వెలుగులోకి వస్తున్న పాత చరిత్ర

by Ravi |
వెలుగులోకి వస్తున్న పాత చరిత్ర
X

మేర మల్లేశం (1924-1997) తెలంగాణ సాయుధ పోరాట యోధుడు. ఎన్నో పాటలు కట్టి పాడిన కవి వాగ్గేయకారుడు. జీవితాంతం కష్టజీవుల పక్షాన నిలబడ్డ కమ్యూనిస్టు. ఆయన సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని అంతకపేట గ్రామానికి చెందినవారు. తొలుత ఆయన కార్య క్షేత్రం నేటి జనగాం జిల్లాలోని నర్మెట తరిగొప్పుల చుట్టుపక్కల గ్రామాలు. ఆతర్వాత ఇప్పటి కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ ప్రాంతం. స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా జాల్నలో నాలుగు సంవత్సరాల జైలు జీవితం అనుభవించారు. నైజాం పోలీసుల చిత్రహింసలకు గురయ్యారు. హైదరాబాద్ రాజ్యం ఇండియన్ యూనియన్ లో విలీనమైన తర్వాత విప్లవ కమ్యూనిస్టుగా జీవించారు. 1969 తొలి దశ తెలంగాణ ఉద్యమాన్ని బలపరుస్తూ పాటలు రాసిన అస్తిత్వ చైతన్యం అయినది. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న ఎందరో ఆ మహత్తర చరిత్రను లిఖించారు. కామ్రేడ్ మల్లేశం తన స్వీయ చరిత్ర రాసుకున్నారు. మొదట 1997 'మేర మల్లేశం పోరాట పాటలు' పేర పాటల పుస్తకం వచ్చింది. తిరిగి 27 సంవత్సరాల తర్వాత ఆ పాటలకు విపుల వ్యాఖ్యానాలతో పాటు తాను రాసుకున్న విశిష్టమైన పోరాట స్వీయ చరిత్ర కలిపి ఇప్పుడు పుస్తకంగా వెలువడింది. ఇందులోనే డాక్టర్ ముత్యం 'మేర మల్లేశం జీవితం ' ఒక చాప్టర్‌గా వచ్చింది. ఆయన అమరుడైన రెండున్నర దశాబ్దాల అనంతరం ఈ పుస్తకం వెలువరించడానికి సూర్యాపేటకు చెందిన కొత్తకొండ కరుణాకర్ పూనుకున్నారు. ఆయన జీవిత పోరాట విశేషాలతో పాటు తన పాటలతో వెలువడిన ఈ పుస్తకం. తెలంగాణ తెలుగు రాజకీయ సమాజం అధ్యయనం చేయాల్సింది ఉంది. తెలంగాణ సాయుధ పోరాటం తర్వాత దాని చరిత్రను లోతుగా రికార్డు చేసినట్టు లేదు. ఉద్యమంలో స్వయంగా పాల్గొన్న మల్లేశం లాంటి కవుల పాటలు కారణాలేవైనా ఎక్కువగా ప్రచురణకు నోచుకోలేదు. నైజాం రజాకార రాజ్యానికి వారి తాబేదారులైన పల్లెలో దొరల భూస్వాముల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర ఈనాటి విద్యార్థులకు టెక్స్ట్ పుస్తకాల్లో కూడా లేదు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత అయినా ఇలాంటి కార్యాచరణ జరగలేదు. ఇలాంటి సందర్భంలో 'మేరు సంఘం ' ప్రచురించిన ఈ పుస్తకం చదువవలసి ఉంది.

ఈ పుస్తకం కొరకు కొత్తకొండ వెంకటనారాయణ ను 9247795465లో సంప్రదించవచ్చు.

అన్నవరం దేవేందర్

94407 63479

Advertisement

Next Story

Most Viewed