- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Science Mysteries: వేల సంవత్సరాల మిస్టరీలను ఛేదిస్తున్న తెలుగు బిడ్డ.. ఈ యూట్యుబ్ ఛానెల్

GEO EXPLORER: మనిషి శాశ్వతం కాదు.. జ్ఞానం మాత్రమే శాశ్వతం. విజ్ఞానానికి మరణం ఉండదు. ఈ విజ్ఞాన కాంతులను ప్రజలకు అందించే శాస్త్రవేత్తలు, పరిశోధకులు నిత్యం మానవాళిని ముందుకు నడిపిస్తూనే ఉంటారు. అందులో ఓ నిత్య-సత్య అన్వేషకుడి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. -వెన్నెల
మీకు తిరుమల గురించి ఎంతవరకు తెలుసు? అది వేంకటేశ్వరుడు కొలువై ఉన్న కొండ అని తెలుసు..! అంతేకదా? కానీ కోట్ల సంవత్సరాల క్రితం తిరుమల ఎలా ఉండేదో ఎప్పుడైనా ఆలోచించారా? మీరు ఇప్పుడు వెళ్తున్న తిరుమల ఒకప్పుడు మొత్తం సముద్రంతో నిండిపోయి ఉండేది. దీనికి ఆధారాలు అక్కడ కనిపించే రాళ్ల రూపం, వాటి స్వభావం. తిరుమలలోని కొండలపై ఉన్న రాళ్లను గమనిస్తే, అవి పొరలుగా ఉంటాయి. ఈ రాళ్ల పొరలు అప్పట్లో సముద్రపు లోయలో కూడిన అవక్షేప పదార్థాలు (sediments). ఇక సముద్రపు అలలు నీటిలో మట్టిని, చిన్న రాళ్లను తరగడం వల్ల ఏర్పడే "రిపిల్ మార్క్స్" తిరుమల రాళ్లపై కనిపిస్తాయి. తిరుమల ప్రదేశం ఒకప్పుడు సముద్రపు అడుగులో ఉండేదనడానికి ప్రధాన ఆధారాలు ఇవి. ఇదంతా సైన్స్ చెబుతున్న సత్యం. ఈ సత్యాన్ని ప్రజలకు దగ్గర చేస్తున్నది ఎవరో తెలుసా? యూట్యుబ్‌లో ఓ ఛానెల్ ఉంది. ఆ ఛానెల్ పేరు 'Geo Explorer'. ఈ ఛానెల్‌లో ఒక్కో వీడియో ఒక్కో విజ్ఞాన భాండాగారం. ఈ ఛానెల్ క్రియేటర్ పేరు జీ నవీన్ కుమార్. 2014 బ్యాచ్, తిరుపతి SV యూనివర్శిటీ స్టూడెంట్, జియాలజీ ఇన్ మాస్టర్స్ హోల్డర్, గోల్డ్ మెడలిస్ట్ అయిన నవీన్ తన నాలెడ్జ్‌తో ప్రజలకు విజ్ఞాన కాంతులు ఇస్తున్నాడు. Geo Explorer పేరుతో యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఛానెల్స్ నిర్వహిస్తున్న అతనికి లక్షలాది ఫోలోవర్లు ఉన్నారు. తిరుమల నుంచి చిగురుగుంట బంగారు గని వరకు ఆయన చేసిన పరిశోధన, దానికి సంబంధించిన వీడియోలు చూస్తే అతన్ని శ్రమను మెచ్చుకోకుండా ఎవరూ ఉండలేరు.
తిరుమల రాళ్లకు ఉన్న ప్రాచీన చరిత్ర నవీన్ చాలా వివరంగా చెప్పిన వీడియో ఒకటి ఉంది. తిరుమల ప్రాంతంలో ఎక్కువగా క్వార్ట్‌జైట్ రాళ్లు కనిపిస్తాయి. ఇవి చాలా బలమైనవిగా ఉంటాయి . అధిక ఒత్తిడి, ఉష్ణంతో ఏర్పడతాయి. నవీన్ పరిశోధన ప్రకారం, తిరుమల రాళ్ల వయస్సు సుమారు కోట్ల సంవత్సరాల పూర్వం. తిరుమల ప్రాంతం ఒకప్పుడు ఉన్న సముద్రపు లోయల గురించి చారిత్రక ఆధారాలను ప్రదర్శిస్తూ, నేటికీ అక్కడ కనిపించే రాళ్లు, వాటి నిర్మాణం, వాటి ప్రత్యేకతల గురించి ఆసక్తికరంగా వివరించారు నవీన్. రాళ్ల రంగు, వాటి లోపల చిన్న సముద్రపు శిలాజాలు సముద్ర చరిత్రకు సాక్ష్యం. తిరుమల ప్రాంతం భూగోళ శాస్త్రంలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉందని, అది నేడు ఎలా ఉన్నప్పటికీ, కోట్ల సంవత్సరాల క్రితం సముద్రపు అడుగు భాగంగా ఉండేదనే విషయాన్ని స్పష్టంగా వివరించారు నవీన్. ఒక్క మాటలో చెప్పాలంటే భూమి ఆకృతిలో జరిగిన మార్పులు, భూకంపాలు, భూ ఫలకాల కదలికల కారణంగా, సముద్రపు అడుగు భాగాలు పైకి లేవడంతో ఈ ప్రదేశం కొండలుగా ఎలా మారిందో వివరించారు. ఈ ప్రక్రియ లక్షల కోట్ల సంవత్సరాల క్రితం జరిగిందని సైంటిఫిక్ ఎవిడెన్స్‌తో నవీన్ ఎక్స్‌ప్లెయిన్ చేసిన తీరు వీడియో చూసిన వారిని ఫ్లాట్ చేసిందనే చెప్పాలి. ఇక ఈ వీడియో ద్వారా ప్రకృతితో మనకి ఉన్న సంబంధాన్ని మరింతగా అర్థం చేసుకోవచ్చు.
వన్ అండ్ ఓన్లీ ఛానెల్:
తెలుగులో జియాలజీ గురించి వివరించే ఏకైక ఛానల్ ఇది. తెలుగులో భూవిజ్ఞానం గురించి వీడియోలు అందిస్తున్న ఈ ఛానెల్‌లో ప్రతీ వీడియో చూడాల్సిందే. తెలుగు ప్రజల కోసం జియాలజీ లాంటి క్లిష్టమైన అంశాలను అందరికీ అర్థమయ్యేలా వివరించడం నిజంగా గొప్ప విషయమని చెప్పవచ్చు. జియాలజీ అనేది భూమి నిర్మాణం, దాని అభివృద్ధి, దాని వనరులపై అధ్యయనం చేసే శాస్త్రం. ఇది భూమి చరిత్రను, భూకంపాలు, అగ్నిపర్వతాలు, ఖనిజ వనరుల గురించి వివరంగా అధ్యయనం చేస్తుంది. భూవిజ్ఞానం మనం ప్రకృతితో ఎలా ఉండాలో వివరించే శాస్త్రం. ఇది మనకు సహజ వనరుల సంరక్షణ, పర్యావరణ మార్పులపై అవగాహన, భూకంపాల లాంటి ప్రకృతి వైపరీత్యాలపై అవగాహన పెంచుతుంది.
భూవిజ్ఞానం గురించి ఆసక్తికర వాస్తవాలు
1. భూమి సుమారు 4.54 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడింది.
2. భూమి ఉపరితలం ఫలకాలుగా (plates) ద్వారా ఏర్పడింది. ఇవి కదులుతూ, పర్వతాలు, భూకంపాలు, అగ్నిపర్వతాలు ఏర్పడేలా చేస్తాయి.
3. భూకంపాలు సాధారణంగా భూ ఫలకాల కలయిక ప్రాంతాల వద్ద ఎక్కువగా సంభవిస్తాయి.
4. భూమిపై ఎవరెస్టు పర్వతం అత్యంత ఎత్తైన ప్రదేశం, కానీ సముద్రపు లోయలైన మారియానా ట్రెంచ్ దాని కంటే లోతైనది.
5. సుమారు 65 మిలియన్ సంవత్సరాల క్రితం భూమిపై పెద్ద ఆస్టరాయిడ్ ఢీ కొట్టడంవల్ల డైనోసార్ల అంతం సంభవించింది.
6. ప్రపంచంలోని చాలా ఖనిజాలు అగ్నిపర్వతాల శక్తి వల్లనే ఏర్పడ్డాయి.
7. భూవిజ్ఞానంలో రాళ్లను మూడు రకాలుగా విభజిస్తారు:
అగ్నిజ శిలలు (Igneous Rocks): లావా చల్లబడటంతో ఏర్పడే రాళ్లు.
అవక్షేప శిలలు (Sedimentary Rocks): మట్టితో కూడిన పొరల చరమాంకంగా ఏర్పడే శిలలు.
రూపాంతర శిలలు (Metamorphic Rocks): ఒత్తిడి, వేడి వల్ల మారిన రాళ్లు.
ఈ పైన చెప్పిన అన్నీ విషయాలను మీరు నవీన్ 'Geo Explorer' ఛానెల్ ద్వారా తెలుసుకోవచ్చు.
జ్ఞానానికి విలువ ఇచ్చే చానల్
మన జీవితంలో విజ్ఞానం చాలా ముఖ్యమైనది. ఇది మన ఆలోచనలకి దిశనిచ్చి, మనం నిజాలు తెలుసుకునేలా చేస్తుంది. ప్రపంచాన్ని తెలుసుకోవడానికి శాస్త్రజ్ఞానం, భౌతిక విజ్ఞానం, భూవిజ్ఞానం కీలకంగా ఉంటాయి. ‘జియో ఎక్స్‌ప్లోరర్’ ఛానల్ ఈ విజ్ఞానాన్ని తెలుగు ప్రజలకు దగ్గర చేస్తోంది. సైన్స్ మనిషి జీవితాన్ని మెరుగుపరచే గొప్ప సాధనం. ఇందులో భూవిజ్ఞానం చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే, మనం నడిచే నేల, మనం తాగే నీరు, వాతావరణం.. ఇవన్నీ భూశాస్త్రంతో సంబంధం కలిగి ఉంటాయి. ఈ చరిత్రను వివరించడంలో నవీన్ అద్భుతంగా పని చేస్తున్నారని ఆయన వీడియోలకు ఉన్న కామెంట్స్ చూస్తే క్లియర్‌కట్‌గా అర్థమవుతుంది.
దేశంలోని అతి పురాతన శిలలు
ఈ అంశంపై నవీన్ ఓ వీడియో చేశారు. భారత్‌లో ఉన్న అత్యంత ప్రాచీన శిలలను గురించి వివరించారు. భారత ఉపఖండంలో కొన్ని ప్రాంతాల్లో 3.5 బిలియన్ సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు గల శిలలు ఉన్నాయి. ఈ శిలలు భూమి ఆరంభ దశలలో ఏర్పడి, భూగోళ శాస్త్రంలో ముఖ్యమైన స్థానం కలిగి ఉన్నాయి. ఇక ఆర్చేయన్ ఈయాన్ (Archean Eon) గురించి కూడా నవీన్ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. భూమి చరిత్రలో ఆర్చేయన్ ఈయాన్ సమయంలో ఏర్పడిన శిలలను గురించి వివరించారు. ఈ శిలలు భూమి ఆరంభ దశలలో జీవం ఆవిర్భవించిన సమయంలో ఏర్పడ్డాయి. అటు కర్ణాటక క్రాటన్ ప్రాంతంలో 3.4 నుంచి 3.6 బిలియన్ సంవత్సరాల వయస్సు గల శిలలు ఉన్నాయి. ఈ శిలలు భూమి ప్రాచీన చరిత్రను అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి. ఇటు అదే వీడియోలో సింగ్బుమ్ క్రాటన్ (Singhbhum Craton) గురించి కూడా వివరంగా చెప్పారు నవీన్. పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల సరిహద్దులో ఉన్న సింగ్బుమ్ క్రాటన్ ప్రాంతంలో కూడా 3.1 నుంచి 3.3 బిలియన్ సంవత్సరాల వయస్సు గల శిలలు ఉన్నాయి. ఈ శిలలు భూమి ఆరంభ దశలలో జరిగిన భౌగోళిక పరిణామాలను సూచిస్తాయి. ఈ వీడియో ద్వారా, నవీన్ భారతదేశంలో ఉన్న ప్రాచీన శిలల ప్రాముఖ్యతను, వాటి భౌగోళిక, శాస్త్రీయ విలువను వివరించారు. భూమి చరిత్రను అర్థం చేసుకోవడానికి ఈ శిలలు ఎంత ముఖ్యమో ఈ వీడియోలో స్పష్టంగా చెప్పారు.
ఎన్నో అద్భుత పరిశోధనలు:
"జియో ఎక్స్‌ప్లోరర్" యూట్యూబ్ ఛానెల్‌లో చాలా మందికి తెలియని ఎన్నో వివరాలను సాక్ష్యాలతో సహా వివరించారు నవీన్. టోబా సూపర్ వోల్కానో గురించి ఆయన చేసిన వీడియో నెక్ట్స్ లెవల్ అనే చెప్పాలి. ఆ వీడియోలో భూమి చరిత్రలో జరిగిన అతిపెద్ద అగ్నిపర్వత విస్ఫోటనం గురించి వివరించారు. ఈ విస్ఫోటనం ఎంత ప్రభావం చూపిందో, అది మన వాతావరణాన్ని, జీవరాశులను ఎలా ప్రభావితం చేసిందో చెప్పారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని చిగురుగుంట బంగారు గని గురించి ఓ వీడియో చేశారు నవీన్. బంగారం ఎలా ఏర్పడుతుంది? ఈ ప్రాంతం పూర్వకాలంలో ఎలా ఉండేదో తెలుసుకోవడానికి ఇది చాలా ముఖ్యమైన వీడియో అని చెప్పవచ్చు. అటు రిపిల్ మార్క్స్ గురించి విన్నారా? ఇది జియాలజీలో అద్భుతమైన భాగం. పూర్వకాలంలో నదులు, సముద్ర ప్రవాహాలు ఎలాంటి ప్రభావం చూపాయో తెలుసుకోవడానికి ఉపయోగపడే రిపిల్ మార్క్స్ గురించి వివరించారు నవీన్. అంతేకాదు డైనోసార్ల కాలం నాటి విషయాలను కూడా ఎంతో చక్కగా ఎక్స్‌ఫ్లెయిన్ చేశారు నవీన్. డైనోసార్ల కాలంలోని భూమి పరిస్థితులు, డైనోసర్ల అంతం గురించి వివరించారు. అటు పామ్పా సరస్సు ఆవిర్భావం గురించి కూడా చెప్పారు నవీన్. తెలంగాణలోని పామ్పా సరస్సు ఎలా ఏర్పడింది, దాని భౌగోళిక విశేషాలు ఏంటి అన్నది చాలా బాగా వివరించారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు.. ఛానెల్ అంతా ముందుగా చెప్పుకున్నట్టు విజ్ఞాన భాండాగారం. మన తెలుగువాళ్లకి తెలియని ఎన్నో అంతుబట్టిన రహష్యాలను సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యేలా చేస్తున్న నవీన్‌ను కచ్చితంగా మెచ్చుకోని తీరాల్సిందే!! శభాష్ నవీన్..!