- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంతరంగం:తిండిని పారేసే రోగం ఎందుకో?!
పిడికెడు అన్నం మెతుకులు తయారు కావాలంటే రైతు ఎంత శ్రమ చెయ్యాలి? మట్టి నుండి వరి పండించడానికి ఎన్ని వేల లీటర్ల నీరు కావాలి? తిరిగి ఆ బియ్యం అన్నంగా మారడానికి, అందులోకి కూరలు తయారు కావాలంటే ఎంత పని? ఎంత ఓపిక కావాలి? ఇవేవి అర్థం చేసుకోరు కొందరు మనుషులు. ఏదైనా ఫంక్షన్‌లకు పోతే ఎన్నడూ తిననోళ్లు అన్నం తింటున్నట్లు ఎగబడతరు. అవసరమైన దానికంటే ఎక్కువ పెట్టించుకుంటరు. పూర్తిగా తినరు. అటూ ఇటూ కలుపుతరు. మిగితాదంతా పారేస్తరు. ఇంకా మాంసాహార సెక్షన్ అయితే మహా గందరగోళం.
చికన్, మటన్‌కు ప్లేట్ సాపి, పెట్టినంక కూడా మల్ల వడ్డించుకుంటరు. పోనీ, అదంతా శుభ్రంగా నమిలి తృప్తిగా తింటారా? అంటే అదీ లేదు. చికెన్ ముక్కలన్నీ పూర్తిగా తినకముందే చెత్తలో వేస్తరు. మటన్ అయితే బొక్కలు వస్తే తీసి అటు విరిరేసి మళ్లోసారి కూర దగ్గరికి పోయి వడ్డించమంటరు. మాంసాహారమైనా, కాయగూరలైనా అడ్డగోలుగా ప్లేట్ నిండా తీసికొని ఎక్కడికో పోయినట్టు, ఎన్నడూ దొరకనట్టు ఎగబడి ఎగబడి తింటరు. సగం కడుపులకు, సగం బయట వేస్తరు. ఆఖరుకు పెరుగు కూడా అంతే. నాలుగు గంటెలు వేసుకుంటరు పూర్తిగా తినరు. శుభకార్యాల భోజనశాలలో కొందరు తినేవాళ్లను పరిశీలిస్తే కొన్ని ఇలాంటి దృశ్యాలు కనిపిస్తాయి.
అన్నం దొరకని వారెందరో?
ఆహారం ఎంతో శ్రమతో కూడుకున్నది. ఇదే ఆహారం లేక దేశంలో ఎందరో ఆకలితో అలమటిస్తున్నరు. అప్పులై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నరు. సరియైన పద్ధతిలో ఆహారాన్ని అవసరమైనంత తినాలనే సోయి తక్కువ కనపడుతుంది. ముప్పది ఏండ్లకు పూర్వం అయితే అందరినీ బంతిలో కూర్చోబెట్టి, అన్నం, పప్పు, చారు, కూర తెచ్చి అవసరమైనంత వడ్డించేది. మటన్ అయితే, మొదటి దఫా రెండు మూడు ముక్కలే వేసేది. మళ్ల వెయ్యమంటే దాల్చా మాత్రమే తెచ్చి పోసేది. ఆహారాన్ని మితంగానే అవసరమైనంతే పెట్టేది. ఇప్పుడంతా బఫ్ సిస్టమ్. నిలబడే తినుడు. అట్లనే సంపన్నులు ఎక్కువయ్యిండ్రు. విపరీతంగా ఖర్చులు చేయడానికి అలవాటు పడ్డరు. పైసలున్నవాళ్లు ఫంక్షన్లు గొప్పగా చేయవచ్చుగానీ, వేస్ట్ చేయడమే చూసేవాళ్లకు ఇబ్బందిగా మారింది.
ఫంక్షన్‌లు కూడా విపరీతంగా జరుగుతున్నయి. పెండ్లిళ్లు, రిసెప్షన్లు, గృహప్రవేశాలు. ఆశుభకార్యాలు అంటే దశదినకర్మలు కూడా జరుగుతుంటయి. ఇవే కాకుండా ఈ పది పదిహేనేండ్ల నుంచి చీర కట్టించే ఫంక్షన్లు, ధోవతులు కట్టించే ఫంక్షన్లు చాలా గ్రాండ్‌గా చేస్తున్నరు. ఆడపిల్లలు పెద్దగవడం ఇగ ఇంటి మందం జరిగే చిన్న ఉత్సవం కానీ, అదిప్పుడు భారీ సెట్టింగ్‌లలో నడుస్తున్నది. ఆడపిల్లలకు చీరలు కట్టిస్తే మగబాబులకు ఎట్లా అని ధోతి ఫంక్షన్ అని చేస్తున్నరు. ఆనందం కోసం మిత్రులను, బంధువులను, స్నేహితులను పిలిచి భోజనం పెట్టడం సంప్రదాయమే. కానీ, ఇది పైసలు ఉన్నోళ్ల నుంచి లేనోళ్ల దాకా అందరికీ వ్యాపించింది. కొత్త కొత్త ఫంక్షన్‌లు రావడం, చేసుకోవడం వల్ల బంధువుల మిత్రుల కలయిక జరుగుతది. వంటవాళ్ల నుంచి సంబంధిత పనివాళ్లకు పని కూడా దొరుకుతుంది. కానీ, ఇందులోనూ ఆహార వృథా కొనసాగుతున్నది.
అంతా ఆబఆబగా
వీటిలో కూడా టిఫిన్స్ చేసేప్పుడు చట్నీలు సాంబర్లు అవసరమైన దానికంటే ఎక్కువగా వాళ్లు పోస్తరు. వీళ్లు తెచ్చుకుంటరు. తినే దోసకు, ఇడ్లీకి అది ఎక్కువ అయి మిగతాదంతా చెత్తపాలు అవుతుంది. గృహాలలో అయితే వృథా సంస్కృతి రాలేదు. ఎందుకంటే మిగిలిన వస్తువులు ఫ్రిజ్‌లో ఉంచితే మరో రోజు ఉపయోగించుకుంటరు. పూర్వకాలంలో ఊర్లలో తెల్లవారిలేస్తే అన్నం కూర తీసుకపోయేందుకు బిచ్చగాళ్లు వచ్చేటోళ్లు. ఇప్పుడు ఎవరూ రావడం లేదు. ఎవరైనా వస్తే పైసలు మాత్రమే తీసుకపోతున్నరు.
అన్నం కూరలు ఎవరూ తీసుకోవడం లేదు. బియ్యం ప్రభుత్వం నుంచి రావడం, ఎవరికి వారు ఏదో వృత్తులలో కూలీ పనులలో ఇమిడిపోయి సంపాదించే శక్తి రావడంతో ఆ వృత్తి ఆగిపోయింది. 'తొందరగా నేనే తినాలి. అయిపోతది కావచ్చు. నా వంతు ఏదీ' అనే యావతోనే మనిషికి 'పుల్లె గండు' తనం వస్తుంది దాంతో ఆదరా బాదరా, తినేది తక్కువ పారేసేది ఎక్కువ.
అన్నవరం దేవేందర్