నెట్‌లో మీరేం చేస్తున్నారో మాకు తెలుసు.. 24 గంటల్లో అరెస్ట్ వారెంట్ జారీ చేస్తాం!

by sudharani |
నెట్‌లో మీరేం చేస్తున్నారో మాకు తెలుసు.. 24 గంటల్లో అరెస్ట్ వారెంట్ జారీ చేస్తాం!
X

దిశ, ఫీచర్స్: టెక్నాలజీ డెవలప్ అవుతుండటంతో ప్రతీ ఒక్కరు స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో బతికేస్తున్నారు. తిండి దగ్గర నుంచి వేసుకునే బట్టల వరకు ప్రతి వస్తువు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటుంది. అయితే.. స్మార్ట్ ఫోన్‌లను అవసరాలకు ఉపయోగించుకున్నంత వరకు బాగానే ఉంటుంది. హద్దు దాటితే మాత్రం సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నట్లే. ఇప్పటికే సైబర్ నేరగాళ్లు టెక్నాలజీని ఉపయోగించుకుని అనేక మందిని మోసం చేస్తున్నారు. ఇప్పుడు వీరు కొత్త టెక్నిక్‌ను షురూ చేస్తున్నారు. అదేంటంటే?

చాలా మంది స్మార్ట్ ఫోన్స్‌లో అశ్లీల వెబ్‌సైట్‌లను చూస్తుంటారు. అయితే.. ఇప్పుడు ఇదే క్యాష్ చేసుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. అదేలా అనుకుంటున్నారా? స్మార్ట్ ఫోన్స్ చేతికొచ్చాక వయోభేదం లేకుండా ఎవరు పడితే వాళ్లు అశ్లీల వెబ్‌సైట్స్ ఓపెన్ చేసి చూస్తున్నారు. ఈ విషయాన్ని ఎవరి తెలియకుండా సీక్రెట్‌గా ఉంచుకోవాలి అనుకుంటారు. ఇలాంటి సమయంలోనే వాళ్లకు ఓ మెసేజ్ వస్తుంది. ‘మీ ఐపీ అడ్రస్‌తో.. మీరు ఇప్పుడు ఫోన్‌లో ఏం చూస్తున్నారో, చేస్తున్నారో మాకు తెలుసు’ అంటూ సైబర్ క్రైమ్ పోలీసుల పేరిట వాట్సప్ నంబర్, ఈ-మెయిల్‌కు హెచ్చరికలు వస్తాయి. ఢిల్లీ, ముంబయి సైబర్ క్రైమ్ పోలీసులమంటూ బెదిరిస్తారు. అంతే కాకుండా బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, స్టేట్ సైబర్ సెల్, ఇంటెలిజెన్స్ బ్యూరో అంటూ రంగంలోకి దిగి భయపెడతారు. తమ రీసెర్చ్‌లో మీరు అశ్లీల వీడియోలు చూస్తున్నట్లు గుర్తించాము. దీనికి 24 గంటల్లో సమాధానం రాకుంటే అరెస్ట్ వారెంట్ జారీ చేస్తామంటూ బెదిరిస్తారు. అంతే కాకుండా స్థానిక పోలీసులు అరెస్ట్ చేసేలా ఆదేశాలిస్తామంటారు. దీంతో ఇదంతా నిజమని నమ్మిన బాధితులు అడిగిన సొమ్ము మాయగాళ్ల బ్యాంకు ఖాతాల్లో జమచేసి మోసపోతున్నారు.

అయితే.. నగర సైబర్ క్రైమ్ పోలీసులకు రోజూ ఇలాంటివి 10 ఫిర్యాదులు అందుతున్నాయి. సీబీఐ, ఈడీ, ఎన్ఐఏ, కస్టమ్స్ విభాగాల అధికారులమంటూ భయపెట్టి బెదిరించి రూ. లక్షలు వసూలు చేశారంటూ వచ్చే బాధితులే ఎక్కువగా ఉంటున్నారని పోలీసులు తెలుపుతున్నారు. అంతే కాకుండా.. రాష్ట్ర, కేంద్ర నిఘా, దర్యాప్తు విభాగాలు నోలీసులు జారీ చేయడం.. వీడియోకాల్ ద్వారా విచారణ జరపటం లాంటివి చేయమని.. ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు.

Advertisement

Next Story