- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
First Pan India Heroine.. మా నీలమ్మకు పద్మ శ్రీ.!
సాయుధ పోరాటం తర్వాత కూడా..
భూమి కోసం..
భుక్తి కోసం..
బానిసత్వ విముక్తి కోసం పోరాటం జరిగింది.
దీనికొక దృశ్యరూపం ఇస్తే..?
అదే ఒక ఊరికథ.!
ప్రజల జీవన స్థితిగతులు.. సామాజికాంశాలే ఆ కథకు ప్రేరణ.
ఆ సినిమాలో హీరోయిన్ మమతా శంకర్.
ఇప్పుడామె మన స్టోరీలోకి ఎందుకు ఎంటరయిందంటే..
లెట్స్ ఫాలో..!!
సాయుధ పోరాటం తర్వాత ప్రజల జీవన స్థితిగతులు ఎలా ఉన్నాయనే అంశంపై మృణాళ్ సేన్ ఒక ఊరి కథ సినిమాను రూపొందించారు. హీరో నారాయణరావు.. హీరోయిన్ మమతా శంకర్. 1976లో మృగయ అనే బెంగాలీ సినిమాతో మమత తెరంగేట్రం చేశారు. ఒక ఊరి కథ ఆమెకు రెండో సినిమా. ఆ ఊరితో మమతా శంకర్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. మమతా శంకర్‌కు పద్మ శ్రీ వస్తే "మా నీలమ్మకు వచ్చిందని" సంతోషపడుతున్నారు గ్రామస్తులు.
పాన్ ఇండియా స్టార్..
అది 1977. రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలో మారుమూల గ్రామం చీదేడ్. కూలీనాలీ చేసుకునే ప్రజలు నవంబర్ 16న ఎడ్లబండ్లు ఎగేసుకొని పట్నంబాట పట్టారు. సినిమా థియేటర్ దగ్గర వీరి బండ్లు ఆగాయి. డైరెక్టరే ఎదురెళ్లి స్వాగతం పలికారు. ఆ సినిమానే ఒక ఊరి కథ. చీదేడ్ గ్రామంలోనే ఈ సినిమాను తీశారు. మూడు నాలుగు ప్రధాన పాత్రలు మినహా మిగతా యాక్టర్లంతా చీదేడ్ గ్రామస్తులే. పాన్ ఇండియా సినిమాలని ఇప్పుడు చెప్పుకుంటున్నారు కదా.? ఒక ఊరి కథ అప్పట్లోనే పాన్ ఇండియా సినిమా. మమతా శంకర్ అప్పట్లోనే పాన్ ఇండియా స్టార్. 4వ హాంకాంగ్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో భారతీయ ఎంట్రీలలో ఒక ఊరి కథ సినిమా కూడా ఉంది.
ఆడదిక్కు కోసం..
ఎంట్రీ సీన్ ఊరగంట గుట్ట దగ్గర. గుడిసెలో నుంచి బయటకొచ్చిన వెంకయ్య (ఎంవీ వాసుదేవ రావు) గోడకు వీపువాలుస్తాడు. డొక్కలో పిసుకుతుంటే చుట్ట అంటించుకుంటాడు. గుడిసెలో నుంచి "అయ్యా ఓ అయ్యా.. ఇయ్యాలేం చేద్దామయ్యా" అని కేకలు. ఆకలితో కూడిన కోపం తన్నుకొచ్చి "నిన్న ఏం చేసినం" అని అడుగుతాడు. "ఉపాసమున్నం కదా" అంటాడు కిష్టయ్య (జీవీ నారాయణ రావు). "ఐతే ఇయ్యాలగూడ అదే" అని బాధతో చెప్తాడు వెంకయ్య. "ఆకలిని తట్టుకొని డొక్కలు ఎండబెట్టుకోవడం కాదు.. తెలివిగా ఆలోచించి బతకాలని చెప్పే ఆడదిక్కు లేకపాయెగారా దేవుడా" అని వెంకయ్య లోలోపల మస్తు బాధపడతాడు. కొడుక్కి పెండ్లి చేయాలనే ఆలోచనలో పడతాడు.
కిష్టయ్యతో లగ్గం..
"పేదొళ్లు భూస్వాముల కోసం పనిచేసే మూర్ఖులు" అనే భావన వెంకయ్యది. పని చేయకపోతే పూట గడవదని మాత్రమే పనికెళ్తాడు. కొడుకు కిష్టయ్య పెండ్లీడుకొచ్చాడు. ఓ ఇంటివాణ్ని చేయాలని ఈసారి గట్టిగా డిసైడ్ అయ్యాడు. కానీ "భార్యను పోషిస్తాడా" అనే దిగులు. తప్పనిసరి పరిస్థితుల్లో నీలమ్మ (మమతా శంకర్)తో పెండ్లి జరిపిస్తాడు. పెండ్లి చూపులు చింతకాయల నర్సింహ గుడిసెలోక జరుగుతాయి. చుట్టాలకు.. చూడొచ్చినొళ్లకు మంచి దావతియ్యాలె అనుకుంటాడు. మోర సాయన్న ఇంటికాడ కల్లు దావతిచ్చి అందర్నీ సంతోషపెడతాడు. "తాగినోడు తాగిపాయె.. తిన్నోడు లేచిపాయె" అని కల్లు సోపతిగా నటించిన తోడె అడివయ్యతో అంటాడు వెంకయ్య.
మెట్టినింటి బాగు కోసం..
నీలమ్మ ఇల్లు రంగాపూర్‌లో. గ్రామస్తులంతా ఎడ్లబండ్లమీద వెళ్లి.. అక్కడి నుంచి రాచకొండకు వెళ్తారు. రాచకొండ పట్టణంలోని రాతి తోరణాలే కల్యాణ మండపాలు. పెండ్లి తర్వాత ఎలుగుబండ బోడు దగ్గర నీలమ్మ.. కిష్టయ్యల మధ్య ఒక రొమాన్స్ సీన్ ఉంటుంది. పెండ్లయితే అయ్యిందిగానీ దమ్మిడీ ఆదాయం లేని పరిస్థితి. చేస్తే జమీందార్ దగ్గర కూలీ చేయాలి. లేకపోతే పస్తులుండాలి. మరి "భార్యనైతే పస్తులుంచలేను కదా" అనే ఆలోచనతో కిష్టయ్య గడ్డమల్లయ్యగూడలోని మామిడితోటలో దొంగతనం చేస్తాడు. నీలమ్మ మస్తు బాధపడుతుంది. "ఇందుకేనా నిన్ను పెండ్లి చేసుకున్నదీ.. ఇట్లయితే మనం బతికేదెట్లా" అని కిష్టయ్య మనసు మార్చే ప్రయత్నం చేస్తుంది.
కిష్టయ్యా కష్టాలేల.?
కూలీలంతా ఊరెనక బోడుకు మట్టి పోస్తుంటారు. జమీందార్ భద్రయ్య మెప్పుకోసం కూలీలపై కోపంగా ఉంటాడు షేర్దార్. ఇంతలో ఓ చెట్టు చాటు నుంచి పొగలు వస్తుంటాయి. "ఏయ్ ఎవడ్రా అదీ.. బైటికి రా.. లేకపోతే చంపేస్తా" అని బెదిరిస్తాడు. చేతులు కట్టుకొని.. ముఖం నేలకేసి వణుక్కుంటూ వస్తాడు కిష్టయ్య. "హమ్మా కిష్టిగా.. నీకు కూలీ పైసలు ఇస్తే సూడు ఇగ" అని వెళ్లిపోతాడు. వారం బట్వాడా గడ్డమల్లయ్యగూడ గడి దగ్గర ఇస్తుంటారు. "అరేయ్.. ఈ ఎంకనికీ.. వాని కొడుక్కీ సగం కూలే ఇయ్యండ్రా" అంటాడు షేర్దార్. "అయ్యా తప్పయిందయ్యా" అని కాళ్లు పట్టుకున్నా తన్నేసి వెళ్లాడు. "ఇలాంటి కష్టాలు కొని తెచ్చుకోవడమెందుకు కిష్టయ్యా" అని భర్తకు అర్థమయ్యేలా చెప్తుంది నీలమ్మ.
ఇల్లాలు తెచ్చిన మార్పు..
కిష్టయ్యమీద మరోసారి దొంగతనం నెపాన్ని వేస్తారు. "కిష్టిగాన్ని బొడ్రాయి కాడికి పిలిపించి శిక్షిద్దాం" అని ఆదేశిస్తాడు భద్రారెడ్డి దొర. తెలంగాణ సాయుధ పోరాటంలో కీలకంగా పనిచేసిన కాచం కృష్ణమూర్తి తీర్పు చెప్పే పెద్దమనిషి పాత్రలో నటించారు. ఎంత శిక్షించినా కిష్టయ్య నేరం ఒప్పుకోడు. దీంతో వెంకయ్య ఆవేదనతో "గోచీ పోయింది.. గొంగడి పోయింది.. ఇప్పుడే చేస్తరో చేస్కోన్రీ" అంటూ జమీందార్ తీర్పును ఎదురిస్తాడు వెంకయ్య. ప్రజల్లో ఆందోళన మొదలై జమీందారులో అలజడి షురూ అవుతుంది. ఈ రకమైన చైతన్యం రావడానికి నీలమ్మనే కారణం. భర్త, మామను మార్చుదామని ఆమె చేసిన ప్రయత్నమే క్రమంగా ఊరుపై ప్రభావం చూపించింది.
అయ్యో నీలమ్మా..
కిష్టయ్య గింజెల కోసం వెళ్తాడు. భర్త వచ్చేసరికి పిడికెలు తీసుకొద్దామని నీలమ్మ కటికె కౌశీబాయి ఇంటికి వెళ్లింది. ఐతే నీలమ్మ మీదకూడా దొంగతనం ఆరోపణ వస్తుంది. పంచాయతీ పెడతారు. బోటిమీది ఎల్లమ్మ, గునుకుల ఆగమ్మ, డబ్బీకార్ జంగమ్మ ఆమెకు భాసటగా నిలుస్తారు. కోడలిపై కూడా దొంగతనం నింద వేశారని ఆవేదనకు గురయిన వెంకయ్య "పేద ప్రజలు ఎద్దులెక్క చేసిచేసి చస్తారు.. మోసగాడు ప్రజలనెంతో మేసిమేసి బలుస్తాడ్రా" అని కిష్టయ్యతో అంటాడు. నీలమ్మ నిండు గర్భిణి. ఊర్లో వైద్య సౌకర్యం లేదు. జమీందార్ ఆదేశిస్తేనే ఏదైనా. దిక్కుతోచని స్థితిలో లోయపల్లి దొరసాని మర్రి దగ్గర మంత్రసాని దగ్గరికి తీసుకెళ్తారు. బిడ్డ పుడతాడు. కానీ పాపం.. నీలమ్మ చనిపోతుంది. శుభం కార్డు పడుతుంది.
నృత్య కళాకారిణి
ఒక ఊరికథ సినిమాకు మమతా శంకరే డబ్బింగ్ చెప్పాలని ప్రయత్నం చేశారు. కానీ మాండలికం సరిగ్గా పలకరాకపోవడంత ఫటాఫట్ జయలక్ష్మితో డబ్బింగ్ చెప్పించారు. కమర్షియల్ చిత్రాల్లో కాకుండా వాస్తవికతకు దగ్గరగా ఉండే సినిమాల్లోనే ఆమె నటించారు. తర్వాత నృత్యానికే జీవితాన్ని అంకితం చేశారు. 70 ఏళ్ల వయసులో ప్రస్తుతం కోల్‌కతాలోని తన కుమారుడి దగ్గర ఉంటున్నారు.
మా నీలమ్మకే: మోర యాదయ్య
నా పెండ్లయిన 15 రోజులకు ఊళ్లో ఈ సినిమా షూటింగ్ షురువయ్యింది. నేను కొత్త పెండ్లి పిలగాన్నే.. ఈ సినిమాలోని కిష్టయ్య కొత్త పెండ్లి పిలగాడే. మమతా శంకర్‌ను మా ఊరు ఆడపడుచుగా భావిస్తాం. ఆమెకు పద్మ శ్రీ రావడం సంతోషం.
మా ఇంటకి: డబ్బీకార్ రఘుజీ
సినిమాలో ఉండే కటికె కౌశీబాయి మా అమ్మనే. మమతా శంకర్ పిడికెల కోసం మా ఇంటకి వస్తుంది. అప్పుడు ఆమె మీద దొంగతనం నెపాన్ని వేస్తారు. ఆ సినిమా.. అందులో నటించిన మమతా శంకర్‌కు మా మనసుల్లో స్థానం ఎప్పటికీ ఉంటుంది.
మాకు ఫ్రీ షోలు: ఎం. నర్సింహా
ఒక ఊరి కథ సినిమాను అప్పట్లో ఎడ్లబండ్లు కట్టుకొని వెళ్లి చూసినం. వారం రోజులపాటు మాకు దీపక్ థియేటర్ల ఫ్రీ షోలు వేశారు. నీలమ్మగా నటించిన మమతా శంకర్ కు పద్మ శ్రీ అవార్డొచ్చిందని తెలిస్తే మా నీలమ్మకే వచ్చిందని సంబర పడుతున్నారు చీదేడ్ ప్రజలు.