అతిపెద్ద సాహిత్య ఉత్సవం

by Ravi |   ( Updated:2024-03-24 19:30:20.0  )
అతిపెద్ద సాహిత్య ఉత్సవం
X

ప్రపంచంలో అతిపెద్ద సాహిత్య ఉత్సవం మార్చి 11 నుంచి 16 మధ్య ఢిల్లీలో జరిగింది. ఈ ఉత్సవంలో పాల్గొంటే భారతదేశంలోని అన్ని భాషల (లిపిలేని భాషలు కూడా) అన్నీ సంస్కృతుల సకల సాహిత్యాన్ని అర్థమైనా కాకున్న వినవచ్చు. దేశమంతా మూల మూలన తిరిగివచ్చినట్టు అక్కడి పదాలు, కవిత్వం చెప్పే తీరులు, కథనం వివరించే హావభావాలు, ఆహార్యం, కట్టూబొట్టూ గమనించవచ్చు. సాహిత్య అకాడమీ 70 సంవత్సరాల వార్షికోత్సవం సందర్భంలో ఈ బహుళ ఉత్సవం నిర్వహించింది. దీనిని ‘ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ 2024’ అంటారు. ఇందులో 175 పై చిలుకు భాషలు మాట్లాడే వాళ్లు, 1100 మందికి పైగా రచయితలు, కవులు, స్కాలర్లు, పరిశోధకులు పాల్గొన్నారు. ఆరు రోజుల్లో 190 సెషన్స్ వేరువేరుగా నిర్వహించారు.

అక్షరాలా కవిత్వ ఉత్సవమే

ఢిల్లీలోని మండేహేజ్ వద్దగల రవీంద్ర భవన్‌లో సాహిత్య అకాడమీ ఉంది. దాని ఆవరణ అంతా జాతీయ స్థాయిలో కవిత్వ ఉత్సవమే. మన తెలుగు వాడైన కె. శ్రీనివాసరావు సాహిత్య అకడమీ కార్యదర్శిగా సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించారు. దేశంలోని అన్నీ రాష్ట్రాలే కాకుండా కొంకణి, సింధు, మిబో, కాశీ, బలోరి, గోండి, లంబాడా, ధృవ, అస్సామీ, డోగ్రీ, మణిపురి, సంతాలి, నేపాలి నాగపురి లాంటి ఎన్నో భాషలు మాట్లాడేవాళ్లు పాల్గొన్నారు. తమ మాతృభాష నుంచి ఒకటి రెండు కవితల పఠనం తర్వాత వాటికి ఆంగ్లం లేదా హిందీలో కూడా అందరికీ అర్థమయ్యేందుకు అనువాదం విన్పించాలి.

ఆరు రోజుల్లో 190 సెషన్స్

ఈ సదస్సులో భక్తి సాహిత్యం, థియేటర్ సాహిత్యం, నవల, కథ, బాలసాహిత్యం, స్త్రీ సాధికారత, సాంకేతిక సాహిత్యం, యువ సాహిత్యం, అస్మిత స్త్రీ దృక్పథం, కవిత్వ అల్లిక నిర్మాణంతో పాటు బహుభాషా కవి సమ్మేళనాలు ఉన్నాయి. ప్రతి సెషన్‌లో ఒక్కో భాషకు ఒక్కరే ప్రతినిథ్యం వహిస్తారు. సదస్సులు చర్చలు ముఖాముఖులు కూడా ఉంటాయి. సాహిత్య అకాడమీ, సంగీత నాటక అకాడమీ ఆవరణ అంతా 8 విభాగాలుగా సమావేశ మందిరాలను ఏర్పాటు చేశారు. వాల్మీకి సభాఘర్, వేద వ్యాస సభాఘర్, మీరాభాయి సభాఘర్, కబీర్ సభాఘర్, శంకరదేవ సభాఘర్, లాల్ దడ్ సభాఘర్, తులసీదాస్ సభాఘర్, నర్సిమొహిత సభాఘర్ పేర ఉన్నాయి. వీటిల్లో 190 సెషన్స్‌ను సమయపాలనతో కచ్చితంగా నిర్వహించారు. అన్ని సెషన్స్‌కి చెందిన లైవ్ స్ట్రీమింగ్ కూడా యూట్యూబ్‌లో వచ్చింది.

పతంజలి శాస్త్రికి పురస్కారం

ఒకరోజు సాయంత్రం కమాని ఆడిటోరియంలో ప్రతిఏటా పురస్కారాల ప్రదానం జరిగింది. 24 భాషలకు ఒక్కొక్కరం చొప్పున ఇదివరకే ఎంపిక చేసిన వారికి అందజేశారు. ఇందులో మన తల్లావజ్జల పతంజలి శాస్త్రికి 'రామేశ్వరం కాకులు' పుస్తకానికి అందుకున్నారు. మరొక రోజు పురస్కార గ్రహీతలతో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందులో తాము సాహిత్యం లోకి ఎట్లా వచ్చింది ఎట్లా రాస్తున్నాము అనే విషయాలను వివరించారు. మొత్తం ఎనిమిది సభామందిరాలు ఉంటాయి. ఎక్కడికి పోవాలి, ఎందులో వినాలని ముందే అనుకోవాల్సి ఉంటుంది.

గుల్జార్ ప్రసంగం ఓ అద్భుతం

ఇందుకు అకాడమీ ఆహ్వాన పత్రమే 60 పేజీలు ఉంటది. ఇందులోనూ ఇంగ్లీష్ హిందీ భాషల్లో ముద్రించారు. ఈ మహా ఉద్యమంలో పాల్గోనే వారి అందరి వివరాలు ఫోటోలతోనూ ఒక డైరెక్టరీని రూపొందించి విడుదల చేశారు. ప్రఖ్యాత కవి రచయిత జ్ఞానపీఠ పురస్కార గ్రహీత సినీ దర్శకుడు గుల్జార్ వార్షిక ఉపన్యాసం మేఘదూత్ ఓపెన్ థియేటర్‌లో అద్భుతంగా సాగింది. గుల్జార్‌ను వినాలని అందరు అనుకోవడం వల్ల ఆ బహిరంగ వేదిక పట్టు సాలకపోయింది. ఇంత మంచి అతిథులకు హోటల్ గదుల ఏర్పాట్లు, అక్కడికి ఇక్కడికి రవాణా ఏర్పాట్లు లోపాలు లేకుండానే ఉన్నాయి.

సాహిత్యోత్సవం-2024 నిజంగానే ప్రపంచ స్థాయిలో గొప్పదే. అన్ని భాషల పుస్తకాల ప్రదర్శన అమ్మకం ఏర్పాట్లు జరిగాయి. సాహిత్య అకాడమీ తెలుగు విభాగం జనరల్ కౌన్సిల్ సభ్యులు బెల్లంకొండ ప్రసేన్, తెలుగు కన్వీనర్ ఆచార్య మృణాళినిలు ఈ ఆరు రోజులూ అక్కడే తలమునకలై ఉన్నారు.

అన్నవరం దేవేందర్

94407 63479

Advertisement

Next Story

Most Viewed