Joint pains : చలికాలంలో కీళ్లనొప్పులా..? నివారణ కోసం నిపుణుల సూచనలివే..

by Javid Pasha |
Joint pains : చలికాలంలో కీళ్లనొప్పులా..? నివారణ కోసం నిపుణుల సూచనలివే..
X

దిశ, ఫీచర్స్ : సీజన్‌ను బట్టి వాతావరణమే కాదు, మనుషుల ఆరోగ్యం విషయంలోనూ పలు మార్పులు సంభవిస్తుంటాయి. ముఖ్యంగా మిగతా కాలాలతో పోలిస్తే వింటర్‌లో కీళ్లనొప్పులు (Joint pains) పెరిగే అవకాశం ఎక్కువగా ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. వయస్సుతో సంబంధం లేకుండా ఈ సమస్య ఎవరిలోనైనా తలెత్తవచ్చు. చల్లటి వాతావరణం, ఎండ తగలకపోవడం, శరీరంలో విటమిన్ డి లోపించడం, శారీరక శ్రమ తగ్గడం, నీరు తక్కువగా తాగడం వంటివి ఇందుకు కారణం అవుతుంటాయని నిపుణులు చెప్తున్నారు. అయితే ఈ సమస్య నుంచి బయటపడేందుకు కొన్ని నివారణ పద్ధతలను సూచిస్తున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం.

* వెదర్ చేంజ్ ఎఫెక్ట్ : వాతావరణ మార్పు (Weather change)వల్ల ఉదయం, సాయంత్రం చలిగాలులు వీస్తుంటాయి. ఈ పరిస్థితుల్లో కీళ్లనొప్పులతో ఇబ్బందిపడేవారిలో సమస్య మరింత అధికం అవుతుంది. రోజువారీ పనులు చేసుకోవడం కూడా కష్టంగా మారుతుంది కొందరికి. అయితే చలికాలంలోనూ తరచుగా వ్యాయామాలు చేయడం ఇందుకు చక్కటి పరిష్కారంగా నిపుణులు పేర్కొంటున్నారు. వెదర్ కారణంగా అసౌకర్యంగా(Inconvenient) అనిపించినా వ్యాయామం తర్వాత మంచి ఫలితాలనిస్తుంది. రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది. కాళ్లు, చేతుల్లో వాపు తగ్గుతుంది.

* గోరు వెచ్చని నీరు తాగండి : చలి కారణంగా కీళ్ల నొప్పులు ఎదుర్కొనే వారు ఈ సీజన్‌లో గోరు వెచ్చని నీటిని తాగడం మంచిదంటున్నారు ఆయుర్వేదిక్ ఆరోగ్య నిపుణులు. అలాగే గోరు వెచ్చని నీటిలో (hot water) ఆవాల నూనె చుక్కలు కలిపి పాదాలు, చేతులు ఆ నీటిలో కాసేపు ఉంచి తర్వాత శుభ్రమైన గుడ్డతో తుడుచుకోవాలి. దీంతో కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.

* స్ట్రెచింగ్ : ఒక వేళ మీకు వ్యాయామం చేయడానికి తగిన సమయం లేదనుకుంటే చలికాలంలో డైలీ స్ట్రెచింగ్ (Stretching) కూడా చేయవచ్చు. దీనివల్ల కాళ్లు, చేతులు, కీళ్ల భాగంలో కదలికలవల్ల నొప్పి నుంచి ఉపశమనం పొందుతారు. అలాగే శరీరాన్ని చలివాతావరణం నుంచి రక్షించుకోవాలి. వెచ్చగా ఉండేలా చూసుకోవాలి. కాళ్లకు సాక్స్, చేతులకు క్లాతింగ్ గ్లోవ్స్ ధరించవచ్చు.

* కాచిన నూనెతో మసాజ్: చలికాలంలో కొబ్బరి నూనెను (Hot oil massage) కాస్త వేడిచేసి గోరు వెచ్చగా ఉన్నప్పుడు దానితో కాళ్లు, చేతులు, మెడ వంటి భాగాల్లో మసాజ్ చేసుకోవచ్చు. దీనివల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయిని నిపుణులు చెప్తున్నారు. అలాగే వృద్ధులు, పిల్లలకు మరింత జాగ్రత్త అవసరం. పెద్దవారు ఏవైనా మందులు వాడుతుంటే వాటిని సమయానికి వేసుకోవాలి. చలికి తట్టుకునే దుస్తులు ధరించాలి. ఇలాంటి నివారణ పద్ధతులతో కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలగకపోతే అది తీవ్రమైన సమస్య అయి ఉండవచ్చు. అలాంటప్పుడు వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

* నోట్: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed