ఐదున్నర కోట్లకు అమ్ముడుపోయిన యాపిల్-1 ప్రొటో‌టైప్!

by Hajipasha |
ఐదున్నర కోట్లకు అమ్ముడుపోయిన యాపిల్-1 ప్రొటో‌టైప్!
X

దిశ, ఫీచర్స్: ప్రపంచంలో ఏ వస్తువునైనా మార్కెట్‌లోకి లాంచ్ చేసేముందు దాని పనితనం, డిమాండ్‌ను అంచనా వేసేందుకు ముందుగా ప్రొటో‌టైప్స్ విడుదల చేస్తుంటారనే విషయం తెలిసిందే. అదే యాప్, ఫీచర్స్ విషయంలో బీటా టెస్ట్ చేస్తుంటారు. అలా 1976లో యాపిల్ కంప్యూట‌ర్ సామ‌ర్ధ్యం డెమో ఇచ్చేందుకు ఆ సంస్థ కో-ఫౌండ‌ర్స్ స్టీవ్ జాబ్స్, వోజ్నియాక్ రూపొందించిన యాపిల్‌-1 కంప్యూట‌ర్ ప్రొటోటైప్‌ వేలంలో ఐదున్నర కోట్లకు అమ్ముడుపోయి రికార్డ్ సృష్టించింది.

స్టీవ్ జాబ్స్ త‌న లాస్ అల్టోస్ ఇంటిలో పార్టనర్స్ స్టీవ్ వోజ్నియాక్‌, ప్యాటీ జాబ్స్‌, డేనియ‌ల్ కోట్కేతో క‌లిసి దాదాపు 200 యాపిల్ డివైజెస్ రూపొందించిన విషయం తెలిసిందే. అందులో యాపిల్-1 ప్రొటోటైప్ ఒకటి. ఇది కొన్నేండ్ల పాటు యాపిల్ గ్యారేజీ ప్రాప‌ర్టీలోనే ఉండిపోగా, మూడు ద‌శాబ్దాల కింద‌ట స్టీవ్ జాబ్స్ స్వయంగా దీన్ని ఓ వ్యక్తికి అందించాడ‌ని బోస్టన్‌కు చెందిన RR ఆక్షన్ హౌజ్ వెల్లడించింది. కాగా ప్రపంచంలోని మొట్టమొదటి పర్సనల్ కంప్యూటర్ షాపుల్లో ఒకటైన కాలిఫోర్నియాలోని మౌంటెన్ వ్యూలోని 'బైట్ షాప్' స్టోర్‌లో Apple-1ని ప్రదర్శించేందుకు ఈ నమూనాను రూపొందించారు. ఈ ప్రదర్శనే ఆపిల్ కంపెనీకి తొలిసారిగా ఓ పెద్ద ఆర్డర్‌కు కారణం కాగా, దీంతో కంపెనీ భవిష్యత్తే మారిపోయిందని ఆర్ఆర్ పేర్కొంది. ఇక ఈ కంప్యూటర్‌ను గత నెలలో వేలంలో ప్రదర్శించగా, 5 ల‌క్షల డాల‌ర్లు (రూ. 4 కోట్లు) ప‌లికే అవ‌కాశం ఉందని ఆర్ఆర్ భావించగా, ఏకంగా ఐదున్నర కోట్లకు అమ్ముడుపోవడం విశేషం.

వేలంలో యాపిల్-1 కంప్యూట‌ర్స్ రికార్డ్స్ సృష్టించడం ఇదే తొలిసారి కాదు. గతేడాది అరుదైన Apple-1 కంప్యూటర్ $400,000కి వేలంలో అమ్ముడపోగా, మరో Apple-1 2020లో లండన్‌లో $470,000కి విక్రయించబడింది. ఏదేమైనా ఆపిల్ కళాఖండాలు అరుదైనవి, చారిత్రాత్మకమైనవిగా పరిగణించడంతో వీటికి అంతగా ధర పలుకుతుందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు.

స్టీవ్ జాబ్స్ బిజినెస్ కార్డ్ $9,518, 1983 నాటి మ్యాకింతోష్ ఇంట్రడక్షన్ ప్లాన్ లోగో కరపత్రం $9,635 , స్టీవ్ జాబ్స్ సంతకం చేసిన 1971 హైస్కూల్ ఇయర్‌బుక్ $22,728కి వేలంలో నిలవగా 1976లో యాపిల్ పన్ను మినహాయింపు కార్డుతో సంతకం చేసిన ఇతర యాపిల్ సంబంధిత వస్తువులు ఈ వారం విక్రయించబడతాయి.

Advertisement

Next Story

Most Viewed