Nightlife destinations : రాత్రిళ్లు.. సందళ్లు..!! సరదాలు, సంతోషాలకు నెలవైన ‘Night Life’ నగరాలు

by Javid Pasha |   ( Updated:2024-11-10 14:49:25.0  )
Nightlife destinations : రాత్రిళ్లు.. సందళ్లు..!! సరదాలు, సంతోషాలకు నెలవైన ‘Night Life’ నగరాలు
X

దిశ, ఫీచర్స్ : లైఫ్ రొటీన్ అయి పోయిందని బోర్ ఫీల్ అవుతున్నారా?, పగటివేళ పనిలో నిమగ్నమై బయటి ప్రపంచానికి దూరమౌతున్నామని భావిస్తున్నారా?.. ఏం పర్లేదు!. ఇలాంటి వారికోసం ‘నైట్ లైఫ్ డెస్టినేషన్స్’ కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు. ఒకప్పటిలా ఇప్పుడు డే టైమ్ మాత్రమే వర్క్ చేసుకొని, రాత్రి కాగానే కునుకు తీసే జీవనశైలి నగర జీవితంలో దాదాపు కనుమరుగైయింది. ఇక్కడ రాత్రింబవళ్లు తేడా లేకుండా ప్రజలు తమ తమ పనుల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, రోజువారీ కార్యక్రమాల్లో మునిగిపోతుంటారు. సంతోషాలు, సరదాలు, షాపింగ్‌లు, సంబురాల్లో లీనమైపోతుంటారు. అలా రాత్రిపూట జీవితాన్ని ఎంజాయ్ చేయగల భారత దేశంలో ప్రముఖ నగరాలేవో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇసుక బీచ్‌లు, రెస్టారెంట్లు

రాత్రిపూట లైఫ్ ఎంజాయ్ చేయాలనుకునే వారికి ప్రస్తుతం మన దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం గోవా చక్కటి వేదికగా ఉందంటున్నారు నిపుణులు. ఇక్కడ సూర్యాస్తమయం తర్వాత మిరుమిట్లు గొలిపే లైట్ల వెలుతురులో రాత్రి జీవితం మస్తు జాయ్ ఫుల్‌గా ఉంటుంది. అలాగే ఇసుక బీచ్‌లో వెన్నెల రాత్రిని, చల్లని గాలిని కూడా ఆస్వాదించవచ్చు. ఆనందంగా, ఆహ్లాదంగా గడపవచ్చు. ఇక్కడ నైట్‌లో జరిగే ప్రత్యేక సంగీత కచేరీలు, ఫన్ ఫెస్టివల్స్ ఆకట్టుకుంటాయి. రాత్రి నుంచి తెల్లవారే వరకు ఘుమ ఘుమలాడే రుచులను అందించే హోటళ్లు, రెస్టారెంట్లు తెరిచే ఉంటాయి. మొత్తానికి నైట్ లైఫ్ ఎంజాయ్‌ మెంట్ అంటే గోవానే అన్నట్లు ఉంటుంది.

అలసిన మనసుకు ఆహ్లాదం

రోజంతా బిజీ షెడ్యూల్, ఓ వైపు ఉద్యోగాలు, వ్యాపారాలు, మరో వైపు రకరకాల బాధ్యతలు, సమస్యలతో సతమతం అవుతుంటారు కొందరు. పగలు ఎలాగూ సమయం దొరకదు. కాబట్టి రాత్రి పూటనైనా కాస్త రిలాక్స్‌గా ఉండాలని భావిస్తుంటారు. ఇలాంటి అవకాశం ఉన్న చక్కటి నగరమే మన దేశంలోని ముంబై. ఇక్కడి ప్రజలు పగటి వేళకంటే రాత్రి జీవితాన్ని మస్తు ఎంజాయ్ చేస్తారు. ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి కూడా ముంబైలో రాత్రిపూట తిరిగి సరదాగా గడిపి రావాలనే ఉద్దేశంతో పర్యాటకులు వస్తుంటారు. అందుకే ‘సిటీ దట్ నెవర్ స్లీప్’ అంటుంటారు ముంబైని. తెల్లార్లు తెరిచి ఉంచే బార్లు, క్లబ్‌లు జన సందోహంతో సందడిగా ఉంటాయి. ఇక్కడి సముద్రంలో ‘మెరైన్ డ్రైవ్’ మధురానుభూతిని కలిగిస్తుంది. అలాగే సముద్ర తీరంలో రాత్రిళ్లు విహరిస్తూ అలలను తిలకిస్తూ, ప్రకృతిని ఆస్వాదించవచ్చు.

సంగీతం, సరదా.. కేరాఫ్ ఢిల్లీ

సంగీతమంటే మనసు దోచే మధుర గానమే కాదు, కనువిందు చేసే కచేరీల మాధుర్యం కూడా. పగటి వేళకంటే రాత్రివేళ సంగీత కార్యక్రమాలు చాలా ఆకర్షణీయంగా, ఆనంద భరితంగా ఉంటాయి. అలాంటి అవకాశాలకు అనువైన నగరంగా ఢిల్లీ ప్రసిద్ధి చెందింది. ఇక్కడి ప్రజలు రాత్రిపూట మ్యూజిక్ ఈవెంట్లకు ప్రయారిటీ ఇవ్వాలనుకుంటారు. ఢిల్లీలోని అనేక వీధులు రాత్రిళ్లు కూల్ మ్యూజిక్ డెస్టినేషన్స్‌కు ప్రసిద్ధి చెందాయి. జాజ్ నుంచి రాక్ వరకు ఇక్కడి హౌజ్ ఖాస్ (Hauz Khas), కన్నాట్ ప్లేస్, ఖాన్ మార్కెట్( Khan market) రాత్రివేళ జీవితాన్ని ఆదనందమయం చేస్తాయి. ఉర్రూతలూగించే సంగీత కచేరీలే కాకుండా, ఆహ్లాద భరిత మ్యూజిక్ ఈవెంట్లు కూడా ఆకట్టుకుంటాయి. కాబట్టి ప్రజలు తమకు నచ్చిన వాటిని ఆస్వాదించడానికి రాత్రిళ్లు ఇక్కడికి వస్తారు. ఇక ఉత్తర ఢిల్లీలోని ఢిల్లీ యూనివర్సిటీ క్యాంపస్ అయితే ప్రపంచంలోనే అత్యుత్తమ, అతి పెద్ద క్యాంపస్‌లలో ఒకటి. రాత్రిపూట ఇక్కడ జరిగే సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు చూసేందుకు జనాలు బారులు తీరుతుంటారు

నైట్ షాపింగ్‌కు ఫేమస్ హైదరాబాద్‌

చాలా మందికి తెలుసో లేదో కానీ మన దేశంలోని నైట్ లైఫ్ డెస్టినేషన్ నగరాల్లో హైదరాబాద్ కూడా ప్రముఖమైంది. ముఖ్యంగా చార్మినార్, బేగం బజార్ నైట్ షాపింగ్‌లకు ప్రసిద్ధి. ఇతర అనేక ప్రాంతాల్లో నైట్ క్లబ్‌లు, సంగీత కచేరీలు, లైవ్ మ్యూజిక్ షోలు కొనసాగుతుంటాయి. బేంగంపేట, బంజారాహిల్స్, సోమాజి గూడ వంటి ఏరియాలు రాత్రిపూట జరుపుకునే పార్టీలు, ఫంక్షన్లకు హాట్ స్పాట్‌గా ఉంటున్నాయి. గచ్చి బౌలి, గోల్కొండ కోట కూడా రాత్రిళ్లు లైవ్ మ్యూజిక్ షోలతో, సంగీత కచేరీలతో ఆకట్టుకుంటాయి. లైట్ అండ్ సౌండ్ షోలు, ఆకట్టుకునే వాయిస్ ఓవర్‌లు మధురానుభూతిని కలిగిస్తాయి.

ఆర్ట్ గ్యాలరీల ఫన్ సిటీ కొల్‌కతా

రాత్రిపూట సరదాగా, సంతోషంగా గడపాలనుకునే వారికి కొల్ కతా కూడా మంచి డెస్టినేషన్. పైగా ఇదొక భిన్నమైన ఫన్ సిటీగా పేర్కొంటారు. ఇక్కడ అనేక బార్లు, పబ్బులు, క్లబ్బులు రాత్రిళ్లు తెరిచే ఉంటాయి. సాంస్కృతి వేడుకలు, పార్టీలు, ఫంక్షన్లు జరుగుతుంటాయి. ముఖ్యంగా కోల్ కతాలోని ఆర్ట్ గ్యాలరీలు, ఆర్ట్ థియేటర్లు రాత్రిళ్లు కూడా సందడిగా ఉంటాయి. రాత్రిళ్లు షాపింగ్ చేయడం కూడా ఇక్కడ మధురానుభూతినిస్తుంది. కాబట్టి చాలామంది నైట్ లైఫ్ డెస్టినేసన్ నగరంగా కొల్ కతాను ఇష్టపడతారు.

నైట్ క్లబ్బులకు ప్రసిద్ధి బెంగుళూరు

ఆహ్లాదకరమైన వాతావరణం విషయానికి వస్తే బెంగుళూరు అంత మంచి స్పాట్ కాకపోవచ్చు. ఇక్కడి అసౌకర్య వాతావరణం మానసిక స్థితిపై ప్రభావం చూపుతుందని కూడా అంటారు. కానీ నైట్ లైఫ్ ఎంజాయ్ చేయాలనుకునే వారికి అనేక ప్రాంతాలు అనువుగా ఉంటాయి. నైట్ క్లబ్‌లు, రెస్టారెంట్లు సందడిగా ఉంటాయి. ఇక బెంగుళూరులోని ‘మైక్రో బ్రూవరీ - హోపింగ్’ ఏరియా అయితే యువతీ యువకులతో రాత్రిళ్లు సందడిగా కనిపిస్తుందట. అందుకే ప్రజలు రాత్రిళ్లు మేల్కొని ఇక్కడి పరిసరాలను ఎంజాయ్ చేస్తుంటారు.

Advertisement

Next Story