- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Wild Fire.. ఈ పాపం ఎవరిది పుష్పా.?

పరస్పర సహకారమే ప్రకృతి ధర్మం.
కానీ..
భూమిపై మనిషే కీలకం కదా.
సారు ఊరుకుంటాడా.?
కారణాలేవైనా కావచ్చు.
ప్రకృతి విధ్వంసమవుతోంది.
ఫలితంగా.. మనిషి మనుగడ ప్రశ్నార్థకమవుతోంది.
చూస్తున్నాం కదా.. లాస్ ఏంజిల్స్ కార్చిచ్చు ఎంత పని చేసిందో.?
జీవుల మధ్య స్నేహపూర్వక ధర్మం కొనసాగితే ప్రకృతి బాగున్నట్టే. కానీ అది జరగట్లేదు. లోపమెక్కడుందో ఏమోగానీ ఈ మధ్య ప్రకృతి ప్రకోపం తీవ్రమైంది. ప్రకృతిని మనం ఎంత మంచిగా కాపాడుకుంటే అది మనల్ని అంత క్షేమంగా చూసుకుంటుంది. మనం నిర్లక్ష్యం చేస్తే.. అది మనల్ని లెక్క చేయదు.!
ప్రకృతి కోసం పోటీ వద్దా.?
ఏమైంది లాస్ ఏంజిల్స్‌లో.? ఏమిటా అగ్ని కీలలు.? ఏమిటా హాహాకారాలు.? ఎవరు చేసిన తప్పిదం ఇది.? చల్లారని ఆ మంటలు కాష్టంలా మారిపోయి మనిషిని కాటేస్తున్నాయి. తీరికలేకుండా సంపాదించుకున్నారు. పోటీపడి పరిగెత్తారు. నువ్వా నేనా సై అని దూసుకెళ్లారు. ఏమైందిప్పుడు అగ్నిలో చిక్కుకొని గిలగిలా కొట్టుకుంటున్నారు. మనం పోటీలు పడి డబ్బులు.. ఆస్తులు సంపాదిస్తాం కానీ.. అదే పోటీతత్వం ప్రకృతిని కాపాడటంలో ఉండదనేది మరోసారి రుజువైంది.!
ఎవరు చేసిన డ్యామేజీ.?
కొందరి బాధ్యతారాహిత్యం ఇలా అందర్నీ వెంటాడుతోంది. 12వేల ఇండ్లు పూర్తిగా నాశనమయ్యాయంటే అదెంతటి పెద్ద విపత్తో అర్థం చేసుకోవచ్చు. అగ్ని కీలల్లో చిక్కుకొని 24 మంది బూడిదైపోయారు. ఎంతటి ఘోరమిది.? ఇంకా 16 మంది ఆచూకీ తెలియడం లేదట. మండుతున్న ఆ మంటల్లో వాళ్లూ ఉన్నారా.? ఏమో చెప్పలేం. పాపం.. ప్రాణాలే కాదు.. సంపాదించుకున్న పైసలు.. పత్రాలు.. అవార్డులు.. ప్రశంసలన్నీ వారితోపాటు బుగ్గి అయిపోయాయి. ఎవరు చేసిన పాపమిది.? ప్రకృతికి విరుద్ధంగా మనిషి నడుచుకోవడం వల్లనే కదా ఈ డ్యామేజంతా.?
జరిగాక శాపనార్థాలా.?
అడవుల్ని నరికేస్తాం. ఫ్యాక్టరీలను ప్రోత్సహిస్తాం. విష రసాయనాలను కాలువల్లోకి వదులుతాం. చెరువులను ధ్వంసం చేస్తాం. అడుగడుగునా భూమికి రంధ్రాలేసి బోర్లు తవ్వుతాం. ఇగ ఎందుకు రావు భూకంపాలు.. సునామీలు.? ఇలా చేస్తే ఎందుకు సంభవించవు అతివృష్టి.. అనావృష్టిలు.? ఎందుకు ఎగిసిపడవు అగ్ని జ్వాలలు.? చేసేదంతా చేసి.. తీరా నష్టం జరిగేసరికి దయలేని ప్రకృతి అని శాపనార్థాలు పెట్టి శాంతి కోరుకుంటాం. అడవులను నరికేయకపోతే లాస్ ఏంజిల్స్ అగ్ని ప్రమాదం జరిగి రూ.21 లక్షల కోట్ల ఆస్తి నష్టం జరుగునా.? మళ్లీ ఏం చేస్తే పోగవుతుంది ఆ సంపదంతా.. ఎన్నేండ్లు పడుతుంది.?
అంతా ఒక్కటే రాజా.!
ప్రకృతి ముందు ఉన్నోడు.. లేనోడు అనే తేడా ఉండదు. కరోనా కాలంలో చూశాం కదా.? కోట్ల రూపాయలు చేతిలో ఉన్నొళ్లు కూడా ప్రాణాలను కాపాడుకోలేక పోయారు. లాస్ ఏంజిల్స్‌లో కూడా అందరూ సంపన్నులే. వ్యాపార, రాజకీయ దిగ్గజాలు, హాలీవుడ్ సెలబ్రిటీలు ఉంటారక్కడ. కానీ వాళ్లు కూడా కార్చిచ్చుకు భయపడి బతుకు జీవుడా అంటూ ప్రాణాలు అరచేతిలో పట్టుకొని పరుగులు తీశారు. వందల కోట్ల రూపాయల విలువైన విలాసవంతమైన ఇండ్లను, ఖరీదైన కార్లను వదిలేసి వెళ్లిపోయారు. డబ్బుతో దేన్నయినా కొనేయొచ్చు అనుకునేవాళ్లు దీనిని చూసి చాలా నేర్చుకోవచ్చు.!
అంత జరిగినా మారవా.?
‘సిటీ ఆఫ్ ఏంజెల్స్’ ఇప్పుడు అంద విహీనంగా మారడానికి కారణమేంటో ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇంత జరిగినా మార్పు రాకపోతే ఎలా.? ఇప్పుడక్కడ నీటి కొరత వేధిస్తోంది. ఇంటి గార్డెన్‌కు వారానికి రెండుసార్లు, అది కూడా ఒక్కోసారి 8 నిమిషాలకు మించి నీరు పట్టకూడదు అనేది నిబంధన. అయితే దానికంటే 8 లక్షల లీటర్లకుపైగా నీటిని వాడటం వల్ల సామాన్యులు నీటి కొరత ఏర్పడుతోంది. కార్చిచ్చు వల్ల లక్షల మంది ఇండ్లను ఖాళీ చేసి వెళ్లిపోతుంటే కొందరు సెలబ్రిటీలేమో ఇలా నీటిని దుబారా చేస్తున్నారట. ఇక ఏమనాలి అలాంటి వాళ్లను.?
పర్యావరణం వద్దా.?
లాస్ ఏంజిల్స్ అగ్నిప్రమాదానికి వాతావరణ మార్పులే కారణమట. అడవులను నరికి ప్రజలు ఇండ్లు కట్టుకోవడం వల్లనే పర్యావరణం వేడెక్కి ఈ పరిస్థితి దాపురించిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. లాస్ ఏంజిల్స్ ప్రజలైనా.. ఇంకొకరైనా ముందు ప్రకృతిని కాపాడటం నేర్చుకోవాలి. చెట్లు కొట్టేసి.. స్వచ్ఛమైన గాలిరావాలంటే.. వానలు సరిగా పడాలంటే ఎలా.? న్యూ ఇయర్ వేడుకల్లో పేల్చిన బాణసంచా వల్లే కార్చిచ్చు కారణమైందని కొందరంటున్నారు. ఇదికూడా వాలిడ్ పాయింటే. నూతన సంవత్సరం వస్తే మరీ అంత సంబరం దేనికీ.? వాతావరణాన్ని పాడుచేసి శబ్ద, వాయు కాలుష్యానికి దారితీసే అంతటి భారీ బాణసంచా కాల్చడం ఎందుకో ఆత్మ విమర్శ చేసుకోవాలి. సోంచో జర.!
ఫైనల్‌గా.. ఏదైనా మన చేతుల్లోనే ఉంది బాస్. పర్యావరణాన్ని కాపాడాలనే జిజ్ఞాస చిన్నప్పటి నుంచే ఉండాలి. పర్యావరణం బాగుంటే ఎప్పుడు పడాల్సిన వానలు అప్పుడే పడతాయి.. భూమి కంపించదు.. తుపాన్లు రావు.. అగ్నిప్రమాదాలు సంభవించవు. టేక్ కేర్..!