‘అంతరంగ’ మథనం..

by Ravi |   ( Updated:2024-10-28 00:30:30.0  )
‘అంతరంగ’ మథనం..
X

సముద్ర గంభీర విషయమైనా, సాధారణ అంశమైనా ఎంతో అలవోకగా, నల్లేరు మీద బండి నడిచిన చందాన అచ్చ తెలంగాణ యాసలో రాయడం అన్నవరం దేవేందరన్న శైలి. ఒక ఆర్టికల్‌కి మరొక ఆర్టికల్‌కి పొంతన లేకుండా వైవిధ్యపూరితమైన అంశాలను ఎంచుకోవడమే కాకుండా వాటిని పండును ఒలిచి పెట్టినట్లుగా పాఠకులకు చెప్పడం అన్నకు కొట్టిన పిండి. తెలంగాణ మట్టి వాసన మరువని, మూలాలను వదులుకోని, పదవులకు అమ్ముడుపోని హృదయాంతరంగాన్ని స్వచ్ఛంగా తనలో నిలుపుకున్నారు కాబట్టే స్వేచ్ఛగా, నిర్భీతిగా, సహజాతి సహజంగా తన అంతరంగ మథనాన్ని, రచనా వ్యాసంగాన్ని కొనసాగించ గలుగుతున్నారు. మూడేళ్ల పాటు అన్న తన కాలమ్‌ని దిశ దినపత్రిక సాహిత్య పేజీలో కొనసాగించారు. ఇంకా కొనసాగిస్తున్నారు. దాదాపు 150 వ్యాసాలున్న ప్రస్తుత సంకలనంలో ఆయన 360 డిగ్రీల పరిధిలో ప్రపంచీకరణ నుంచి మానవ సంబంధాల వరకు, టెక్నాలజీ తెచ్చిన మార్పుల నుంచి సంస్కృతి, సంప్రదాయాల వరకు, ఉద్యమాల చరిత్ర నుంచి కవుల పరిచయం వరకు ఎన్నెన్నో విషయాలను తడిమారు.

కొవిడ్ బీభత్సం దృశ్యీకరణ..

కాకతాళీయమే కావచ్చు. దేవేందరన్న దిశలో కాలమ్ మొదలుపెట్టే సమయానికి సెకండ్ వెర్షన్ కొవిడ్ మహమ్మారి భారతదేశవ్యాప్తంగా వికటాట్టహాసం చేస్తోంది. కళ్లముందే చనిపోయిన మనిషి మృతదేహం కనిపిస్తున్నా, కనీసం దగ్గరకు వెళ్లకుండా ఆత్మబంధువులు నిస్సహాయంగా వెళ్లిపోతున్న ఘటనలను మనకు తెలిసిన ఇటీవలి చరిత్రలో ఎన్నడూ చూసి ఉండం. శ్మశానంలో శవాలకు క్యూలైన్లు.. ఆసుపత్రులలో బెడ్లకు లైన్లు.. ఇంజెక్షన్లు, మందుల కొరత.. ఖాళీలేని అంబులెన్స్‌‌లు.. వందలు వేలుగా చావుల స్కోరు.. ఏడ్వడానికి కూడా తావులేని బీభత్సకర వాతావరణం.. ఈ దయనీయ పరిస్థితులను అన్న తన వ్యాసాల్లో కళ్లకు కట్టినట్లు వర్ణించారు. ‘సచ్చిన పిల్లిని గోడవతల ఇసిరేసినట్టు' అనే ఒక్క వాక్యం చాలు.. అన్న అప్పటి పరిస్థితులను ఎంత బాగా ఆకళింపు చేసుకున్నాడో చెప్పడానికి.

విలువల విధ్వంసంపై గురి..

ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, సరళీకరణ మన సమాజంలో తెచ్చిన మార్పులు, మానవ సంబంధాల్లో సృష్టించిన కల్లోలం పైన దేవేందరన్న రాసిన తీరు ప్రశంసనీయం. వామపక్ష పార్టీలు, రచయితలు వాడే అర్థం కాని పదజాలాన్ని వాడకుండానే మామూలు వాడుక భాషలో చెప్పాల్సిందంతా చెప్పేశారు. ‘పౌర స్పృహ కోల్పోతున్న కాలం’.. యాజమాన్యం, ‘ఉద్యోగవర్గం కలగలిసిపోయిన కాలం’.. ‘పట్టింపులేని తరం తయారవుతున్నది’.. ‘కొత్త సంస్కృతులు విస్తృతమవుతున్నయ్’.. ‘మారుతున్న స్వరాలు’.. ‘కుటుంబ బలగం మృగ్యమవుతున్న కాలం’.. ‘సంస్కృతి కోల్పోతున్న పల్లెలు’.. ‘రాజకీయమే వ్యాపారమైతే ఎట్లా’.. వంటి వ్యాసాలు ఇందుకు మచ్చుతునకలు. విప్లవించాల్సిన యువతరం కేరీరిజం, సెల్ఫిష్‌నెస్‌తో నిర్వీర్యం కావడం, హక్కుల కోసం ఉద్యమించాల్సిన ఉద్యోగ, కార్మిక సంఘాలు రాజీ, సర్దుబాటుతో వ్యవహరించడం, ప్రపంచమంతా డబ్బు చుట్టూతా తిరగడం, రాజకీయం పక్కా బిజినెస్‌గా మారడం వంటి అపసవ్య ధోరణులను బయటపెట్టారు. టెక్నాలజీ తెచ్చిన మంచినీ, చెడునూ అన్న పలు వ్యాసాల్లో వివరించారు. పల్లె ప్రజల జీవితాల్లో, కుటుంబ, మానవ సంబంధాల్లో, సంస్కృతి సంప్రదాయాల్లో సెల్‌ఫోన్ తెచ్చిన అనర్థాలను కళ్లకు కట్టారు. పుస్తకాల భౌతిక పఠనం తగ్గిపోతున్నదని ఆందోళన చెందారు. చదువు వదిలేసి విద్యార్థులు సోషల్ మీడియా వెంట, పిచ్చి సంస్కృతి వెంట పరుగెడుతున్నారని వాపోయారు.

డిజిటల్ మీడియాదే ఫ్యూచర్..

మరోవైపు, రాబోవు కాలమంతా డిజిటల్ పత్రికలదేనని 2022 ప్రారంభంలోనే భవిష్యవాణి వినిపించారు. ‘‘ఇదివరకు ఏ బస్సు ఎక్కినా పది మంది పత్రికలు చదివే ప్రయాణికులు కనపడేవాళ్లు. ఉదయం లేవగానే పత్రికలు పంచే పిల్లలు సైకిళ్లపై కనిపించేవాళ్లు. ఇప్పుడో.. ఏజెంట్లు మాత్రమే మోటార్ సైకిళ్ల మీద తిరుగుతూ కనిపిస్తున్నారు. బస్టాండుల్లో పత్రికల స్టాల్స్ తగ్గిపోయాయి. కొన్ని పత్రికలు ఆగిపోయాయి. ప్రింటింగ్ తగ్గిపోయింది... అందరూ డిజిటల్ ప్లాట్‌ఫారానికి వచ్చేస్తున్న సందర్భం ఇది.’’ అంటూ ఢంకా భజాయించారు. ఆయన చెప్పినట్టే డిజిటల్ పేపర్‌గా వచ్చిన దిశ ఈ రోజు ప్రధాన పత్రికల్లో ఒకటిగా నిలిచింది. ఎన్నెన్నో ఆన్‌లైన్ పేపర్లు, వెబ్‌సైట్లు, యూట్యూబ్ చానెళ్లు పుట్టుకొచ్చి ప్రజాదరణ పొందుతున్నాయి. ప్రింట్ పేపర్ల ప్రాబల్యం రోజురోజుకు రోజురోజుకు తగ్గిపోతున్నది.

హుస్నాబాద్ చరిత్ర మథనం..

హుస్నాబాద్ ప్రాంత, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఉద్యమ చరిత్రను, అక్కడి కవుల గొప్పతనాన్ని, వాళ్లు రాసిన పుస్తకాలను పరిచయం చేస్తూ కూడా సంకలనంలో వ్యాసాలున్నాయి. ఈ తరానికి, యువకవులకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇక, నిత్యజీవితంలో నవ్వు తెప్పించే, విషాదం పలికించే, ఆలోచింపజేసే పలు ఘటనలను ఉటంకిస్తూ దేవేందరన్న రాసిన ఎన్నో వ్యాసాలు ఈ సంకలనంలో ఉన్నాయి. వాటిని సమీక్షించడం కంటే మీరే వాటిని చదివి అన్న భాష, యాసలను ఆస్వాదించడం మేలు.

దశాబ్దాలుగా అనుబంధం..

దేవేందరన్న పేరు నాకు ‘జీవగడ్డ’ రోజుల నుంచే తెలుసు. విప్లవోద్యమంలో కరీంనగర్ పట్టణ ఆర్గనైజర్‌గా ఉన్నప్పుడు ఆ సాయంకాలపు డైలీలో అన్నతో పాటు ఘంటా చక్రపాణి, అల్లం నారాయణ, విజయ్ కుమార్, కేఎల్ఎన్ చారి, వారాల ఆనంద్, ఎన్ శ్రీనివాస్, కేవీ నరేందర్ తదితర ప్రముఖులు పనిచేయడం నాకింకా గుర్తుంది. మెయిన్ స్ట్రీమ్ పేపర్లకు భిన్నంగా వాళ్లు జీవగడ్డను నడిపించారు. ఆ తర్వాత 2004 నుంచి 2008 వరకు ఆంధ్రజ్యోతి కరీంనగర్ ఎడిషన్ ఇన్చార్జిగా ఉన్నప్పుడు అన్న, నేను పలు సందర్భాల్లో కలుసుకున్నాం. అప్పటినుంచి ఆయన రాసి, వెలువరిస్తున్న అనేక రచనలు చూస్తున్నాను. కరీంనగర్ టాబ్లాయిడ్‌లో అప్పట్లో దర్పణం పేరిట వారం వారం వెలువడిన సాహిత్య పేజీలో కూడా అన్న రచనలు అచ్చయ్యాయి. ఇక, నేను నమస్తే తెలంగాణలో పనిచేస్తున్నప్పుడు, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సందర్భంలో అందరిలాగే నాకూ దేవేందరన్నతో అనుబంధం పెరిగింది. తెలంగాణ యాసను, ప్రాసను వాడుకుని తననుకున్న భావాలను అద్భుతంగా చెప్పగల మనకాలం గొప్ప కవిగా అన్నకు ప్రత్యేక గుర్తింపు ఉంది.

పాపులర్ రచనలకు పరాకాష్ట..

దిశ పత్రిక 2020 మార్చ్ 7న ప్రారంభమైంది. మరుసటి సంవత్సరం ఉగాది పర్వదినాన సంపాదకీయ పేజీని ఆరంభించాం. మా నుంచి అభ్యర్థన వెళ్లిన వెంటనే సాహిత్య పేజీలో వీక్లీ కాలమ్ రాయడానికి దేవేందరన్న అంగీకరించాడు. ‘అంతరంగం’ శీర్షిక పేరుతో కొనసాగిన ఆ కాలమ్.. పాఠకుల్లో బాగా పాపులర్ అయింది. పేజీకి తెలంగాణ అస్తిత్వాన్ని తెచ్చిపెట్టింది. 150 వారాలు మించినా అప్రతిహతంగా కొనసాగుతూనేవుంది. ఇందుకు అన్నకు ‘దిశ’ ఎంతగానో రుణపడివుంటుంది. భవిష్యత్తులోనూ అన్న ఈ కాలమ్‌ను కొనసాగించాలని ఆశిస్తున్నాను. ఆరు వసంతాలు నిండిన అన్న నూరేళ్లు వర్ధిల్లాలని, తెలంగాణ సాహితీ కీర్తిని దశదిశలా వ్యాపింపజేస్తుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..

పుస్తకం : అంతరంగం

సంపాదకుడు: అన్నవరం దేవేందర్

పేజీలు:334, వెల: రూ.200,

ప్రతులు: అన్నిప్రముఖ పుస్తక కేంద్రాల్లో లభ్యం


-డి. మార్కండేయ

ఎడిటర్, దిశ

[email protected]

Advertisement

Next Story