కరీంనగర్ సాహిత్య పరంపర...

by Ravi |   ( Updated:2024-08-04 19:16:03.0  )
కరీంనగర్ సాహిత్య పరంపర...
X

తెలుగు సాహిత్యంలో వచన కవిత్వానిది ప్రధాన భూమిక. ఒక జిల్లా ప్రాతినిధ్య కవిత్వాన్ని ఎంచి ఒక దగ్గర కూర్చడం ఇష్టపడి చేసినా కష్టమైన పనే. ఇటీవల పూర్వ కరీంనగర్ జిల్లాకు చెందిన ఎంపిక చేసిన ప్రాచీన, ఆధునిక కవుల కవిత్వ సంకలనాన్ని 'కరీంనగర్ కవులు నాడు నేడు' పేర ఆచార్య అనుమాండ్ల భూమయ్య సంపాదకత్వంలో వెలువరించారు. ఇది చాలా విశిష్టమైన కవిత్వ సంకలనం. ఇందులో పదవ శతాబ్దానికి చెందిన జినవల్లభుని నుంచి నిన్న మొన్న విద్యార్థిగా కవిత్వం రాస్తున్న ఈడెపు సౌమ్య దాకా 102 కవితలు ఉన్నాయి.

కరీంనగర్‌కు మచ్చుతునుకగా...

విశ్వవిద్యాలయాల్లో పనిచేసిన ఆచార్య భూమయ్య ప్రధానంగా పద్య కవి. అయినా ఆయనకు ప్రజలకు సులువుగా అర్థమయ్యే వచన కవిత్వం పట్ల కూడా ఇష్టమైంది. ఇందులో తొలి కందపద్యం చెక్కిన కురిక్యాల శాసనంలోని మూడు పద్యాలు ఉన్నాయి. తెలుగు భాషకు ప్రాచీన హోదా రావడానికి ఈ పద్యాలు కూడా ఒక కారణమైనాయి. జన వల్లభునితో పాటు ప్రాచీన కవులు వేములవాడ భీమకవి, మల్లియ రేచన, చెరిగొండ ధర్మాన, ఎలిగందాల నారయ, మడిక సింగనల పద్యాలు ఈ తరం కవులకు ఒకే దగ్గర అందుబాటులో ఉన్నాయి. అట్లాగే 18వ శతాబ్దానికి చెందిన ధర్మపురి శేషప్ప ప్రసిద్ధిగాంచిన పద్యం' తల్లి గర్భం నుంచి ధనము తేడెవ్వడు, వెళ్లిపోయేడు నాడు వెంట రాదు' కూడా ఉన్నది. ఈ పద్యాన్ని పల్లెల్లో పాత తరం వాళ్లు ఇంకా పాడుకుంటారు.

వీటితో పాటు 1934లో సురవరం ప్రతాపరెడ్డి వెలువరించిన గోలకొండ కవుల సంచికలో కరీంనగర్‌కి చెందిన వరకవి సిద్ధప్ప, వానమామలై జగన్నాథచార్యులు, శిరిషనహల్ కృష్ణమాచార్యులు, అందే వెంకటరాజం, గర్రెపల్లి సత్యనారాయణ రాజు, గీట్ల జనార్దన్ రెడ్డి, వెలిచాల కేశవరావు, శ్రీ భాష్యం విజయ సారథి, గజానంద్ తామన్ లాంటి ఎంతో మంది ఆఖ్యాత కవులు ఉన్నారు. ఆనాటి గోల్కొండ సంచికలో జిల్లాకు చెందిన 37 మంది కవుల కవిత్వం ఉంది. ఆధునిక కాలానికి వస్తే తెలుగుజాతి నిలువెత్తు సంతకం సినారె మొదలుకొని అలిశెట్టి ప్రభాకర్, తిరుమల శ్రీనివాసాచార్య, వడ్డేపల్లి కృష్ణ, సంగనభట్ల నరసయ్య, మలయ శ్రీ , రాజేందర్ జింబో నలిమెల భాస్కర్, జూకంటి జగన్నాథం, అన్నవరం దేవేందర్, గాజు నాగభూషణం, కాంచనపల్లి గోవర్ధన రాజు దాస్యం సేనాధిపతి, బూర్ల వెంకటేశ్వర్లు, డింగరి నరహరి, తుమ్మూరి రామ్మోహన్, గంట లక్ష్మణరావు తదితరులు ఉన్నారు. ఇది మొత్తం కరీంనగర్‌కు ప్రాతినిధ్యం వహించకపోవచ్చు కానీ ఒక మచ్చుతునుకగా పరిగణించవచ్చు. అయితే ఇందులో రానివారు ఎందరో ఉన్నారు. ఏది పరిపూర్ణం కాదు.

ఎంత ఎత్తు ఎదిగినా..

ఇలాంటి సంకలనాలు ఇదివరకూ వచ్చాయి 2010లో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో 'వల్లు బండ' కరీంనగర్ జిల్లా తెలంగాణ ఉద్యమ కవిత్వం ట్యాగ్ లైన్‌తో నా సంపాదకత్వంలో విడుదలైంది. ఇందులో 120 మంది కవుల తెలంగాణ అస్తిత్వ ఉద్యమ కవిత్వం ఉంది. దీనిని సాహితీ సోపతి ప్రచురించింది. అప్పటినుంచి ఆ సాహిత్య సంస్థ కరీంనగర్‌లో కొనసాగుతుంది. తర్వాత రెండు సంవత్సరాలలో కరీంనగర్ కవిత 2011, కరీంనగర్ కవిత 2012 ఆయా సంవత్సరాల్లో జిల్లా కవుల అచ్చయిన ఉత్తమ కవితలను సంకలనాలు వచ్చాయి. 2013లో హుజూరాబాద్ కేంద్రంగా జన సాహితీ సంస్థ ఆధ్వర్యంలో ఆవునూరి సమ్మయ్య సంపాదకత్వంలో ' జమ్మి ఆకు' కరీంనగర్ జిల్లా కవిత్వం వెలువడింది. కరీంనగర్‌లో తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా సాగుతున్న 'ఎన్నిల ముచ్చట్ల' కార్యక్రమం అనంతరం ఇది మాసం ఒక బులిటెన్‌లాగా కవిత సంకలనాలు వెలువడ్డాయి. కవిత్వాన్ని తాము ఎదిగి వచ్చిన నేలను ఎంతగానో ప్రేమిస్తే కానీ ఇట్లాంటి పనులు సాధ్యం కావు.

ఇప్పుడు విశ్రాంతి జీవనంలో ఉన్న ఆచార్య అనుమాండ్ల భూమయ్య ఇది తీసుకురావడం గురించి రాస్తూ 'మీరు ఎక్కడి వారు? అని నన్ను ఇతర ప్రాంతం వారు, ఎవరైనా అడిగినప్పుడు, 'మాది కరీంనగర్' అనే చెప్తాను. తాను ఎంత దూరం పోయినా పూల తీగ తన వేరును మరవదు. నా జన్మభూమి వెదురుగట్టను మరవను, జిల్లాను మరువను.' అని సంపాదకీయంలో రాశారు. ఇలా ఎంత ఎత్తు ఎదిగిన పుట్టిన తిరిగిన విద్యాబుద్ధులు నేర్చిన ఊరును నేలను మరవని భూమయ్య లాగే అన్ని రంగాల వారు ఇలా ఏదైనా ఒకటి చేసేందుకు స్ఫూర్తిగా నిలిచింది ఈ 'కరీంనగర్ కవులు నాడు నేడు' పుస్తకం. గ్లోబలైజేషన్ పచ్చని పల్లెలను ఇచ్చ గొట్టి, నగర సంస్కృతిని పరుస్తున్న కాలం దాటి వచ్చినం. తర్వాత కరోనా అందుకొని మనుషులను కకావికలం చేసిన క్రమానుగత కూడా కావచ్చు. ఇప్పుడు అందరూ నగరాలలో ఉంటూ ఊరిని మరుస్తలేరు.

- అన్నవరం దేవేందర్

94407 63479

Advertisement

Next Story

Most Viewed

    null