ఇంతకంటే చండాలమైన పిల్లల పెంపకం మరొకటి ఉండదు.. మీరు అదే చేస్తున్నారా..?

by sudharani |
ఇంతకంటే చండాలమైన పిల్లల పెంపకం మరొకటి ఉండదు.. మీరు అదే చేస్తున్నారా..?
X

దిశ, ఫీచర్స్: చిన్న పిల్లల్ని పెంచడం అనేది అంత సులువైన పని మాత్రం కాదు. ఏమీ తెలియని ఓ మట్టి ముద్దను అద్భుతమైన విగ్రహంగా మలచడానికి ఎంతో కళా నైపుణ్యం అవసరం. అదే విధంగా ఏమీ తెలియని ఓ శిశువుకు అవసరమైన జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిస్తూ ఒక మంచి వ్యక్తిత్వం కలిగిన మనిషిగా తయారు చేయడానికి తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. కానీ కొంత మంది తల్లిదండ్రులు చెత్త పేరెంటింగ్‌ స్టైల్‌ని అవలంబిస్తుంటారు. దాన్నే ‘ఎగ్‌‌షెల్‌ పేరెంటింగ్‌’ అంటున్న నిపుణులు.. ఈ పద్ధతి మార్చుకోవడం మంచిదని సూచిస్తున్నారు. ఇంతకీ ‘ఎగ్‌‌షెల్‌ పేరెంటింగ్‌’ అంటే ఏమిటి? అసలు పిల్లలను ఎలా పెంచాలి?

‘ఎగ్‌షెల్‌ పేరెంటింగ్‌’ అంటే పిల్లలకు కష్టం తెలియకుండా ఎప్పుడు చుట్టూ ఉండటం. ఉదాహరణకు గుడ్డు లోపల ఉన్న పదార్థానికంతటికీ గుడ్డు పెంకు ఒక రక్షణ కవచంలా ఉంటుంది. దీంతో లోపల ఉన్న పదార్థం చాలా నిశ్చింతగా.. ఏం ఆలోచించాల్సిన పని లేకుండా ఉంటుంది. మరి మీ పిల్లల్ని అలాగే పెంచుతున్నారా? ఒక్కసారి ఆలోచించుకోండి. ఎందుకంటే పిల్లలు చిన్నతనం నుంచే అన్ని నైపుణ్యాలను నేర్చుకోవాలి. నలుగురితో మాట్లాడాలి. సమస్యలను, సవాళ్లని వారంతట వారే పరిష్కరించుకునేలా తయారవ్వాలి. అంతే తప్ప ప్రతి విషయంలో వారు మీపై ఆధారపడే విధంగా పెంచకండి. వారి గురించి వారిని ఆలోచించుకునేలా చేయండి. తప్పు దారిలో వెళుతున్నప్పుడు మాత్రం జోక్యం చేసుకుని మంచి-చెడు వివరించడం ఉత్తమం.

* అతి అనేది అనర్థాలకు దారి తీస్తుందని పెద్దలు ఊరికే అనలేదు. ఇది పేరెంటింగ్‌ విషయంలోనూ వర్తిస్తుందని తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలి. పిల్లలను అతి గారాబంగా, అతి ప్రేమగా, అతి జాగ్రత్తగా చూసుకోవడం వారిని మానసికంగా ఎదగనీయకుండా అడ్డుపడతాయని కొన్ని అధ్యయనాల్లో తేలింది. ప్రేమగా చూసుకోండి కానీ దాని మూలాన పిల్లల భవిష్యత్తు పాడవకుండా జాగ్రత్తపడండి. తప్పు చేసినప్పుడు గారాబంతో వెనకేసుకు రావడం మంచిది కాదు. దానివల్ల తప్పు చేయడం వారికి అలవాటైపోతుంది.

* ఇంకొంత మంది తల్లిదండ్రులు ఎలా ఉంటారు అంటే.. పిల్లలు ఏం అడిగితే అది కాదనకుండా కొనిచ్చేస్తూ ఉంటారు. అది అవసరమా? కాదా? అన్న విషయాన్ని ఏ మాత్రం ఆలోచించరు. తన కొడుకు లేదా కూతురు మహారాజు లేదా మహా రాణి అనే ఫీలింగ్‌‌తో ఎక్కువగా ప్యాంపర్ చేస్తూ ఉంటారు. దీంతో పిల్లల్లో పెంకి మనస్తత్వం పెరిగిపోతుంది. పెద్దయ్యే కొద్దీ వారు అనుకున్నది ఏదైనా జరగకపోతే తట్టుకోలేరు. తీవ్రంగా ప్రవర్తిస్తారు. మొండిగా తయారవుతారు. కనుక చిన్న పిల్లలు అడిగిందల్లా ఇస్తూ పోకుండా కొన్నింటికి నో అనడం కూడా నేర్చుకోండి.

* చిన్నప్పటి నుంచి పిల్లలకు అన్ని పనులూ నేర్పించండి. కష్టమైన పనులైనా కూడా పూర్తి చేయమని అప్పగించండి. ప్రతి విషయాన్ని అర్థమయ్యేలా చెప్పేందుకు ప్రయత్నించండి. మాట వినకపోతే కొన్ని సార్లు కటువుగా వ్యవహరించండి. అంతమాత్రాన మీకు వారి మీద ప్రేమ లేనట్లు కాదు. ఇంకో విషయం ఏంటంటే పిల్లల ముందు భార్యాభర్తలు గొడవ పడకూడదు. ఎందుకంటే వారి చిన్ని హృదయం గాయపడుతుంది. ఆలోచన విధానం కూడా మారుతుంది. ఒక్కోసారి మీ గురించి ఆలోచించి పిల్లలు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయే ఛాన్స్ కూడా ఉంది. అలాగే పిల్లలతో లేదా వారి ముందు చెడ్డ మాటలు మాట్లాడకూడదు. వారు తొందరగా నేర్చుకుంటారు. అవే నలుగురిలో ఉన్నప్పుడు మాట్లాడితే చులకనైపోతారు.

Next Story