- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సమీక్ష:ఆర్తి కెరటాలు ఈ అక్షర శిల్పాలు
అక్షరానికి చురుకెక్కువ, ఆ పదాలకు పదునూ ఎక్కువే!! వెరసి తన కవిత్వానికి కాంతి కూడా ఎక్కువే!! చెప్పేది సామాజిక అంశం అయినా అంతర్లీనంగా ధర్మాగ్రహం కూడా అధికమే. డా. కాసర్ల రంగారావు రసాయనశాస్త్ర పరిశోధకుడైనా అమ్మ భాష మాధుర్యం తెలుసుకున్న విజ్ఞుడు. ప్రవృత్తిగా మాతృభాషా సాహితీ సేద్యం చేస్తున్నారు. వచనంతో పాటు పద్యం రాయగల ప్రతిభాశీలి. ఆ అక్షర కృషిలో భాగంగా వెలువడిందే ఈ 'అక్షర శిల్పాలు' కవితా సంపుటి. ఇందులో ఉన్న 46 కవితలోనూ కవి ఆర్తి, తపన, నిండుగా ఉంటాయి. వస్తువులు సామాజిక అంశాలే అయినా కవికుండాల్సిన ధర్మాగ్రహం ఆశావాదం, కనిపిస్తాయి. సాధారణ సమాజపు పోకడలే కాక, తన వృత్తికి చెందిన విజ్ఞానశాస్త్ర కృతజ్ఞతా భావం కనిపిస్తుంది.
'అపజయాల అవశేషాల నుంచే / విజయకేతనం ఎత్తబడుతుందని / మొక్కవోని సంకల్పబలం ఏర్పడగలవని నిరూపించిన / అద్వితీయ అసమాన నాయకుడు' అంటూ అబ్దుల్ కలాంను క్షిపణి గాంధీ అంటూ అభివర్ణిస్తూ యువతకు స్ఫూర్తిని నింపారు. మానవ సమాజానికి అత్యంత ముఖ్యమైన 'మానవతా విలువల' గురించి, ప్రస్తుత సమాజ ధోరణుల వైనంతో విసుగు చెందుతూ 'పాత శిలాయుగమే మేలు' అంటారు, ముఖ్యంగా యువతరాన్ని జాగృతం చేయడమే తన ఏకైక లక్ష్యంగా ఎంచుకుని ఆ దిశగా తన కలం శక్తి ప్రవాహం పారించారు 'కర్తవ్యం' కవిత గుండా. 'నా లేఖిని నయాగరా జలపాతం / నా భావన నవయుగ సుప్రభాతం / గతించి పోయిందొక గరళ దశకం / రానున్నది ఆధునిక అమృత శకం' అంటూ ఆశాభావం నింపారు. 'ప్రభుత్వం పైనే పూర్తి ఆధారం పొరపాటు / ప్రభుత్వ ఉద్యోగమే ఆఖరిమెట్టు అనుకోవడం గ్రహపాటు / విద్యాభ్యాసం ఉన్నత విలువల సాధనకు లక్ష్యం / విద్వత్తును విద్యుత్తుగా వాడేది వివేకం' అంటారు. మనిషి నాగరికత పేరుతో చేస్తున్న విధ్వంసాల ద్వారా భావి జీవితంలో మనం పడాల్సిన కష్టాల గురించి చెబుతూ విలువైన హెచ్చరిక చేశారు. ఒకవైపు తెలుగు భాషా సొగసులు, మరోవైపు మంటగలుస్తున్న మానవతా విలువలు, ఇంకోపక్క నిర్వీర్యం అవుతున్న దేశ యువశక్తి తీరు, వీటన్నింటినీ కలబోసుకుని కదిలే రాజకీయాల వైనం మొదలైన అంశాలు భాషా శైలి, పదాల విరుపుల చమక్కులతో చదివింపజేస్తాయి.
అమ్మను అనురాగాల ఊటగా, నాన్నను ప్రేమ సెలయేరుతో అన్వయం చేసిన కవి భావ సృజన ప్రశంసనీయం. ఆచరణాత్మకం. తెలుగు నేల వైభవాన్ని 'తెలుగువాడు' అనే సుదీర్ఘ కవితలో నిండార బోశారు, తెలుగుజాతి వైభవాన్ని గగనాన నిలిపే ప్రయత్నం చేశారు. జాతీయ సమైక్యత కోరుతూ మత ద్వేషాలు సరిహద్దు దేశాల ఎత్తుగడలు స్వార్థ రాజకీయాల కారుకులైన నాయకులపై తనదైన న్యాయ పోరాటంతో అక్షర శరసంధానం చేస్తారు. ఈ విద్యుత్తు ఎరిగిన వైజ్ఞానమూర్తి. చక్కని పద గుబాళింపులతో సున్నిత చెణుకుల చురకల సాయంతో సాగే ఈ కవితా సంపుటి చదువుతున్నంత సేపు అనిర్వచనీయ అనుభూతి పొందుతాం. ఆలోచనల భ్రమరాలు మన మనో సుమాల వెంట ప్రదక్షిణలు చేస్తాయి.
ప్రతులకు:
డా. కాసర్ల రంగారావు
98668 37741
పుటలు 58: వెల రూ. 75
సమీక్షకులు:
డా. అమ్మిన శ్రీనివాసరాజు
77298 83223
- Tags
- Book Review