Health tips :నోరు ఇన్ని అనారోగ్యసమస్యల గురించి చెప్తుందా?

by samatah |   ( Updated:2022-09-09 09:17:26.0  )
Health tips :నోరు ఇన్ని అనారోగ్యసమస్యల గురించి చెప్తుందా?
X

దిశ, ఫీచర్స్ : నోటి ఆరోగ్యం అంటే దంత పరిశుభ్రతకే పరిమితమనేది చాలామంది భావన. కానీ నోరు ఇతర ఆరోగ్య సమస్యల గురించి చాలా చెప్పగలదు. సంభావ్య తీవ్రమైన పరిస్థితులను ముందస్తుగా గుర్తించడంలో సాయపడుతుంది. ఒకరి శ్వాస వాసన నుంచి నాలుక రంగు, చిగుళ్ల స్థితి వరకు మొత్తం ఆరోగ్యానికి సంబంధించిన సంకేతాల శ్రేణి నోటిలోనే దాగుంటుంది. ఈ మౌత్ సిగ్నల్స్ నుంచి ఆయా ఆరోగ్య పరిస్థితులు ఎంత త్వరగా గుర్తించబడితే వాటి నిర్వహణ, చికిత్స అంత సులభమవుతుంది. ఆ లక్షణాలేంటో చూద్దాం.

* చిగుళ్లలో రక్తస్రావం

బ్రష్ చేసినప్పుడు చిగుళ్లు లేతగా మారడం లేదా రక్తస్రావమైతే అది చిగుళ్ల వ్యాధికి సంకేతం కావచ్చు. క్రమంగా ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా దారితీయొచ్చు. చిగుళ్ల వ్యాధిగ్రస్తులు గుండెపోటు లేదా స్ట్రోక్‌ను అనుభవించే అవకాశం రెండు నుంచి మూడు రెట్లు ఎక్కువని హార్వర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ధమనులు గట్టిపడటానికి, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచడానికి దారితీసే వాపు వల్ల ఇది సంభవించవచ్చు. చిగుళ్ల వాపు లేదా రక్తస్రావం కూడా విటమిన్ లోపానికి సంకేతం. మల్టీవిటమిన్, ఒమేగా-3 ఫిష్ ఆయిల్ తీసుకుంగే పోషకాహార లోపాలను సరిదిద్దుకోవచ్చు.

* నాలుక తెల్లబడటం

నాలుకపై కొద్దిగా తెల్లటి పూత ఉండటం సాధారణమే. కానీ కొన్నిసార్లు ఈ పూత ఇన్ఫెక్షన్ లేదా క్యాన్సర్ వంటి మరింత తీవ్రమైన పరిస్థితికి సంకేతం. ఇక అసాధారణమైన తెల్ల మచ్చలూ క్యాన్సర్‌ లక్షణాలే. కాబట్టి వైద్యునితో పరీక్షించుకొని వెంటనే చికిత్స తీసుకోవాలి. తెల్లటి నాలుక అనేది 'ఓరల్ లైకెన్ ప్లానస్ లేదా ఓరల్ థ్రష్, భౌగోళిక నాలుక'గా పిలువబడే ప్రమాదతీవ్రత తక్కువగల పరిస్థితికి సంకేతం. అయితే ఇది STI సిఫిలిస్‌ లక్షణం కూడా అయ్యే ప్రమాదం ఉన్నందున తీవ్రంగా పరిగణించి త్వరగా చికిత్స చేయాలి. లేదంటే తీవ్రమైన ఆరోగ్య సమస్యల శ్రేణికి దారితీస్తుంది.

* నోటి పుండ్లు

సాధారణంగా నోటి పుండ్లు హానిచేయవు. రోజులు లేదా వారాల వ్యవధిలో నయం అవుతాయి. చెంప లోపల కొరకడం, సరిగ్గా సరిపోని కట్టుడు పళ్లు, సోడియం లారిల్ సల్ఫేట్ కలిగిన టూత్‌పేస్టులు, ఫుడ్ సెన్సిటివిటీ వంటి కొన్ని తేలికపాటి సమస్యల వల్ల నోటి పుండ్లు ఏర్పడవచ్చు. అయినప్పటికీ ఇవి హార్మోన్ల మార్పులతో పాటు బి విటమిన్లు, జింక్, ఐరన్ లోపాలను కూడా సూచిస్తాయి. అంతేకాదు చేయి, పాదం, నోటి వ్యాధితో పాటు మౌత్ లైకెన్, క్రోన్స్, ఉదరకుహర వ్యాధి లేదా హెచ్‌ఐవి లేదా లూపస్ వంటి ఆరోగ్య పరిస్థితిని కలిగిన బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ వల్ల కూడా ఈ వ్యాధి సంభవించవచ్చు.

* చెడు శ్వాస

నోటి నుంచి దుర్వాసన వస్తుందంటే ఆరోగ్యంలో ఏదో లోపం ఉన్నట్లే. పేలవమైన నోటి పరిశుభ్రత లేదా ఏదైనా తినడం వల్ల తాత్కాలికంగా కలిగే నోటి దుర్వాసన కాకుండా ఈ సమస్య నిత్యం వేధిస్తుంటే అది చిగుళ్ల వ్యాధికి సంకేతం కావచ్చు. ముక్కు, సైనస్ లేదా గొంతులో వాపు కూడా నోటి దుర్వాసనకు కారణం కావచ్చు. కొన్ని క్యాన్సర్లు, జీవక్రియ రుగ్మతల వంటి పరిస్థితులు కూడా దుర్వాసనను కలిగిస్తాయి. కడుపులోని ఆమ్లాల రిఫ్లక్స్కూడా దుర్వాసనతో సంబంధం కలిగి ఉంటుంది.

* మూతి పగుళ్లు

నోటి మూలల్లో ఏర్పడే పగుళ్లు ఇనుము, జింక్ లేదా బి విటమిన్ల లోపానికి సంకేతం. ఇవి జీర్ణవ్యవస్థలో తలెత్తే సమస్యలను కూడా సూచిస్తాయి. ఇన్‌ఫ్లమేటరీ డైజెస్టివ్ డిజార్డర్స్(ఉదరకుహర వ్యాధి, క్రోన్స్ లేదా వ్రణోత్పత్తి పెద్దప్రేగు శోథ) కలిగిన వ్యక్తుల నోటి మూలల్లో పగుళ్లు కనబడతాయి. ఆహారంలో విటమిన్ కంటెంట్ పెంచడం ద్వారా ఈ పగుళ్లను నయం చేయొచ్చు. ఈ సంకేతాలు హానికరంకాని లేదా సీరియస్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా సంభవించవచ్చు కాబట్టి చెకప్ కోసం వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.

* నోటి క్యాన్సర్

పెదవులు, చిగుళ్లు, నాలుక, బుగ్గల లోపలి పొర, నోటి పైభాగం, ఉపరితలంలో ఎక్కడైనా నోటి క్యాన్సర్ డెవలప్ కావచ్చు. వదులైన దంతాలు, నయంకాని పెదవి లేదా నోటి పుండ్లు, నోటి లోపలి భాగంలో తెల్లటి లేదా ఎర్రటి పాచ్, నోటి లోపల గడ్డ లాంటి నిర్మాణం పెరుగుదల, నోటి నొప్పి, మింగడంలో ఇబ్బంది వంటివి నోటి క్యాన్సర్‌కు సంకేతాలు.

విటమిన్ లోపానికి గల ఇతర సంకేతాలు

- పెళుసైన జుట్టు, గోర్లు

- రాత్రిపూట మసక చూపు, కళ్లపై తెల్లటి పెరుగుదల

- పొలుసుల మచ్చలు, చుండ్రు

- జుట్టు రాలుట

- చర్మంపై ఎరుపు లేదా తెలుపు గడ్డలు

- రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్

వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి?

ఈ లక్షణాల్లో ఏవైనా కొన్ని వారాల కంటే ఎక్కువ కాలం ఉంటే సరైన పరీక్ష కోసం వైద్యుడిని లేదా దంతవైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. ఈ లక్షణాలు తేలికపాటిగా అనిపించి ఆందోళన కలిగించవు కానీ లోతైన ఆరోగ్య సమస్యల సంకేతాలు ఇతర ఆరోగ్య సమస్యలకు హాని కలిగిస్తాయనే వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.

ఇవి కూడా చ‌ద‌వండి : సెక్సువల్ హెల్త్ : లైంగిక ఆరోగ్యంపై అనేక రకాల అపార్థాలు

Advertisement

Next Story

Most Viewed