దారి దీపిక.

ప్రతులకు:

డా:సి. భవానీదేవి

98668 47000

పేజీలు: 122 , వెల: 60 రూ,


సమీక్షకులు:

డా. అమ్మిన శ్రీనివాసరాజు

77298 83223


Also Read...

కథా-సంవేదన: కొత్త


Advertisement

Next Story

Most Viewed