- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Valentine's Day : ప్రేమొక్కటే సరిపోదు! ఇవి కూడా కావాలి!!

దిశ, ఫీచర్స్ : సంతోషంగా ఉండాలంటే ఏం కావాలి? ఇప్పుడు ఏ యువతీ యువకులను కదిలించినా? ఇంకే కావాలి? మంచి మనసు, గుండె నిండా ప్రేమ ఉంటే చాలదా? అనేవారే ఎక్కువ. ఎందుకంటే అసలే ఇది వాలెంటైన్స్ డే నేపథ్యం. ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది ప్రేమికులు ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. తమ ప్రేమను వ్యక్తం చేసుకునేందుకు ఇదో మంచి అవకాశంగా, ప్రత్యేక సందర్భంగా భావిస్తారు చాలా మంది లవర్స్. అయితే ప్రేమించడం తప్పు కాదు. దానిని నిలబెట్టుకోవాలంటే, జీవితంలో సంతోషంగా ఉండాలంటే ప్రేమతోపాటు ఇంకా అనేకం కావాలంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దామా ?
దంపతులైనా, ప్రేమికులైనా ఎల్లప్పుడూ అన్యోన్యంగా, ఆనందంగా ఉండాలంటే జస్ట్ లవ్ ఒక్కటే సరిపోదు. ఇంకా అనేక అవసరాలు ఉంటాయని, నేటి యువతకు వాటిపట్ల ముందస్తు అవగాహన అవసరమని హ్యూమన్ రిలేషన్స్ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. ప్రేమ జీవితంలో ఒక భాగం తప్ప. ‘ప్రేమే జీవితం కాదని, అదొక్కటి ఉన్నంత మాత్రాన జీవించేస్తాం’ అనుకోవడం పొరపాటని చెబుతున్నారు. ప్రేమ ఉంటే అన్నీ సాధ్యమే అనేది వినడానికి బాగుంటుందేమో కానీ.. ఆచరణలో అనేక అంశాలు ముడిపడి ఉంటాయి. ప్రేమతోపాటు మనుషులకు స్వేచ్ఛ, ఆత్మగౌరవం, జీవించడానికి అవసరమైన ఆర్థిక వనరులు, పరిస్థితులు, దంపతుల మధ్య సెక్స్, కుటుంబంపట్ల బాధ్యత ఇవన్నీ అవసరం కావాల్సిందే.
అభిప్రాయాలు.. ఆత్మగౌరవం
ప్రతీ వ్యక్తి తాను గౌరవించబడాలని కోరుకుంటారు. ఇది మానవ సహజ లక్షణం. జీవితంలోనూ అంతే ఎంత ప్రేమ ఉన్నా గౌరవం లేని చోట బతకడం కష్టం అంటున్నారు నిపుణులు. అందుకే పరస్పరం ప్రేమించుకోవడమే కాదు, ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకోవాలని సూచిస్తున్నారు. ఒంటరిగా ఉన్నప్పుడే కాదు. నలుగురిలోనూ తమ గౌరవానికి ఇబ్బంది రాకుండా చూసుకోవడం ప్రేమికులకు చాలా ముఖ్యం అంటున్నారు.
స్వేచ్ఛ, స్వాతంత్య్రం
ప్రేమించడంలో తప్పు లేదు. కానీ ఆ తర్వాత జీవితం ఎలా ఉంటుందో ఆలోచించారా? మీరు ప్రేమించిన అమ్మాయిని లేదా అబ్బాయిని స్వేచ్ఛగా ఉండనిస్తున్నారా? ప్రేమ పేరుతో ఒక రకంగా వేధిస్తున్నారా? ఇది తెలుసుకోవాలి. ఎంత ప్రేమించుకున్నా వ్యక్తులకు పర్సనల్ స్పేస్ కూడా అవసరం. రిలేషన్ షిప్‌లో ఉన్నంత మాత్రానా ప్రతీ సందర్భంలో తన భాగస్వామి ఏం చేస్తుంది? ఏం నిర్ణయం తీసుకుంటుంది? ఏం కొంటుంది? ఎక్కడికెళ్తుంది? డబ్బు ఆమెకెందుకు అన్నీ నేను చూసుకుంటానుగా అనే ధోరణి మీ బంధాన్ని విచ్ఛిన్నం చేయవచ్చు అంటున్నారు నిపుణులు. ఇటువంటి ధోరణి ఉన్నచోట ప్రేమ ఎలా ఉంటుందని కూడా ప్రశ్నిస్తుంటారు కొందరు. అందుకే మీది నిజమైన ప్రేమ అయితే, నిజంగా ప్రేమిస్తే మీ ప్రేమికురాలు లేదా ప్రియుడికి వ్యక్తిగతంగా స్వేచ్ఛ, స్వాతంత్ర్యం కూడా ఉంటాయని, వాటికి మీరు ఇబ్బంది కలిగించకూడదని కూడా గుర్తుంచుకోండి.
అపార్థాలు కాదు, అర్థం చేసుకోండి
ప్రేమించుకున్నంత మాత్రాన జీవితంలో అన్ని సందర్భాల్లోనూ, అన్ని విషయాల్లోనూ ఏకాభిప్రాయాలే ఉండాల్సిన అవసరం లేదు. నచ్చిన డ్రెస్ కావాలనుకోవడం, తనకు వచ్చే సాలరీలో తనకోసం కూడా కొంత కేటాయించుకోవడం తప్పు పట్టాల్సిన విషయాలు కావు. అలా చేసి లెక్కలు చూపకపోవడం అనేవి ఎల్లప్పుడూ ప్రశ్నించాల్సిన విషయాలు కావు. అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. అర్థం చేసుకొని మసలు కోవాల్సినవి అంటున్నారు నిపుణులు. ఇవేగాకాకుండా ఏం తినాలి? ఏం తిన కూడదు, ఫలానా బట్టలే వేసుకోవాలి. ఫలానా విధంగానే అలంకరించుకోవాలి. ఫలా సంప్రదాయమే పాటించాలి అనే పితృస్వామిక భావజాలం ఈరోజుల్లో వర్తింపజేయడమంటే.. వ్యక్తిగత స్వేచ్ఛను హరించినట్లే లెక్క. కాబట్టి ప్రేమించినంత మాత్రాన వ్యక్తిగత స్వేచ్ఛను హరించాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణుల.
నమ్మకం, నిజాయితీ
నమ్మకం, నిజాయితీ అనేది మనుషులను నడిపిస్తుంది. వ్యక్తులమధ్య, వ్యవస్థపట్ల ప్రేమను పెంచుతుంది. ముఖ్యంగా రిలేషన్ షిప్‌లో నమ్మకం చాలా ముఖ్యం. అది ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తిలో అన్నీ మంచి లక్షణాలే కనిపిస్తుంటాయి. అదే నమ్మకం కోల్పోయినప్పుడు ఏం చేసినా అనుమానాలే పొడచూపుతాయి. ఒకరిపట్ల ఒకరికి నమ్మకం ఉన్నప్పుడు అక్కడ ప్రేమ నిలబడుతుంది. నమ్మకం కోల్పోయినప్పుడు ప్రేమ స్థానాన్ని అనుమానం, అవమానం, హేళన, కోపం, బాధ వంటివి ఆవహిస్తాయి. అందుకే పరస్పరం నమ్మకంగా ఉండాలంటున్నారు నిపుణులు.
శృంగార జీవితం కూడా ..
మీలో ఎంత ప్రేమ ఉన్నా సరే పెళ్లి చేసుకున్నాక లైంగిక జీవితం కూడా చాలా ముఖ్యం. అందుకు అవసరమైన సానుకూల వాతావరణం, ఆలోచనలు లేకుంటే సంతోషంగా ఉండలేరు. సెక్స్ అనేది దంపతుల మధ్య దూరాన్ని తగ్గించి, ఒకరికొకరు మరింత దగ్గరయ్యేలా చేస్తుంది. దీనివల్ల ఒకరిపట్ల ఒకరికి ఉన్న ప్రేమ రెట్టింపవుతుంది. ఎప్పుడైతే లైంగిక పరమైన ఆనందానికి దగ్గర అవుతారో అప్పుడు ఆ బంధం మరింత బలపడుతుందని నిపుణులు అంటున్నారు. ప్రేమతోపాటు శృంగారం కూడా జీవితంలో ముఖ్యమైందని గుర్తుంచుకోండి.
గుడ్ కమ్యూనికేషన్
ప్రేమ, నమ్మకం, జీవితానికి సరిపడే సౌకర్యాలే కాదు. ఇద్దరు ప్రేమికులు లేదా దంపతులు మధ్య సరైన కమ్యూనికేషన్ లేకపోయినా ఇబ్బందులు, సమస్యలు తలెత్తతాయి. కుటుంబ సమస్యలు, ఆర్థికపరమైన విషయాలు, ముఖ్యమైన సంఘటనలు, సన్నివేశాలు, ఫంక్షన్లు, పెళ్లిళ్లు, పిల్లలకు సంబంధించిన విషయాల్లో ఏకపక్ష నిర్ణయాలు కాకుండా కలిసి నిర్ణయం తీసుకోవాలి. భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు కూడా కమ్యూనికేట్ చేసే తీరువల్ల ఏకాభిప్రాయానికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యక్తిగత జీవితానికైనా, సామాజిక జీవితానికైనా ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ చాలా ముఖ్యం అంటున్నారు నిపుణులు.