స్పర్శ.. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి పిల్లలకు ఇలా నేర్పండి..

by Sujitha Rachapalli |
స్పర్శ.. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి పిల్లలకు ఇలా నేర్పండి..
X

దిశ, ఫీచర్స్ : అమ్మ ఒడిలో ఆడుకోవాల్సిన ఎనిమిది నెలల చిన్నారిపై అత్యాచారం.. బడిలో బుజ్జి బుజ్జి అడుగులతో పరుగెత్తాల్సిన బుజ్జి తల్లి బట్టలు బాత్రూమ్ లో ఓపెన్.. ఇంట్లో అమ్మానాన్న బయటకు వెళ్తూ మూడేళ్ల చిన్నారిని చూసుకోమని బాబాయికి అప్పగిస్తే రేప్ అటెంప్ట్.. అసలు సమాజం ఎటు వైపు వెళ్తుంది? ఎదిగిన అమ్మాయిలు, స్త్రీలు బట్టలు సరిగ్గా వేసుకోలేదనే అత్యాచారాలు జరుగుతున్నాయని చెప్పే మూర్ఖ శిఖామణులు.. ఈ దాడులకు కారణం ఏమని చెప్తారు? అభం శుభం తెలియని పిల్లల్లో కూడా కామం కనిపిస్తుందంటే.. వారికి ఎలాంటి శిక్షలు వేయాలి? మన పిల్లలను ఎలా కాపాడుకోవాలి? గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి వారికి ఎప్పుడు బోధించాలి? మనం ఎలా జాగ్రత్తపడాలి?

పిల్లలకు తల్లిదండ్రులు ప్రేమతో ముద్దు పెట్టడం, కౌగిలించుకోవడం, గిలిగింతలు చేయడం చేస్తుంటారు. వీటిని పిల్లలు కూడా ఆస్వాదిస్తుంటారు. మరింత సంతోషంగా ఫీల్ అవుతుంటారు. ఏడు, ఎనిమిది నెలల చిన్నారులు కూడా మనం ఇలాంటివి చేస్తే ఆనందంగా ఉంటారు. ఒక్కోసారి అసౌకర్యంగా ఫీల్ అయినప్పుడు వద్దని తమ భాషలో చెప్తుంటారు. అంటే శరీరాన్ని విరిచి పక్కకు తప్పుకోవడం, చేయి పక్కకు నెట్టేయడం లాంటివి చేస్తుంటారు. అలాంటప్పుడు మనం కూడా ఆగిపోవాలి ఎందుకంటే అది వాళ్ళ హక్కు. వద్దని చెప్పినా అదే పని చేస్తే వారి ఇష్టాన్ని గౌరవించనట్లే అవుతుందని చెప్తున్నారు నిపుణులు.

ఆరు, ఏడు నెలలు వచ్చిన పిల్లలు కూడా ఎవరి దగ్గరికి పడితే వాళ్ల దగ్గరికి వెళ్లరు. వెంటనే ఏడ్చేస్తారు. వారికి సెక్యూరిటీ అనిపించిన అమ్మ, నాన్న, కుటుంబీకుల దగ్గరే ఉంటారు. అపరిచితులు కనిపిస్తే ముఖం తిప్పేసుకుంటారు. అంతేకానీ తెలియని వాళ్లకు ఇచ్చి, వారి ఒడిలో కూర్చోబెట్టడం, వాళ్ళు బుగ్గలు గిల్లటం, ముద్దాడటం వంటివి మంచిది కాదు. ఏడాది దాటిన పిల్లలు అయితే ఈజీగా ఎస్ లేదా నో చెప్పేస్తారు. కాబట్టి వారి ఇష్టానికి అనుగుణంగానే నడుచుకోవాలి.

ఇక మూడేళ్ల వయసు వచ్చేసరికి పిల్లల్లో డెవలప్మెంట్ బాగానే ఉంటుంది. ఎక్కడెక్కడ ముట్టుకొనివ్వకూడదో సులభంగా అర్థమయ్యేలా చెప్పేయొచ్చని అంటున్నారు నిపుణులు. పెదాలపై ముద్దు, ఛాతీ, పిరుదులు, తొడ లోపలిభాగం, జననేంద్రియాలు టచ్ చేయడం నిషిద్ధం అని ముందుగానే చెప్పాలి. స్నానం చేసేటప్పుడు, శుభ్రపరిచేటప్పుడు, వైద్యుడు పరీక్షించేటప్పుడు తప్ప ఇంకెప్పుడూ ఏ సందర్భంలోనూ అక్కడ ముట్టాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఆటవిడుపుగా లేదా ఆటపట్టించటానికి అన్నట్లుగా తల్లిదండ్రులేకాదు, ఇంకెవరూ కూడా జననేంద్రియాలు ముట్టకూడదని మానసిక నిపుణులు చెప్తున్నారు.

గుర్రపు బండి ఎక్కించుకోవడం, గుండెల మీద పడుకోబెట్టుకొని ఆడించడం, ప్రేమగా దగ్గరకు తీసుకోవడం చేయడం ద్వారా పిల్లలతో బంధాన్ని బలపరుస్తాయి. ప్రేమ మీద నమ్మకాన్ని పెంచుతాయి. వాళ్లు అసౌకర్యంగా, అశాంతిగా ఉన్నప్పుడు తల్లిదండ్రుల దగ్గర శాంతంగా ఉంటుందనే భావనను కలిగిస్తాయి. సాధారణంగా అమ్మమ్మ తాతయ్య, నానమ్మ తాతయ్య లాంటి పెద్దలు బుగ్గలు గిల్లడం, చెవులు లాగడం చేస్తుంటారు. అది ఆప్యాయతతోనే అయినా కొందరు పిల్లలు ఇష్టపడితే.. మరికొందరు చిరాకు పడుతారు. అలాంటప్పుడు వారిని గమనించి నడుచుకోవాలి. అయితే ఇంకొందరు అసూయ, కామంతో గేలి చేసేందుకు పిల్లలను తాకుతుంటారు. ఇలాంటి వారిని కచ్చితంగా అడ్డుకోవాలి. వార్నింగ్ ఇవ్వాలి. అలాంటప్పుడు పిల్లలు తమకు ఏది జరగకుండా మా తల్లిదండ్రులు ఉన్నారనే భరోసాతో ఉంటారు. అలాంటి ఘటనలు జరిగినప్పుడుఅది తప్పు అని వారికి అర్థమవుతుంది. మీ దృష్టికి తీసుకువస్తారు.

అయితే కొందరు తల్లిదండ్రులు బాల్యంలో పిల్లలకు అన్నీ సమకూర్చిన ప్రేమను మాత్రం అందించరు. ప్రేమతో కూడిన స్పర్శ, కౌగిలి, అభినందన ఇవ్వలేరు. ఇక మరోవైపు పక్కింటి, ఎదురింటి వ్యక్తుల బ్యాడ్ టచ్ తో బాధపడే పిల్లలు చాలా మందే ఉన్నారు. ఏళ్లుగా ఈ బాధను అనుభవిస్తున్నా ఇంట్లో చెప్పలేని పరిస్థితుల్లో చిక్కుకుపోతున్నారు. ఈ కారణంగా మానవ సంబంధాలపై విశ్వాసాన్ని కోల్పోతున్నారు. మరొకరితో బంధాన్ని ఏర్పరుచుకునేందుకు జంకుతున్నారు. ముఖ్యంగా పెళ్లి తర్వాత భాగస్వామితో కనెక్ట్ కాలేకపోతున్నారు.

నిజానికి సెక్యువల్ అబ్యూజ్ ఎదుర్కోని వారు లైంగికంగా వేధించబడిన వారి బాధలను దాదాపుగా అర్థం చేసుకోలేరనే అంటున్నారు మానసిక నిపుణులు. పెద్దలు చెప్పినట్లు ఒకరి బాధ మనం అనుభవించినప్పుడు మాత్రమే తెలుస్తుంది. అప్పటి వరకు ఆ బాధతో ఎంత విలవిలలాడినా మనం ప్రేక్షకపాత్ర వహిస్తాం తప్ప ఏం చేయలేం. ఏదేమైనా పుట్టి పెరుగుతున్న ఇల్లు, బడి, గుడి, వీధి.. ఇలా అన్ని చోట్లా ప్రమాదం పొంచి ఉంది. పిల్లల జాగ్రత్త తప్పనిసరి.

Advertisement

Next Story

Most Viewed