- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పెళ్లి ఆడంబరాలు.. అప్పుల్లోకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్.

పెళ్లంటే నూరంటే పంట అనేది ఒకప్పటి మాట..పెళ్లంటే అప్పుల తంట అనేది ఇప్పటి మాట. సమాజంలో పెరుగుతున్న వింత పోకడలకు వివాహాలు ఏ మాత్రం తీసిపోవడం లేదు. కనీవినీ ఎరుగని రీతిలో నలుగురు చెప్పుకోవాలనే ఆర్భాటంతో చేసేవారు పెరిగిపోతున్నారు. సంపన్నుల నుంచి సామాన్యుల వరకు పెళ్లి చేయడంలో ఏమాత్రం రాజీపడడం లేదు. ఎవరి స్థాయికి తగినట్లు వాళ్లు ఖర్చులు పెట్టడంలో వెనకాడడం లేదు. యువతలో కూడా పెళ్లి అంటే మూడుముళ్లు, ఏడడుగులు అనే భావన నుంచి ఫొటోషూట్, ప్రీ వెడ్డింగ్ షూట్ అనే ఆలోచన స్థాయికి నేటి పరిస్థితులు ఉన్నాయి. ఒకరిని చూసి మరొకరు పెళ్లి చేయడంలో మాకేం తక్కువ అనే ధోరణి రోజు రోజుకి పెరిపోతుంది. వెరిసి ఖర్చు తడిసిమోపెడు అవుతున్నది. ఈ ఏడాది జనవరి 30 నుంచి ఫిబ్రవరి 27 వరకు మాఘమాసం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో వివాహ వేడుకకు సంబంధించిన మార్కెట్ జోరందుకుంది. పెళ్లి అంటే రెండు మనసులను, రెండు కుటుంబాలను కలిపే ఆరంభానికి నాంది కావాలి కానీ ఆర్భాటం కాకూడదని పండితులు అభిప్రాయపడుతున్నారు..ఇలా భిన్న అభిప్రాయాలు, విభిన్న కల్చర్, ఖర్చులు సంబంధించిన అంశాలతో వివాహవేడుకపై ‘దిశ’ ప్రత్యేక కథనం. -స్వర్ణ
సర్వేల్లో ఆసక్తికర విషయాలు
గత డిసెంబర్ కొన్ని మాట్రిమోనియనల్ సైట్లు, సర్వేలు వెల్లడించిన వివరాల ప్రకారం చైనా తర్వాత ప్రపంచంలో అత్యధికంగా భారతీయులలే పెళ్లి ఖర్చులు పెడుతున్నారని కొన్ని సర్వేలు వెల్లడించాయి. మన దేశంలో వివాహలపై ఏటా సుమారుగా పది లక్షల కోట్ల వ్యాపారం జరుగుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏటేటా పెళ్లిళ్ల ఖర్చు పెరుగుతుందని, 2024 లో వివాహానికి సగటున 36.5 లక్షలు ఖర్చు పెట్టినట్లు ఇటీవల వెడ్ మి గుడ్ సర్వే వెల్లడించింది. ఇందులో భాగంగా 2024 ఎప్రిల్ నుంచి 2025 మార్చిలో పెళ్లి చేసుకున్న, చేసుకోబోయే జంటలపై ఈ సంస్థ నిర్వహించిన సర్వేలో పలు అంశాలు వెల్లడించింది. అందులో భాగంగానే డెస్టినేషన్ వెడ్డింగ్ కు సుమారుగా 51.1 లక్షలు ఖర్చు పెట్టినట్లు తెలిపింది.
ఉత్తరాది ప్రభావం
గత కొంతకాలంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఉత్తరాది మ్యారేజ్ కల్చర్ ట్రెండ్ గా మారింది. హల్దీ , సంగీత్, మెహందీ వేడుకలకు భారీ మొత్తంలో ఖర్చు పెడుతున్నారు. సోషల్ మీడియా ప్రభావమో, ఆధునికత ప్రభావమో ఏదేమైనా పెళ్లిళ్లు వినూత్న రీతిలో జరుపుకోవడానికి మొగ్గుచూపుతున్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లల ఇష్టాలను కాదనలేక ఖర్చుకు వెనకాడకుండా పెళ్లి్ జరిపిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి
ఒకప్పుడు పెళ్లిచేసి చూడు, ఇల్లు కట్టిచూడు అన్న నానుడి ప్రకారం రెండూ వ్యయంతో కూడుకున్నవే. అయితే ఇల్లు స్థిరాస్థిలో భాగం కాగా, పెళ్లి ఖర్చు సామాన్యులకు గుదిబండలా మారుతుంది. సగటున ఒక పెళ్లికి సుమారుగా ఖర్చులను లెక్కిస్తే ఫంక్షన్ హాల్ మొదలుకుని ప్రతీ ఒక్కటి మనీతో ముడిపడినవే. ఇటీవల కాలంలో దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన కుటుంబాలు కూడా ప్రీ వెడ్డింగ్ షూట్స్ కోసం దాదాపు 2 లక్షల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
- ఫంక్షన్ హాల్ ఖర్చు: రూ.50 వేల నుంచి రూ.50 లక్షలు
- వేదిక అలంకరణ: రూ.20 వేల నుంచి రూ.20 లక్షలు
- ఫొటో, వీడియో చిత్రీకరణ: రూ.3 నుంచి రూ.6 లక్షలు
- భోజనం ప్లేట్ ఖరీదు: రూ.వెయ్యి నుంచి రూ.5 వేల వరకు
- డెకరేషన్: రూ.70 వేల నుంచి రూ.30 లక్షల వరకు
- వెడ్డింగ్ కార్డులు: రూ.50 నుంచి రూ.100 వరకు
- సంగీత్, మెహందీ కొరియోగ్రాఫర్లు: రూ.20 వేల నుంచి రూ.3 లక్షల వరకు
- మేకప్ ఆర్టిస్టులు: రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు
- (ఇంకా పెళ్లిదుస్తులు, ఆభరణాలు వంటి ఖర్చులు మాటల్లో చెప్పలేం. లక్షల్లో ఉంటుంది.)
నిపుణుల సలహా
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కీలకమైన ఘట్టం వివాహానికి సిద్ధమయ్యే వారు దానికి కావలసిన ఆర్థిక ప్రణాళికను సరైన రీతిలో ప్లాన్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పెళ్లి అనేక ఖర్చులతో ముడిపడిన అంశం కాబట్టి దీని కోసం ఖర్చు చేసేటప్పుడు ఆర్థిక క్రమశిక్షణ పాటించడం ముఖ్యమని చెబుతున్నారు. కొందరు ఆర్భాటాలకు పోకుండా పరిమిత సంఖ్యలో అతిథులను పిలిచి వివాహవేడుక జరిపిస్తుండటం విశేషం.
ఆన్‌లైన్‌లో వెతుకుతున్నారు
పెళ్లికి సంబంధించిన మధుర క్షణాలు కలకాలం గుర్తుండి పోవాలని యువత తపన పడుతున్నారు. ఇందుకు వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్లు, ప్రీవెడ్డింగ్ షూట్లు, అద్దెకు డ్రెసెస్, వెడ్డింగ్ కార్డ్స్, కన్వెన్షన్, బాంక్వెట్ హాల్, వెడ్డింగ్ ప్లాన్లర్స్, ఆర్కెస్ట్రా, మేకప్ ఆర్టిస్టులు, తదితర సేవల గురించి ఆన్లైన్‌లో వెతుకుతున్నారు. గ్రాండ్ వెడ్డింగ్‌కే జనం ఆసక్తి చూపుతున్నారని సెర్చ్ ఇంజిన్ సంస్థ జస్ట్ డయల్ వెల్లడించింది. ఈ ట్రెండ్ ఎక్కవగా మెట్రో సిటీల్లో కనిపిస్తుందని గత ఏడాది జనవరి నుంచి నవంబర్ వరకు దేశంలో పెళ్లి పనులపై రీసెర్చ్ చేసిన నివేదికలోని పేర్కొంది. ఈ సంఖ్య మెట్రో నగరాల్లో 34 శాతం ఉండగా, హైదరాబాద్లో 41 శాతం ఉందని పేర్కొంది. 2023 తో పోల్చితే 2024 లో 21 శాతం మంది విలాసవంతమైన సేవల గురించి ఆన్‌లైన్‌లో వెతికే వారి సంఖ్య పెరిగినట్లు తెలిపింది.
ఖర్చుల తగ్గించుకోవడం ఎలా
వ్యక్తులు వివాహ విషయంలో అనేక ప్రభావాలకు గురవుతారు. కొన్ని సార్లు అనుకున్న దానికంటే ఖర్చులు ఎక్కువవుతాయి. అందుకే అత్యంత ప్రాధాన్యత కలిగిన ఖర్చులను నోట్ చేసుకుని దానికి అనుగుణంగా బడ్జెట్ సిద్ధం చేసుకోవాలి. బ్యాంకుల నుంచి పరిమితికి మించి పర్సనల్ లోన్లు తీసుకుని ఇబ్బంది పడే కంటే అవసరం మేరకే తీసుకోవాలి. పెళ్లిలో కీలక పాత్ర పోషించే షాపింగ్ విషయంలో కూడా ముందే ప్లానింగ్ చేసుకుని కొనుగోళ్లు ప్రారంభించాలి. క్రెడిట్ కార్డు వాడుతూ షాపింగ్ చేయడం వల్ల ఖర్చు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త వహించాలి. భారతీయ వివాహ వేడుకల్లో బంగారానికి ఎనలేని పాత్ర ఉంటుంది. పెద్దమొత్తంలో బంగారం కోనుగోలు చేయడం వీలుకాని కుటుంబాలకు పెళ్లికి కొంత సమయం ముందు నుంచే కొద్ది కొద్దిగా కొనుగోలు చేయడం వల్ల పెళ్లి సమయంలో ఖర్చు విషయంలో ఒత్తిడి తగ్గే అవకాశం ఉంటుంది.