Supportive relationships : సపోర్టివ్ రిలేషన్స్.. ఎందుకు అవసరమో తెలుసా?

by Javid Pasha |
Supportive relationships : సపోర్టివ్ రిలేషన్స్.. ఎందుకు అవసరమో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : వ్యక్తిగత సమస్యలతోనో, వృత్తిపరమైన సవాళ్లతోనో మీరు సఫర్ అవుతుండవచ్చు. పని ఒత్తిడితోనో, అనారోగ్యంతోనో అవస్థలు పడుతుండవచ్చు. ఏదైనా ప్రాబ్లంలో చిక్కుకొని, ఎలా బయటపడాలో తెలీక, ఎవరికీ చెప్పుకోలేక లోలోన కుమిలి పోతూ ఉండవచ్చు. ఇలాంటప్పుడే మిమ్మల్ని ఆ సమస్యల నుంచి బయటప పడేయడంలో సపోర్టి్వ్ రిలేషిప్స్ కీలకపాత్ర పోషిస్తుంటాయని సైకాలజిస్టులు అంటున్నారు. నిజానికి ప్రతి ఒక్కరికీ ఎన్నో పరిచయాలు ఉంటాయి. అందులో స్నేహితులు, బంధువులు, కొలీగ్స్ ఇలా చాలామంది ఉండి ఉంటారు. కానీ మీరేదైనా ఆపదలో ఉన్నప్పుడు, నిరాశా నిస్పృహల్లో కూరుకుపోయి ఏమీ తోచనప్పుడు మాత్రం కొందరో, ఒక్కరో మాత్రమే మీకు సపోర్ట్‌గా ఉంటారు. మిమ్మల్ని ఇబ్బందుల నుంచి బయటపడేయాలని చూస్తుంటారు. పరిష్కార మార్గం వెతుకుతుంటారు. ఇదే సపోర్టివ్ రిలేషిప్‌కు చక్కటి ఉదాహరణ అంటున్నారు నిపుణులు. అంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా మద్దతుగా నిలిచే ఒక వ్యక్తిగానీ, కొందరు వ్యక్తులుగానీ ప్రతీ ఒక్కరి జీవితంలో ఉంటారు.

ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మానసిక, శారీరక ఆరోగ్యాలపై మానవ సంబంధాల ప్రభావం ఉంటుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు, సహచరులు.. ఇలా ఎవరైనా కావచ్చు. వారికి మీకు మధ్య పాజిటివ్ అండ్ సపోర్టివ్ రిలేషన్‌షిప్స్ కలిగి ఉన్నప్పుడు మీరు ఆనందంగా ఉండగలుగుతారని నిపుణులు అంటున్నారు. పాజిటివ్ రిలేషన్స్ అంటే ఇక్కడ మీకు ఎల్లప్పుడూ సపోర్ట్‌గా ఉండే మానవ సంబంధాలు అని అర్థం. మీరు ఆపదలో ఉన్నప్పుడు, అవస్థలు పడుతున్నప్పుడు ఈ సంబంధాలు మిమ్మల్ని గట్టెక్కించడంలో సహాయపడతాయని ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్’కు చెందిన నిపుణులు అంటున్నారు. మానసిక ఒత్తిళ్లు, శారీరక అనారోగ్యాల వేళ జీవిత భాగస్వామి, కుటుంబం లేదా సన్నిహితుల రూపంలో బలమైన సపోర్టింగ్ వ్యవస్థను కలిగి ఉన్నవారు, అలాంటి సపోర్ట్ లేనివారితో పోలిస్తే ఎక్కువ బాధలను ఎదుర్కొంటారని, ఇది వారి అనారోగ్యాలకు, ఆయు క్షీణతకు కారణం అవుతుందని నిపుణులు అంటున్నారు. అందుకే మీకంటూ ఒక సపోర్టివ్ సిస్టమ్ మానవ సంబంధాల రూపంలో ఉండాలి.

ఒంటరి తనం వేధిస్తు్న్నప్పుడు, కుటుంబ, ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నప్పుడు కొందరికి ఏమీ తోచకపోవచ్చు. ఆందోళనతో, అభద్రతా భావంతో సతమతం అవుతుండవచ్చు. ఏ నిర్ణయం తీసుకోవాలో ఆ క్షణంలో అర్థం కాకపోవచ్చు. అలాంటప్పుడు నిస్వార్థంగా మీకోసం నిలబడే వ్యక్తి ఒకరుంటారు. వారెవరో గుర్తించగలిగితే మీ లైఫ్ బిందాస్ అంటున్నారు నిపుణులు. అలాగే బాధలు, భావోద్వేగాలు, సమస్యలు వంటివి ఎదురైప్పుడు మద్దతుగా నిలిచే కుటుంబం, ఆత్మీయులు, సన్నిహితులు ఉన్నవారు వారి మద్దతుతో ఇబ్బందుల నుంచి బయటపడతారు. మరి ఎలాంటి సపోర్టివ్ లేషన్స్ లేనప్పుడు ఏం జరుగుతుంది? అంటే బాధిత వ్యక్తుల్లోని నాడీ వ్యవస్థ వెంటనే ఫైట్ అండ్ ఫ్లైట్ మోడ్‌లోకి వెళ్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సందర్భంలో అధికస్థాయిలో అడ్రినల్ లేదా కార్టిసాల్ హర్మోన్లు విడుదలవుతాయి. ఫలితంగా మెంటల్ స్ట్రెస్ పెరుగుతుంది. క్రమంగా అది ఇతర అనారోగ్యాలకు దారితీస్తుంది. పాజిటివ్ రిలేషన్‌షిప్స్ కలిగి ఉన్నవారిలో ఇటువంటి పరిస్థితులు తలెత్తే అవకాశం చాలా తక్కువ. సో.. సపోర్ట్ రిలేషన్స్ కలిగి ఉండటం ముఖ్యమని గుర్తుంచుకోండి.

Advertisement

Next Story

Most Viewed