పురుషులను వలలో వేసుకుంటున్న స్పైడర్.. అల మోహింపజేసి మరి..

by Shyam |
పురుషులను వలలో వేసుకుంటున్న స్పైడర్.. అల మోహింపజేసి మరి..
X

దిశ, ఫీచర్స్ :ఆటమ్ సీజన్ ప్రారంభంకావడంతో చల్లని గాలులు, ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు ఇంటి నుంచి బయటకొస్తున్న జార్జియా వాసులు ‘పది అడుగుల స్పైడర్ వెబ్’లో చిక్కుకుపోతున్నారు. ఆసియా నుంచి అమెరికాలో అడుగుపెట్టిన ‘జోరో స్పైడర్’ ప్రస్తుతం ఆ దేశ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

తూర్పు ఆసియాకు చెందిన జోరో స్పైడర్.. కొరియా, చైనా, తైవాన్, జపాన్‌ దేశాల్లో ఎక్కువగా కనిపించేది. జపనీస్ జానపద కథల్లో ‘జోరో-గుమో’గా వర్ణించబడిన ఈ స్త్రీ-సాలీడు జీవి పురుషులను మోహింపజేసి, వలలో వేసుకుంటుంది. ఫిమేల్ స్పైడర్స్ 3- 4 అంగుళాల పొడవుతో పసుపు, ఎరుపు చారలను కలిగి ఉంటాయి. ఇక మేల్ జోరోస్ పరిమాణంలో చిన్నంగా ఉండి గోధుమ రంగులో కనిపిస్తాయి. ఏడాది వీటి జీవిత కాలాన్ని మాత్రమే కలిగిన ఈ జీవులు సాధారణంగా శరదృతువులోనే కనిపిస్తాయి. జోరో స్పైడర్ విషపూరితమైనప్పటికీ.. అది ముప్పుగా భావిస్తే తప్ప మనుషులను కాటేయదు. పైగా దాని విషం ప్రాణాంతకం కాదు. ఈ స్పైడర్‌ను జార్జియాలో 2014లో మొదటిసారిగా చూసిన వ్యక్తి.. ‘మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ’లో కలెక్షన్స్ మేనేజర్ రిక్ హోబెక్‌కు సమాచారం అందించాడు. ఈ జీవిని తనిఖీ చేసిన హోబెక్.. జోరో సాలీడుగా గుర్తించాడు. ఇవి జార్జియాలో కొన్నేళ్లుగా సంచరిస్తున్నప్పటికీ, ఇటీవలే భారీ సంఖ్యలో బయటపడ్డాయి. ప్రస్తుతం వీటి కారణంగా ఆ దేశానికి చెందిన 25 కౌంటీల్లోని మిలియన్ల జనం బెంబేలెత్తుతున్నారు. 3 అంగుళాల పొడువుండే ఈ సాలీడ్లు హౌజ్ పోర్చెస్, గార్డెన్స్, మెయిల్‌బాక్స్‌, విద్యుత్ లైన్లతో సహా ఎక్కడైనా భారీ వెబ్‌లను నేయగలవు.

వాతావరణం చల్లబడినందున జోరో సాలెపురుగులు నవంబర్ చివరి నాటికి చనిపోయే అవకాశం ఉంది. కానీ వచ్చే ఏడాదికల్లా వాటి సంఖ్య పెరుగుతుందని నిపుణులు మాత్రం భావిస్తున్నారు. ఫిమేల్ జోరో స్పైడర్స్ ప్రస్తుతం వాటి గుడ్ల సంచుల్ని పొదుగుతాయి. అవి వసంతకాలంలో బయటపడతాయి. ఒక్కొక్కటి 400 కంటే ఎక్కువ సాలెపురుగులకు జన్మనిస్తాయని, అవి కొత్త ప్రాంతాలకు లేదా రాష్ట్రాలకు విస్తరించే అవకాశం లేకపోలేదని లైవ్ సైన్స్ నివేదించింది.

పర్యావరణానికి మేలే..

దోమలు, ఈగలతో పాటు పంటలను నాశనం చేసే మార్మోరేటెడ్ స్టింక్ బగ్స్‌ను జోరోస్ తింటాయి. ఇవి మానవులకు లేదా పెంపుడు జంతువులకు హానికరం కాదు. రసాయనాలు లేకుండా సహజంగా తెగుళ్లను అణిచివేసేందుకు జోరో సాలెపురుగులు మనకు ఎంతగానో సాయం చేస్తున్నాయి. కాబట్టి నేను మిలియన్ల కొద్దీ సాలెపురుగులు, వాటి వెబ్స్ కలిగి ఉండటం మంచి విషయమని ప్రజలను ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నాను
– నాన్సీ హింకిల్, కీటక శాస్త్రవేత్త

Advertisement

Next Story

Most Viewed